బిల్డర్ చుక్కపల్లి దందాలు
► కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల్లో పలుకుబడి
► అధికార దర్పంతో అధికారులపై జులుం
► బిల్డర్ చుక్కపల్లి రమేష్ తీరిది
గుంటూరు: ఆయనో పారిశ్రామిక వేత్త... 2009 శాసనసభ ఎన్నికల్లో గుంటూరు పశ్చిమ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టీడీపీ తరపున పోటీచేసి ఓటమిపాలయ్యారు. రాజకీయ పరపతితో పయనీర్ కన్స్ట్రక్షన్స్ పేరుతో బిల్డర్‌గా మారారు. ఇది ఏడుగురు కార్మికులు సజీవసమాధి అవడానికి ప్రత్యక్ష కారకుడైన టీడీపీ నేత, బిల్డర్ చుక్కపల్లి రమేష్ ఎదిగిన వ్యాపార, రాజకీయ క్రమం.. చుక్కపల్లి తొలుత ఏఈఎల్సీ స్థలాలను లీజులకు తీసుకొని పయనీర్ ఆటోమొబైల్ వ్యాపారాన్ని అందులో కొనసాగిస్తున్నారు.
నాజ్‌సెంటర్‌లోని పయనీర్ ఆటోమొబైల్ షోరూం ఉద్యోగి ఆత్మహత్య ఘటనపై అప్పట్లో చుక్కపల్లిపై ఆరోపణలు వచ్చాయి. నగరంలోని ఎన్టీఆర్ స్టేడియం నిర్వహణ కమిటీ బాధ్యతలను ఏకపక్షంగా కొనసాగించారు. దీనిపై అప్పట్లో పెద్ద దుమారం చెలరేగి అప్పటి ప్రజాప్రతినిధులు ఆయన్ను స్టేడియం నిర్వహణ కమిటీ నుంచి తప్పించి కార్పొరేషన్‌కు పగ్గాలు దక్కేలా కీలకంగా వ్యవహరించారు. గుంటూరు క్లబ్‌ను స్థాపించి దాని నిర్వహణ బాధ్యతలను కొంతకాలం నిర్వహించారు. దాంట్లో పేకాడుతున్నారన్న సమాచారంతో పలుసార్లు దాడులు జరిగాయి.
కూలేందుకు సిద్ధంగా రెసిడెన్సీ అపార్టుమెంట్
నగరంలోని శుభం కల్యాణ మండపం ఎదురుగా ఉన్న రెసిడెన్సీ అపార్టుమెంట్‌ను ఆయన నిర్మించారు. నిర్మించిన కొద్దిరోజులకే స్ట్రక్చర్ ఫెయిల్ అయింది. దీంతో అపార్టుమెంట్ కూలేందుకు సిద్ధంగా ఉంది. ఇందులో నివసిస్తున్న వారు కొంతమంది ఇప్పటికే ఫ్లాట్లను ఖాళీ చేశారు. ఈ అపార్టుమెంటును వెంటనే ఖాళీచేయాలని ఇంజినీర్ సర్టిఫికెట్ ఇచ్చా రు. చుక్కపల్లి పయనీర్ కన్స్ట్రక్షన్స్ పేరుతో నగరంలో సుమారు 50కు పై గా అపార్టుమెంట్లు నిర్మించారు. ప్లాను అనుమతుల నుంచి ప్రతి విషయంలోనూ అధికారులపై తీవ్రఒత్తిడి తీసుకువస్తారనే ఆరోపణలు ఉన్నాయి.
అధికారంలోకి రాగానే బిల్డర్లలో చీలిక
నగరంలో కేవలం బిల్డర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ పేరుతో ఒకే ఒక అసోసియేషన్ గతంలో ఉండేది. టీడీపీ అధికారంలోకి రాగానే బిల్డర్లలో చీలిక తీసుకువచ్చారు. ఒక ప్రధాన సామాజిక వర్గానికి చెందిన వారంతా కలిసి అప్రెడా (ఆంధ్రప్రదేశ్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్)గా ఏర్పడ్డారు. దీనికి ఇప్పటివరకు ఒక్క భవనాన్ని కూడా నిర్మించని వ్యక్తిని అధ్యక్షునిగా (బినామీ)గా ఉంచి వెనక నుంచి కథ నడిపిస్తుంటారు. వీరి ఆగడాలతో విసిగిపోయిన మరికొంత మంది బిల్డర్లు క్రెడాయ్ (కాన్ఫ్డరేషన్ ఆఫ్ రియల్ ఎస్టేట్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా)గా ఏర్పడ్డారు. ఆయన వ్యవహార తీరుపై బిల్డర్లలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది.