cable TV channels
-
రాష్ట్రమంతా ‘నెట్టిల్లు’
సాక్షి, హైదరాబాద్: ఒకే ఒక్క ఇంటర్నెట్ కనెక్షన్.. మీ నట్టింట్లోని టెలివిజన్ తెరను కంప్యూటర్‌గా (వర్చువల్ డెస్క్ టాప్) మార్చేస్తుంది. వైఫై సేవ లతో పాటు కేబుల్ టీవీ అందుబాటులోకి వస్తుంది. మీ టీవీని, లేదా సెల్‌ఫోన్‌ను సీసీ కెమెరాలతో అనుసంధానించుకోవచ్చు. కేబుల్ టీవీ చానళ్లతో పాటు పిల్లలకు పాఠాలు చెప్పే టీ శాట్ చానళ్లు కూడా చూసేందుకు వీలవుతుంది. కేబుల్ ఆపరేటర్‌కు మీరు నెలా చెల్లించే మొత్తంలోనే వీటితో పాటు యూట్యూబ్, గూగుల్, ఓటీటీ లాంటి సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయి.తక్కువ ఖర్చు తో అపరిమిత హై స్పీడ్ బ్రాడ్‌బ్యాండ్ సేవలను నిరంతరం వినియోగించుకునే వెసులుబాటు వినియోగదారులకు దక్కుతుంది. ‘భారత్ నెట్’ప్రాజె క్టులో భాగంగా ఈ తరహా సౌకర్యాన్ని త్వరలో తెలంగాణలోని మారుమూల ప్రాంతాల్లోనూ అందుబాటులోకి తెచ్చేందుకు తెలంగాణ ఫైబర్ గ్రిడ్ కార్పొరేషన్ ప్రయత్నాలు చేస్తోంది. రూ.300కే కనెక్షన్ ప్రస్తుతం బీఎస్ఎన్ఎల్తో పాటు పలు ప్రైవేటు సంస్థలు ఇంటర్నెట్ సౌకర్యాన్ని కల్పిస్తున్నాయి. తాజాగా టీ ఫైబర్ ప్రాజెక్టులో భాగంగా, ఈ ఏడాది చివరి నాటికి రాష్ట్రంలోని పట్టణ ప్రాంతాల్లో 30 లక్షలు, గ్రామీణ ప్రాంతాల్లో 63 లక్షల గృహాలకు రూ.300కే ఇంటర్నెట్ కనెక్షన్ ఇచ్చే దిశగా తెలంగాణ ఫైబర్ గ్రిడ్ కార్పొరేషన్ సన్నాహాలు చేస్తోంది. ఇందులో భాగంగా 12,751 గ్రామ పంచాయతీలను ఆప్టిక్ ఫైబర్ కేబుల్ (ఓఎఫ్సీ)తో అనుసంధానించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటివరకు 5,001 గ్రామ పంచాయతీలను ఓఎఫ్‌సీతో కనెక్ట్ చేసింది. టీ ఫైబర్ పనులను పూర్తి చేసి ఇంటింటికీ ఇంటర్నెట్ కనెక్షన్ ఇవ్వడం ద్వారా 2028 నాటికి రూ.500 కోట్ల మేర ఆదాయం పొందాలని ఫైబర్ గ్రిడ్ కార్పొరేషన్ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఇంటింటికీ ఇంటర్నెట్ సేవలు అందించడంలో లోకల్ కేబుల్ ఆపరేటర్లను భాగస్వాములను చేసేందుకు తాజాగా టీ ఫైబర్ దరఖాస్తులు ఆహా్వనిస్తూ నోటిఫికేషన్ కూడా జారీ చేసింది. దీనిద్వారా లోకల్ కేబుల్ ఆపరేటర్లతో పాటు సుమారు 20 వేల మంది ఫైబర్ ఆప్టిక్ టెక్నీషియన్లకు కూడా ఉపాధి లభించనుంది. తొలి విడతలో సాంకేతిక సమస్యలు భారత్ నెట్ ప్రాజెక్టులో భాగంగా తొలి విడత రాష్ట్రంలోని మూడు ఉమ్మడి జిల్లాల పరిధిలో ఓఎఫ్సీ నెట్వర్క్ పనులు ప్రారంభించారు. ఉమ్మడి