breaking news
Capital region villages
-
రాజధాని ప్రాంతంలోకి ఎగదన్నిన కృష్ణా వరద
సాక్షి,అమరావతి/తాడేపల్లిరూరల్/పటమట(విజయవాడ తూర్పు): కృష్ణా నదిలో వరద ప్రవాహం ఆరు లక్షల క్యూసెక్కుల కంటే ఎక్కువైతే రాజధాని ప్రాంతాన్ని వరద ముంచెత్తుతుందన్న విషయం మరోసారి రుజువైంది. సోమవారం ఉదయం 7 గంటల నుంచి పది గంటల వరకూ ప్రకాశం బ్యారేజీలోకి గరిష్టంగా 7.03 లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహం రావడంతో ఉండవల్లి అవుట్‌ఫాల్ స్లూయిజ్ గుండా కృష్ణా వరద నీరు కొండవీటివాగులోకి ఎగదన్నింది. ఈ వరద నీరు రాజధాని ప్రాంతంలోని ఉండవల్లి, పెనుమాకల్లోని పొలాలను ముంచెత్తింది. కొండవీటివాగు వరద 5 వేల క్యూసెక్కులను ప్రకాశం బ్యారేజీలోకి ఎత్తిపోయడానికి గతంలో టీడీపీ సర్కార్ రూ. 237 కోట్లతో నిర్మించిన ఎత్తిపోతల పథకం ఏమాత్రం ప్రభావం చూపలేకపోయింది. 2009, అక్టోబర్ 5న ప్రకాశం బ్యారేజీకి గరిష్టంగా 11,10,404 క్యూసెక్కుల వరద వచ్చింది. ఆ తరహాలో ఇప్పుడు వరద వచ్చి ఉంటే.. రాజధానిలోని 29 గ్రామాల్లో 71 శాతానికిపైగా ముంపునకు గురయ్యేవని సాగునీటిరంగ నిపుణులు చెబుతున్నారు. వీటిని పరిగణనలోకి తీసుకునే తుళ్లూరు, తాడేపల్లి, మంగళగిరి మండలాల్లోని 29 గ్రామాల పరిధిలో రాజధాని నిర్మాణం ఏమాత్రం అనుకూలమైనది కాదంటూ అప్పట్లో శివరామకృష్ణన్ కమిటీ, పర్యావరణవేత్తలు, చెన్నై–ఐఐటీ, జాతీయ హరిత ట్రిబ్యునల్(ఎన్జీటీ) స్పష్టం చేశాయని ఆ నిపుణులు గుర్తు చేస్తున్నారు. దేవినేని ఉమా హడావుడి కొండవీటివాగు ఎత్తిపోతల వద్ద టీడీపీ నేత దేవినేని ఉమా హడావుడి చేశారు. ఇరిగేషన్ అధికారులు మోటార్లను ఆఫ్ చేసిన తర్వాత అక్కడకి చేరుకున్న ఆయన రాజధాని మునిగిపోతుంటే ఇంజన్లు ఆఫ్ చేస్తారా అంటూ హంగామా సృష్టించారు. మోటార్లు ఆన్ చేస్తే కృష్ణానదిలో నుంచి వరదనీరు ఉధృతంగా వస్తోందని అక్కడి సిబ్బంది చెప్పినా వినకుండా మళ్లీ మోటార్లు ఆన్‌చేయించారు. చేసిన తప్పు కప్పిపుచ్చుకునేందుకు దేవినేని ఉమా హడావుడి చేస్తున్నారని అక్కడ ఉన్న వారు విమర్శించారు. ఇదో అవినీతి గోడ.. విజయవాడ ప్రకాశం బ్యారేజీ దిగువున సుమారు 10 వేల కుటుంబాలు నివాసాలుండే ప్రాంతాన్ని వరద ముప్పు నుంచి రక్షించడానికి రిటైనింగ్ వాల్ నిర్మించడానికి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో అనుమతి ఇచ్చారు. ఆయన మరణానంతరం ఈ ప్రతిపాదన అటకెక్కింది. గత ప్రభుత్వం హయాంలో ఈ వాల్ నిర్మాణం జరిగింది. 11.5 మీటర్ల ఎత్తున 2.3 కిలోమీటర్ల పరిధిలో రూ. 164 కోట్ల అంచనాతో తమకు అనుకూలమైన కాంట్రాక్టర్‌తో పనులు చేయించారు. లెవలింగ్ లేకుండా నిర్మాణం, నాసిరకమైన మెటీరియల్ వల్ల ఆ గోడకు చిల్లుపడింది. ఇప్పుడు వరద నీరు నివాసాలను ముంచెత్తింది. కొండవీటివాగుకు వరద వచ్చి ఉంటే.. ► ప్రకాశం బ్యారేజీ వద్ద కృష్ణా గరిష్ట వరద నీటిమట్టం 21.50 మీటర్లు. కొండవీటివాగు గరిష్ట వరద నీటిమట్టం 17.50 మీటర్లు. అంటే.. కృష్ణా నది గరిష్ట వరద నీటిమట్టం కంటే కొండవీటివాగు వరద నీటిమట్టం దిగువన ఉంటుంది. ► సోమవారం కృష్ణా నదిలో వరద పెరగడంతో దిగువన ఉన్న కొండవీటివాగులోకి నీరు ఎగదన్నింది. ► కొండవీటివాగు