breaking news
Business registration Duration
-
వారెవ్వా..!సరికొత్త రికార్డ్లను బద్దలు కొట్టిన అగ్రికల్చర్ బిజినెస్ రిజిస్ట్రేషన్లు
ముంబై: వ్యవసాయ రంగానికి సంబంధించి బిజినెస్ రిజిస్ట్రేషన్ల వృద్ధిలో 2020–21 ఆర్థిక సంవత్సరం రికార్డు నమోదయ్యిందని డన్ అండ్ బ్రాడ్‌స్ట్రీట్ (డీఅండ్‌బీ) నివేదిక ఒకటి తెలిపింది. 2019–20లో అగ్రి బిజినెస్ రిజిస్ట్రేషన్ల సంఖ్య 6,107 అయితే 2020–21లో ఈ సంఖ్య ఏకంగా 103 శాతం ఎగసి 12,368కు చేరిందని అంతర్జాతీయ వాణిజ్య విశ్లేషణా సంస్థ పేర్కొంది. ‘‘బిజినెస్ డైనమిజం ఇన్ ఇండియా’ పేరుతో సంస్థ రూపొందించిన శ్వేత పత్రంలో కొన్ని ముఖ్యాంశాలు.. •2020–21లో మొత్తం వ్యాపార రిజిస్ట్రేషన్లు 1,95,880. ఇది ఒక రికార్డు. •సమీక్షా కాలంలో తయారీ రంగంలో వ్యాపార రిజిస్ట్రేషన్ల సంఖ్య 50 శాతం వృద్ధితో 26,406 నుంచి 39,539కి ఎగసింది. •సేవల రంగంలో రిజిస్ట్రేషన్లు 14 శాతం వృద్ధితో 83,079కి చేరాయి. •మహమ్మారి సవాళ్లు, కఠిన లాక్డౌన్లు ఉన్నప్పటికీ కొత్త బిజినెస్ రిజిస్ట్రేషన్ల వృద్ధి రేటు జోరు 2020–21లో తగ్గలేదు. 2015–16లో ఈ వృద్ధి రేటు 7.8 శాతం. 2019–20లో 10.2 •శాతానికి చేరింది. 2020–21లో 11.6 శాతంగా నమోదయ్యింది. •వ్యవసాయోత్పత్తి, ఆహారం– ఉప ఉత్పత్తుల తయారీ, నాన్–డ్యూరబుల్ గూడ్స్ హోల్‌సేల్, కెమికల్స్ తయారీ, సామాజిక, విద్యా సేవలు, కంప్యూటర్ ఆధారిత సేవల రంగాల బిజినెస్‌లలో కొత్త రిజిస్ట్రేషన్లు భారీగా పెరిగాయి. •డ్యూరబుల్ గూడ్స్, రవాణా సేవలు, మరమ్మతు సేవలు, రెస్టారెంట్లు, బార్ల వంటి విభాగాలకు సంబంధించి రిజిస్ట్రేషన్లు క్షీణించాయి. •ముంబై, న్యూఢిల్లీ, బెంగళూరు, చెన్నై వంటి ప్రధాన నగరాల్లో బిజినెస్ రిజిస్ట్రేషన్లు సహజంగా పెరుగుతాయి. అయితే ఆయా ప్రాంతాల వెలుపల నమోదవుతున్న బిజినెస్ రిజిస్ట్రేషన్ల వాటా క్రమంగా పెరుగుతుండడం గమనార్హం. మొత్తం బిజినెస్ రిజిస్ట్రేషన్లలో టాప్–10 నగరాల వాటా 2015–16 ఆర్థిక సంవత్సరంలో 55 శాతం అయితే 2020–21లో ఈ వాటా 42కి పడిపోయంది. •కొత్తగా రిజిస్టర్ అయిన వ్యాపారాల్లో చాలా వరకు మహమ్మారి ప్రేరిత డిమాండ్ పెరిగిన రంగాలలో కేంద్రీకృతమై ఉండడం గమనార్హం. అలాగే కొత్తగా రిజిస్టర్ అయిన వ్యాపారాల్లో 96 శాతం మూలధనం 10 లక్షల వరకూ ఉంది. •అయితే ఈ స్థాయి మూలధనంతో బిజినెస్ రిజిస్ట్రేషన్ చేయించుకున్న సంస్థల్లో వ్యాపారాల్లో నిలదొక్కుకున్న సంస్థలు చాలా తక్కువని డన్ అండ్ బ్రాడ్‌స్ట్రీట్ పరిశోధన పేర్కొంటోంది. ఈ వ్యాపారాల్లో భాగస్వాములు సంస్థ నిర్వహణా విషయాల్లో అప్రమత్తతంగా ఉండాల్సిన అవసరం ఉంటుందని స్పష్టం చేసింది. -
వ్యాపార సంస్కరణలపై కేంద్రం కసరత్తు
న్యూఢిల్లీ: దేశీయంగా వ్యాపారాలకు అనువైన పరిస్థితులు కల్పించే దిశగా చర్యలపై కేంద్రం దృష్టి సారిస్తోంది. వ్యాపార రిజిస్ట్రేషన్ వ్యవధిని ఒక్క రోజుకు తగ్గించడం, అన్ని అనుమతులకు ఒకే దరఖాస్తు, కార్మిక చట్టాలను సవరించడం, వివిధ రకాల పన్నులను క్రమబద్ధీకరించడం తదితర అంశాలపై కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా వ్యాపారాలకు అనువైన దేశాల జాబితాలో భారత ర్యాంకింగ్‌ను మెరుగుపర్చేందుకు తీసుకోవాల్సిన కొన్ని సంస్కరణలు, దృష్టి సారించాల్సిన రంగాలను పారిశ్రామిక విధానం, ప్రోత్సాహక విభాగం (డీఐపీపీ) గుర్తించింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లోని వివిధ విభాగాలు తీసుకోతగిన 46 యాక్షన్ పాయింట్లతో డీఐపీపీ ఒక జాబితా రూపొందించింది. కెనడా, న్యూజిల్యాండ్ తరహాలో రిజిస్ట్రేషన్ ప్రక్రియ వ్యవధిని ప్రస్తుత 27 రోజుల నుంచి ఒక్క రోజుకు తగ్గించాలని కార్పొరేట్ వ్యవహారాల శాఖకు సూచించింది. ఇక, జాతీయ కంపెనీ చట్టాల ట్రిబ్యునల్ కింద వేగవంతంగా బెంచీలను ఏర్పాటు చేయడం, దివాలా చట్టాన్ని ప్రవేశపెట్టడం తదితర సిఫార్సులు కూడా చేసింది. అలాగే, సంక్లిష్టమైన పన్ను ప్రక్రియలను సరళతరం చేయడం, ప్రత్యక్ష పన్నుల కోడ్, వస్తు .. సేవల పన్నుల విధానాన్ని సత్వరం అమలు చేయడం మొదలైన చర్యలు చేపట్టాల్సి ఉంటుందని డీఐపీపీ పేర్కొంది. సింగిల్ విండో క్లియరెన్సుల కోసం రాష్ట్రాలన్నింటిలోనూ ఒకే రకమైన విధానాలను అమల్లోకి తేవాల్సి ఉందని వివరించింది. ఈ అంశాలపై వివిధ శాఖలతో డీఐపీపీ ఇప్పటికే చర్చలు జరుపుతోందని సంబంధిత వర్గాలు తెలిపాయి.