రంగారెడ్డి, నిజామాబాద్, ఖమ్మం జిల్లాల్లోని 3,089 గ్రామ పంచాయతీలకు ఓఎఫ్సీని వేసే బాధ్యతను బీఎస్ఎన్ఎల్కు అప్పగించారు. ఓఎఫ్సీ కేబుల్ లైన్లతో గ్రామాలను అనుసంధానించినా, నిర్వహణ లోపంతో (ఓవర్ ది ఎయిర్) స్తంభాలపై వేసిన కేబుల్ లైన్లను ఇష్టారీతిన తొలగించడం, ఓఎఫ్సీని కత్తిరించడం మూలంగా లైన్లు దెబ్బతిని కనెక్టివిటీ ప్రశ్నార్దకంగా మారింది. దేశ వ్యాప్తంగా ఇదే తరహా సమస్యలు తలెత్తడంతో ‘భారత్ నెట్’రెండో దశలో ఓఎఫ్సీ లైన్లు వేయడంలో ఏ తరహా సాంకేతికతను అనుసరించాలనే స్వేచ్ఛను రాష్ట్రాలకు కేంద్రం వదిలేసింది. రింగ్ టెక్నాలజీ వైపు తెలంగాణ మొగ్గు భారత్ నెట్ రెండో దశలో తెలంగాణ ఒక్కటే ఓఎఫ్సీని భూగర్భంలో వేసే ‘రింగ్ టెక్నాలజీ’వైపు మొగ్గు చూపింది. రెండో దశలో భాగంగా రాష్ట్రంలో 32 వేల కిలోమీటర్ల మేర ఓఎఫ్సీ విస్తరించగా, మరో 3,500 కిలోమీటర్ల పొడవునా కేబుల్స్ వేయాల్సి ఉంది. తెలంగాణ ప్రభుత్వం అనుసరించిన ‘రింగ్ టెక్నాలజీ’విజయవంతం కావడంతో భారత్ నెట్ ప్రాజెక్టు మూడో దశలో అన్ని రాష్ట్రాలు రింగ్ టెక్నాలజీ అనుసరించాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. అంతేకాకుండా రింగ్ టెక్నాలజీ ద్వారా ఓఎఫ్సీ విస్తరణకు అయ్యే ఖర్చును భారత్ నెట్ ప్రాజెక్టు భరించేందుకు ముందుకు వచ్చింది. ఈ నేపథ్యంలో రెండో దశలోనే రింగ్ టెక్నాలజీ అనుసరించేందుకు తాము వెచ్చించిన రూ.1,779 కోట్లను కనీసం వడ్డీలేని రుణంగా అయినా ఇవ్వాలని కేంద్రాన్ని తెలంగాణ ప్రభుత్వం కోరుతోంది. 4 గ్రామాల్లో ఉచితంగా ప్రయోగం టీ ఫైబర్ ద్వారా ప్రతి ఇంటికీ ఇంటర్నెట్ సౌకర్యం కల్పించే కార్యక్రమంలో భాగంగా ప్రయోగాత్మకంగా నాలుగు గ్రామాల్లో డిజిటలైజేషన్ చేపట్టాం. హాజిపల్లి (రంగారెడ్డి జిల్లా), మద్దూర్ (నారాయణపేట), సంగుపేట (సంగారెడ్డి), అడవి శ్రీరాంపూర్ (పెద్దపల్లి) గ్రామాల్లో ప్రతి ఇంటికీ ఇంటర్నెట్ కనెక్షన్ ఇచ్చాం. ఈ బాధ్యతను మూడు కాంట్రాక్టు సంస్థలకు అప్పగించి 3 నెలల పాటు ఇంటర్నెట్ సేవలు ఉచితంగా అందిస్తాం. తర్వాత ఒక్కో వినియోగదారుడి నుంచి కనిష్టంగా సుమారు రూ.300 చొప్పున వసూలు చేస్తాం. ప్రస్తుతం రాష్ట్రంలో 70శాతం గృహాల్లో 30 శాతం లోకల్ కేబుల్ ఆపరేటర్లు, 31శాతం డీటీహెచ్, మరో 39 శాతం ఇంటర్నెట్ ద్వారా డిజిటల్ కనెక్టివిటీ ఉంది. ఈ గృహాలన్నింటినీ భవిష్యత్తులో టీ ఫైబర్ పరిధిలోకి తీసుకువచ్చి నామమాత్ర చార్జీలతో అపరిమిత నిరంతర హైస్పీడ్ బ్రాడ్‌బ్యాండ్ సేవలు అందుబాటులోకి తెస్తాం. 15 జిల్లాల్లో డిజిటల్ కనెక్టివిటీ పనులు చివరి దశలో ఉన్నాయి. – వేణు ప్రసాద్, ఎండీ, టీ ఫైబర్ టీ ఫైబర్ ప్రాజెక్టు ప్రస్తుత స్థితి పనులు పూర్తయిన జిల్లాలు: మహబూబ్‌నగర్, జనగామ, హనుమకొండ, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట, జగిత్యాల, యాదాద్రి భువనగిరి, కరీంనగర్, గద్వాల, నారాయణపేట, వనపర్తి, వరంగల్, పెద్దపల్లి, రంగారెడ్డి, వికారాబాద్ పనులు పురోగతిలో ఉన్న జిల్లాలు: నల్లగొండ, నాగర్‌కర్నూల్ మెదక్, సూర్యాపేట, సంగారెడ్డి భారత్ నెట్ మొదటి దశలో సాంకేతిక సమస్యలు తలెత్తిన జిల్లాలు: మేడ్చల్– మల్కాజిగిరి, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, నిజామాబాద్, కామారెడ్డి అటవీ అనుమతులో పనులు ఆగిన జిల్లాలు: ఆదిలాబాద్, భూపాలపల్లి, నిర్మల్, మహబూబాబాద్, మంచిర్యాల, ఆసిఫాబాద్, ములుగు ప్రస్తుతం పనుల పరిస్థితి మొత్తం పంచాయతీలు ః 12,751 పనులు పూర్తయినవి ః 5001 పనుల పురోగతి ః 3888 అటవీ అనుమతులు కావాల్సినవి ః 773 భారత్ నెట్ మొదటి దశ సమస్యలు ః 3089 హెచ్ఎండీఏ పరిధిలో పనులు కావాల్సినవిః 1.1కోట్ల జనాభా (18 లక్షల గృహాలు) అపరిమితంగా ఇంటర్నెట్ నాలుగు నెలల క్రితం మా కాలనీలో స్మార్ట్ టీవీ ఉన్నవారికి టీ ఫైబర్ కనెక్షన్ ఇచ్చారు. మొదట యూట్యూబ్ మాత్రమే వచ్చేది. వైఫై ద్వారా నెట్ సౌకర్యం అంతంత మాత్రమే వచ్చింది. నెల తర్వాత కొన్ని చానల్స్ ఆన్ అయ్యాయి. ప్రస్తుతం యూట్యూబ్, గూగుల్, నెట్‌ఫ్లిక్స్ లాంటి ఓటీటీ యాప్‌లు అందుబాటులోకి వచ్చాయి. వైఫై స్పీడ్ కూడా దాదాపు 20 ఎంబీపీఎస్‌కు పెరిగింది. జియో, ఎయిర్టెల్ లాంటి ప్రైవేట్ సంస్థలు ఆప్టిక్ ఫైబర్ ద్వారా సేవలందిస్తున్నాయి. ఈ సంస్థలకు ప్రతినెలా రూ.700 నుంచి రూ.900 వరకు చెల్లించాల్సి వచ్చేది. టీ ఫైబర్‌కు ప్రస్తుతం ఎలాంటి రుసుము తీసుకోవడం లేదు. – మిట్టే చంద్రశేఖర్, మద్దూర్, నారాయణపేట జిల్లా అప్పుడప్పుడు సిగ్నల్స్ సమస్య వస్తోంది.. ఫైబర్ నెట్ వినియోగంలో కొంత సిగ్నల్స్ సమస్యలు ఏర్పడుతున్నాయి. కరెంట్ పోయి వచ్చిన సందర్భాల్లో సిగ్నల్స్ రావడానికి 20 నిమిషాల సమయం పడుతోంది. అయితే సిగ్నల్స్ సమస్య వచ్చినప్పుడు గ్రామంలో ఫైబర్ నెట్ ఆపరేట్ చేసే వ్యక్తికి తెలియజేయగానే వెంటనే వచ్చి సరిచేస్తున్నారు. గ్రామంలో నెట్ వినియోగించుకోవడం తెలియని వారికి వివరంగా తెలియజేస్తున్నారు. – వెంకటేశ్వర్ గౌడ్, సంగుపేట, సంగారెడ్డి జిల్లా -
కేబిల్లు గుభేలు..!