వరద ప్రవాహాన్ని ప్రకాశం బ్యారేజీలోకి ఎత్తిపోసి, రాజధానికి ముంపు ముప్పును తప్పించడానికి టీడీపీ సర్కార్ నిర్మించిన ఎత్తిపోతల ఎలాంటి ప్రభావం చూపలేకపోయింది. ► సోమవారం ఆరు మోటార్ల ద్వారా రెండు వేల క్యూసెక్కులను ఎత్తిపోసినా.. కృష్ణా నదిలోని నీరు స్లూయిజ్ ద్వారా కొండవీటివాగులోకి మళ్లీ వచ్చింది. ► రాజధాని గ్రామాల్లో ప్రవహించే కొండవీటివాగు పరీవాహక ప్రాంతంలో వర్షాలు లేకపోవడం వల్ల సోమవారం ఆవాగులో వరద ఉధృతి లేదు. ఒకవేళ వరద ప్రవాహం ఉంటే.. వాగు పరివాహక ప్రాంతం 221.5 చదరపు కిలోమీటర్ల పరిధిలో ముంపు ముప్పు తీవ్రంగా ఉండేదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. -
సర్వే జాబితాలు గజిబిజి
- గందరగోళానికి గురవుతున్న రాజధాని ప్రాంత గ్రామాలు - ఇంటి నంబర్లు లేదా పేర్లు వారీగా ప్రచురించాలని డిమాండ్ - ఆ తరువాతే అభ్యంతరాలు స్వీకరించాలని అధికారులకు విన్నపం మంగళగిరి : రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ (సీఆర్డీఏ) నిర్వహించిన సామాజిక ఆర్థిక సర్వే జాబితాలు రైతులను గందరగోళానికి గురిచేస్తున్నాయి. ఆ జాబితాలో తమ వివరాలు అర్థం కాక అయోమయానికి గురవుతున్నారు. కొద్ది రోజులు కిందట సీఆర్డీఏ రాజధాని ప్రాంతంలో సామాజిక ఆర్థిక సర్వే నిర్వహించింది. ఆ జాబితాలను ఆయా పంచాయతీ కార్యాలయాల నోటీసు బోర్డుల్లో ఉంచింది. దీనిపై ఈ నెల 18 వరకు అభ్యంతరాలను స్వీకరించనున్నారు. ఇందుకోసం ఆయా గ్రామస్తులు పంచాయతీ కార్యాలయాలకు వెళ్లి తమ వివరాల కోసం జాబితాల్లో ప్రయత్నించగా, అవి తికమకగా ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సర్వే జాబితాలో రైతులు తమ పేర్లు సరి చూసుకోవాలంటే ఒక్కొక్కరికి నెల సమయం కావాలని పంచాయతీ కార్యదర్శులే వ్యాఖ్యానిస్తున్నారంటే ఆ జాబితాలు ఎంత గందరగోళంగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. ఇంటి నంబర్లు, లేదా అక్షర క్రమంలో పేర్లు ప్రకటించినా సరిచూసుకునేందుకు సులువుగా వుండేది. ఇలా కాకుండా, ఒకే కుటుంబానికి సంబంధించిన వివరాలు వేర్వేరు చోట్ల ఉండడం గందరగోళానికి గురిచేస్తోంది. దీంతో అంత సమయం కేటాయించలేక గ్రామస్తులు వెనుదిరిగి వెళుతున్నారు. సర్వేకు సంబంధించి ఒక్కో గ్రామానికి నాలుగైదు బుక్లెట్లను తయారు చేసి పంచాయతీ కార్యాలయాలలో ఉంచారు. ఇవి కూడా ఓ ఇంటి నంబర్ నుంచి మరో ఇంటి నంబర్ వరకు ఓ బుక్లెట్ అనే విధానం కానీ, అక్షర క్రమం కానీ లేకపోవడంతో ఏ బుక్‌లెట్‌లో తమ పేరు వుందనేది చూసుకోవడానికే గంటల సమయం పడుతుంది. రోజుకు పది మంది కూడా పేర్లు సరి చూసుకోవడానికి ఇబ్బందులు పడుతుంటే 18వ తేదీలోపు అభ్యంతరాలు ఎలా తెలియజేస్తారని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. అంతేకాక భవిష్యత్‌లో ప్రభుత్వం రాజధాని గ్రామాలకు ఏ పథకం కేటాయించినా సర్వే జాబితా ఆధారంగానే వర్తింపచేసే అవకాశం ఉండడంతో రైతులు, కౌలు రైతులు,రైతు కూలీలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. సర్వే జాబితాలను ఇంటి నంబర్ల ఆధారంగా లేదా పేర్లు వరుస క్రమంలో తయారు చేసి ప్రకటించాలని, ఆ తరువాత అభ్యంతరాలకు సమయం ఇవ్వాలని కోరుతున్నారు.