గుర్రంపై పెళ్లికూతురు!
‘పెళ్లికొడుకు కదా.. గుర్రమెక్కి వస్తాడు, పెళ్లికూతురు గుర్రం ఎక్కడమేమిటి విడ్డూరంగా..’ అనుకుంటున్నారా! వింతగా, విడ్డూరంగా అనిపించినా, మీరు వింటున్నది వాస్తవమే. మధ్యప్రదేశ్లో కాంద్వా జిల్లా సత్వరా గ్రామంలో పతిదార్ కులస్థులకు పెళ్లికూతుర్ని గుర్రంపై తీసుకురావడం సంప్రదాయం. పెళ్లికూతుర్ని గుర్రమెక్కించి కాసేపు ఊరేగించిన తర్వాత పెళ్లిమండపానికి తీసుకొస్తారన్నమాట.
పెళ్లికూతురు పెళ్లిమండపంలోకి రాగానే కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు డ్యాన్సులు చేసి తమ ఆనందాన్ని పంచుకుంటారు. ఈ తంతంతా అయ్యాక పెళ్లికొడుకుని పిలుస్తారు. అన్నింటా స్త్రీ ముందుండాలని, గౌరవ మర్యాదల విషయంలో కూడా ఆమె ప్రాధాన్యత ఆమెకుండాలని సత్వరా గ్రామస్థులు ఏనాడో గుర్తించినట్టున్నారు. అందుకే మహిళకు ముసుగేసి పెళ్లిమండపానికి తీసుకురాకుండా, గుర్రంపై స్వారీ చేయించి వివాహజీవితంలోకి సాగనంపుతున్నారు.