‘మీరు వినియోగిస్తున్న కేబుల్ ప్యాకేజీ మారింది. ఇదివరకున్న బేసిక్ ప్యాకేజీని బెస్ట్ ఫిట్ ప్యాక్‌లోకి మార్చాము. ట్రాయ్ సూచనల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నాం.’–ఓ డీటీహెచ్ సర్వీస్ ప్రొవైడర్ నుంచి కస్టమర్‌కు వచ్చిన ఎస్ఎంఎస్ సారాంశమిది. వాస్తవానికి ఈనెలాఖరు వరకు కస్టమర్ ఎంపిక చేసుకున్న ప్యాకేజీ అమలు చేయాలని కేంద్రం స్పష్టం చేసింది. కానీ కేబుల్ ఆపరేటర్లు, సర్వీసు ప్రొవైడర్లు అత్యుత్సాహం చూపుతూ చానళ్లను తొలగిస్తున్నారు. డీటీహెచ్ సర్వీస్ ప్రొవైడర్లు ఎస్ఎంఎస్లు పంపుతుండగా, కేబుల్ ఆపరేటర్లు సమాచారం ఇవ్వకుండానే చానళ్లకు కోత పెడుతున్నారు. సాక్షి, హైదరాబాద్: కేబుల్ చానల్ వినియోగదారులకు ఆపరేటర్లు, సర్వీసు ప్రొవైడర్లు చుక్కలు చూపిస్తున్నారు. వినియోగదారుడు ఎంపిక చేసుకున్న ప్యాకేజీని ఆపరేటర్లు, డీటీహెచ్ ప్రొవైడర్లు ఒక్కసారిగా మార్చేస్తున్నారు. ట్రాయ్ సూచనలంటూ పలు చానెళ్లకు కోతపెడుతున్నారు. సాధారణంగా వినియోగదారుడు ఎంపిక చేసుకున్న ప్యాకేజీని మధ్యలో మార్చే వీలుండదు. ఎందుకంటే ఎంపిక చేసుకున్న ప్యాకేజీకి బిల్లును చెల్లించేయడంతో గడువు ముగిసే వరకు సేవలందించాలి. కేబుల్ చానళ్ల విషయంలో ట్రాయ్ సూచనలు చేసిన నేపథ్యంలో ఆపరేటర్లు, ప్రొవైడర్లు ఒక్కసారిగా తమ పంథాను మార్చేసుకున్నారు. వినియోగదారున్ని సంప్రదించకుండానే ప్యాకేజీలు మార్చేయడంతో తీవ్ర గందరగోళం చోటుచేసుకుంటోంది. వాస్తవానికి మార్చి 31వరకు చానళ్ల ఎంపికకు గడువున్నప్పటికీ నిబంధనలను బేఖాతరు చేస్తున్న ఆపరేటర్లు, ప్రొవైడర్లు చానళ్లను కట్ చేస్తున్నారు. డిమాండ్ ఉన్న చానళ్లకు కత్తెర రాష్ట్రంలో ఎక్కువ మంది తెలుగు చానళ్లు చూస్తుంటారు. హిందీ, ఇంగ్లీష్ చానళ్లకు పట్టణ ప్రాంతాల్లో ఎక్కువ మంది వినియోగదారులున్నప్పటికీ... గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం తెలుగు చానళ్లకే ఎక్కువ వీక్షకులున్నారు. తాజాగా ట్రాయ్ సూచనలు సాకుగా చూపుతున్న ఆపరేటర్లు, డీటీహెచ్ ప్రొవైడర్లు కీలకమైన చానళ్లకు కోత పెట్టేశారు. రాష్ట్రంలో దాదాపు 85శాతం వినియోగదారులు ఈ సమస్యతో లబోదిబోమంటున్నారు. ఈమేరకు డీటీహెచ్ ఆపరేటర్లు వినియోగదారులకు ఎస్ఎంఎస్లు పంపిస్తుండగా, కేబుల్ ఆపరేటర్లు మాత్రం అలాంటి సమాచారం ఇవ్వకుండానే కోత పెడుతున్నారు. తెలుగు చానళ్లతోపాటు