బాలికలపై లైంగిక దాడులు: వైద్యుడికి 22 ఏళ్ల జైలు
తన వద్దకు చికిత్స కోసం వచ్చే బాలికలను లైంగికంగా వేధించిన నేరంలో బ్రిటిష్ వైద్యుడు ఒకరికి 22 ఏళ్ల జైలుశిక్ష పడింది. మొత్తం 18 మంది బాలికల పట్ల మైల్స్ బ్రాడ్బరీ అనే ఆ వైద్యుడు అత్యంత క్రూరంగా వ్యవహరించాడని ప్రాసిక్యూషన్ వాదించింది. ఆయన కేంబ్రిడ్జిలోని అడెన్బ్రూక్ ఆస్పత్రిలో రక్త కేన్సర్ నిపుణుడు. 2009 నుంచి ఆయనపై 25 ఆరోపణలు వచ్చాయి. 13 ఏళ్ల వయసున్న అమ్మాయి మీద కూడా ఆయన లైంగిక దాడి చేసినట్లు, ఆ సమయంలో ఫొటోలు కూడా తీసినట్లు ఆరోపనలు వచ్చాయి. పిల్లల అసభ్య చిత్రాలతో కూడిన డీవీడీ ఒకటి తమకు వచ్చినట్లు బ్రిటన్ బాలల హక్కుల కేంద్రం చెప్పడంతో 2013లో బ్రాడ్బరీని అరెస్టు చేశారు.
మొత్తం 18 మంది పిల్లల పట్ల అతడు అత్యంత క్రూరంగా వ్యవహరించాడని, వాళ్లు ఆయన్ను ఎంతగానో నమ్మి వైద్యం కోసం వెళ్తే అతడు అసభ్యంగా ప్రవర్తించాడని ప్రాసిక్యూషన్ న్యాయవాది మిషెల్ బ్రౌన్ అన్నారు. ఇలాంటి కేసు ఇప్పటివరకు ఎప్పుడూ రాలేదని చెప్పారు. అత్యంత తీవ్రమైన వ్యాధులతో బాధపడేవాళ్లను కూడా అతడు వదల్లేదని, అతడికి 22 ఏళ్ల జైలుశిక్ష విధించడం భావ్యమేనని కోర్టు తీర్పు అనంతరం ఆమె వ్యాఖ్యానించారు.