కిడ్స్ చానళ్లు, న్యూస్ చానళ్లు కోత పడుతున్న కేటగిరీలో ఉన్నాయి. భారంగా కొత్త ప్యాకేజీ చానళ్ల కోతపై ఆపరేటర్లను ప్రశ్నిస్తే కొత్త ప్యాకేజీలోకి మారాలని సూచిస్తు న్నారు. దీంతో కొత్త ప్యాకేజీలోకి మారేందుకు ప్రయత్నిస్తే వినియోగదారుడు ఖంగుతినే పరిస్థితి వస్తోంది. కేబుల్ ఆపరేటర్లు అందిస్తున్న బేసిక్ ప్యాకేజీ కనిష్ట ధర రూ.230గా ఉంది. ఇందులో కేవలం 100 చానళ్లు మాత్రమే వచ్చినా... ఇందులో అన్ని తెలుగు చానళ్లు ప్రసారం కావు. పూర్తిస్థాయి తెలుగు చానళ్లు కావాలనుకుంటే రూ.350, న్యూస్ చానళ్లు కావాలనుకుంటే రూ.410, పిల్లలు చూసే కిడ్స్ చానళ్లు కావాలనుకుంటే రూ.450లోకి మారాల్సి వస్తుంది. ఇప్పటివరకు కేబుల్ ఆపరేటర్లకు నెలవారీగా రూ.150 నుంచి రూ.200 చొప్పున చెల్లిస్తున్న వినియోగదారులు... ఇకపై రూ.450 చెల్లించాల్సిందే. అతి తక్కువ ప్యాకేజీలో 163 చానళ్లు వస్తుండగా... ఇందులో వందకుపైగా చానళ్లుఇతర ప్రాంతీయ భాషలకు సంబం ధించినవి. దీంతో అవసరం లేకున్నా అధిక మొత్తంలో బిల్లు వసూలు చేసేందుకు ఆపరేటర్లు, ప్రొవైడర్లు ఒత్తిడి తీసుకువస్తున్నారు. -
వినోదం.. ఇక భారం
కర్నూలు (వైఎస్ఆర్ సర్కిల్): సినిమా చూడడానికి కుటుంబమంతా థియేటర్‌కు వెళితే రూ.వెయ్యికి పైగా ఖర్చవుతుంది. కొన్నాళ్లు ఆగితే ఆ సినిమా టీవీలో రాకపోతుందా అని పేద,మధ్య తరగతి కుటుంబాలు వేచిచూసేవి. ఇక నుంచి టీవీలో వచ్చినా అందరూ చూసే పరిస్థితి మాత్రం ఉండబోదు! చాలా వరకు చానెళ్లను..మరీముఖ్యంగా వినోదపు చానెళ్లను ప్యాకేజీలుగా ప్రసారం చేస్తుండడం, అన్ని చానెళ్లూ చూడాలంటే ఎక్కువ మొత్తం చెల్లించాల్సి రావడమే ఇందుకు కారణం. కేబుల్ వ్యవస్థ అందుబాటులోకి వచ్చాక సామాన్యులు సైతం టెలివిజన్‌తోనే వినోదం పంచుకునే అవకాశం వచ్చింది. నెలకు రూ.150 నుంచి రూ.250 వరకు కేబుల్ కనెక్షన్‌కు చెల్లిస్తే ఇంటిల్లిపాదీ సినిమాలు, సీరియళ్లతో కాలక్షేపం చేసే అవకాశం ఇప్పటివరకు ఉంది. ట్రాయ్ నిబంధనల నేపథ్యంలో.. సుప్రీంకోర్టు ఆదేశాలతో టెలికం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) ప్రకటించిన కేబుల్ ప్రసార విధి విధానాలు సామాన్య, మధ్య తరగతి వినియోగదారులకు భారంగా పరిణమిస్తున్నాయి. ప్రేక్షకులు కోరుకున్న చానెళ్లను మాత్రమే ప్రసారం చేయాలని, వాటికి మాత్రమే చార్జీలు వసూలు చేయాల ని ట్రాయ్ ఆదేశించింది. వినియోగదారుల శ్రేయస్సు దృష్ట్యా ఈ విధానాన్ని తెచ్చినప్పటికీ వివిధ చానెళ్లను ప్యాకేజీలుగా ప్రసారం చేస్తుండడం, వినియోగదారులు ఎక్కువగా చూస్తున్న చానెళ్లు వేర్వేరు ప్యాకేజీల్లో ఉండ డం మూలంగా ధర అమాంతం పెరిగిపోతోంది. ప్రస్తుతం జిల్లాలో కనిష్టంగా రూ. 150, గరిష్టంగా రూ.250 వరకు కేబుల్ చార్జీలను వసూలు చేస్తున్నారు. ఈ మొత్తానికి 500 వరకు చానెళ్లను ప్రసారం చేస్తున్నారు. ట్రాయ్ నిబంధన కారణంగా ప్రస్తుతం ప్రసారమవుతున్న చానెళ్లన్నీ యథాత«థంగా వీక్షించాలంటే నెలకు రూ.వెయ్యి నుంచి రూ.1,500 వరకు చెల్లించాల్సి ఉంటుంది. నేటి నుంచి పే చానెళ్లు బంద్! నూతన విధానం అమలుకు ట్రాయ్ గత డిసెంబర్ 31 గడువుగా ప్రకటించింది. ఆ తదుపరి జనవరి 31వరకు అవకాశం ఇచ్చింది. కొత్త నిబంధనల ప్రకారం ఒప్పందం చేసుకోని కేబుల్ వినియోగదారులకు ప్రసారాలు నిల్చిపోతాయని తెలిపింది. ట్రాయ్ ఆదేశాల మేరకు ప్రస్తుతం 100 ఫ్రీ ఛానెళ్లకు 18 శాతం జీఎస్టీతో రూ.153 చెల్లించాల్సి ఉంటుంది. వీటితో పాటు వేరే పే చానెళ్లను ఎంచుకుంటే వినియోగదారులపై మరింత భారం పడుతుంది. జిల్లా వ్యాప్తంగా సుమారు ఆరు లక్షల కేబుల్ కనెక్షన్లు ఉన్నాయి. ట్రాయ్ నిబంధనలు అమలు చేస్తే ఒక్కో కనెక్షన్‌పై ఎంతలేదన్నా నెలకు కనీసం రూ.200 భారం పడే అవకాశముంది. ఈ లెక్కన జిల్లా వ్యాప్తంగా నెలకు రూ.12 కోట్ల వరకు అదనంగా భరించాల్సి ఉంటుంది. తమకు కావాల్సిన వినోదం, సినిమాలు, క్రీడలకు సంబంధించిన చానెళ్లను ఆయా సంస్థలు నిర్ణయించిన ధర(ప్యాకేజీ)కు వినియోగదారుడు కొనుగోలు చేయాల్సి ఉంటుంది. కాగా..ట్రాయ్ నిబంధనల నేపథ్యంలో ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో పే చానెళ్ల ప్రసారాలను కేబుల్ ఆపరేటర్లు నిలిపివేశారు. నేటి (బుధవారం) నుంచి పూర్తి స్థాయిలో అమలు చేయనున్నట్లు తెలుస్తోంది. పెరగనున్న చార్జీలు ట్రాయ్ నిబంధనల ప్రకారం కేబుల్ టీవీ ప్రసారాలకు సంబంధించి చార్జీలు పెరగనున్నాయి. ప్రస్తుతం అమల్లోకి వచ్చిన నిబంధనల ప్రకారం ఇప్పుడు వీక్షిస్తున్న చానెళ్లన్నీ చూడాలంటే మూడు, నాలుగు రెట్లు అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. బుధవారం నుంచి నిబంధనలు పూర్తిస్థాయిలో అమలులోకి రానున్నాయి. – రాజామధు, కేబుల్ ఆపరేటర్ పేద, మధ్యతరగతి కుటుంబాలకు భారమే కేబుల్ ప్రసారాల ధరలు అమాంతంగా పెంచడం పేద, మధ్య తరగతి కుటుంబాలకు భారమే. అసలే నిత్యావసరాల ధరలు పెరిగి సతమతమవుతున్న తరుణంలో వినోదం కూడా భారం కావడం శోచనీయం. ప్రభుత్వం దృష్టి పెట్టి ఊరట కల్పించాలి. – కట్టా శేఖర్, కేబుల్ వినియోదారుడు, కర్నూలు -
త్వరలో ప్రభుత్వ కేబుల్ టీవీ
రూ.100లకు వంద చానల్స్ మంత్రి రోషన్‌బేగ్ సాక్షి, బెంగళూరు : త్వరలో ప్రభుత్వ ఆధ్వర్యంలో కేబుల్ ప్రసారాలు చేయనున్నట్లు రాష్ట్ర సమాచార శాఖ మంత్రి రోషన్‌బేగ్ స్పష్టం చేశారు. రూ. వందకే 100 ఛానళ్లను ప్రసారం చేయనున్నట్లు చెప్పారు. బెంగళూరులో ఆదివారం జరిగిన ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మీడియాతో మాట్లాడారు. కేబుల్ యాక్ట్ ప్రకారం రూ.100లకు వంద ఛానల్స్‌ను ప్రసారం చేయాల్సి ఉందన్నారు. అయితే కేబుల్ ఆపరేటర్లు వినియోగదారుల నుంచి ఇష్టం వచ్చినట్లు ఫీజులు వసూలు చేస్తున్నారన్నారు. మరో వైపు కొంతమంది కేబుల్ ఆపరేటర్లు ఇంటర్నెట్ కేబుల్ పేరుతో నిబంధనలకు విరుద్ధంగా కేబుల్ ప్రసారాలు చేస్తున్నారన్నారు. దీంతో రాష్ట్ర ఖజానాకు లక్షలాది రూపాయల గండిపడితోందని వివరించారు. నిబంధనలకు విరుద్ధంగా కేబుల్ తీగలను కరెంటు, టెలిఫోన్ స్తంభాల గుండా తీసుకువెలుతుండటం వల్ల అనేక ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. ఈ సమస్య పరిష్కారంలో భాగంగా ప్రభుత్వ ఆధ్వర్యంలో కేబుల్ ప్రసారాలను అందుబాటులోకి తీసుకురానున్నామన్నారు. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కూడా ఇందుకు సమ్మతించారని తెలిపారు. తమిళనాడులో ఇప్పటికే ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న ‘కేబుల్‌టీవీ’ మంచి ఫలితాలను ఇస్తోందన్నారు. రాష్ట్రమంతటా దశలవారిగా కేబుల్ ప్రసారాలను తీసుకువస్తామని స్పష్టం చేశారు. బెంగళూరు శివారులోని హెసరఘట్ట వద్ద నిర్మించతలపెట్టిన అత్యాధునిక ఫిల్మ్‌సిటీ విషయంపై కోర్టులో కేసు నడుస్తోందన్నారు. త్వరలోనే ఈ సమస్య పరిష్కారం అవుతుందన్నారు. బెంగళూరులోనే ప్రపంచస్థాయి ఫిల్మ్‌సిటీ ఏర్పాటు కావడం వల్ల షూటింగ్‌తో పాటు ఇక పై షూటింగ్ తదుపరి కార్యక్రమాల (పోస్ట్ ప్రొడక్షన్) కోసం చెన్నై, ముంబయ్ వంటి ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం ఉండదన్నారు. దీని చిత్ర నిర్మాణ వ్యయం తగ్గుతుందని రోషన్‌బేగ్ ఆశాభావం వ్యక్తం చేశారు.