breaking news
book publilsher
-
రికార్డులు తిరగరాసేసింది
ఐదేళ్ల వయసు... ఆల్ఫాబెట్స్‌ను కూడా స్పష్టంగా పలకడం రాదు కొందరికి. కానీ ఆ వయసులో పుస్తకాన్నే రాసి రికార్డు సృష్టించిందో బ్రిటిష్ చిన్నారి. ఈ ఘనత సాధించిన అత్యంత చిన్నవయస్కురాలైన బాలికగా గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లోకి ఎక్కింది. అంతేనా అందులోని బొమ్మలు సైతం తానే గీసింది. ‘ద లాస్ట్ క్యాట్’ పుస్తకం పబ్లిష్ అయిన 31 జనవరి 2022నాటికి ఆమె వయసు సరిగ్గా ఐదేళ్ల 211 రోజులు. జనవరిలో పబ్లిష్ అయితే... రికార్డుకు ఎందుకు లేటయ్యిందంటే... గిన్నిస్ టైటిల్ గెలవాలంటే కచ్చితంగా అది వెయ్యి కాపీలు అమ్ముడవ్వాలనేది సంస్థ నియమం. యూకేలోని వేముత్లో 2016 జూలై 14న పుట్టిన బెల్లా జె డార్క్ పుస్తకం రాస్తానని చెప్పినప్పుడు పిల్ల చేష్టలు అనుకున్నారు వాళ్లు. 32 పేజీల పుస్తకం రాసి ముందు పెడితే షాకయ్యారు. పుస్తకాన్ని ఫెయిర్ చేయడంలో బెల్లాకు తల్లి చెల్సీ సైమ్ సహకరించింది. కథేంటంటే.. తల్లిదండ్రులు వెంట లేకుండా బయటికి వెళ్లిన బాలిక తనకు ప్రియమైన పిల్లిని పోగొట్టుకుంటుంది. అది పోయినందుకు ఆమె పడిన బాధ, వెంట ఎవరూ లేకుండా అలా వెళ్లకూడదన్న సందేశం ఈ పుస్తకంలో ఉన్నాయని చెప్పింది బెల్లా తల్లి చెల్సీ. సినిమాలకేనా పార్ట్ వన్, పార్ట్ టూలు... ద లాస్ట్ క్యాట్ 2 చదవడానికి సిద్ధంగా ఉండండంటున్నారు బెల్లా తల్లిదండ్రులు. -
రాందేవ్ బాబాకు సుప్రీంకోర్టు నోటీసులు
సాక్షి, న్యూఢిల్లీ: యోగా గురువు రాందేవ్ బాబాకు సుప్రీంకోర్టు నోటీసులు పంపింది. రాందేవ్ జీవితానికి సంబంధించిన పుస్తకం అమ్మకాన్ని, ప్రచురణను నిలిపేయాలని ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాలు చేస్తూ ఓ పబ్లిషర్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ కేసు నేపథ్యంలో రెస్పాండెంట్ 1 (రాందేవ్)కు నోటీసులు పంపినట్లు జస్టిస్ మదన్ బి లోకూర్, జస్టిస్ దీపక్ గుప్త నేతృత్వంలోని ధర్మాసనం వెల్లడించింది. ఈ కేసుపై తదుపరి విచారణను కోర్టు వచ్చే ఏడాది ఫిబ్రవరి మొదటి వారానికి వాయిదా వేసింది.జుగ్గర్‌నౌట్ బుక్స్ అనే పబ్లిషర్ ‘గాడ్మేన్ టు టైకూన్’ అనే పుస్తకాన్ని ప్రచురించగా రాందేవ్ బాబా దీనిపై ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. ఈ పుస్తకంలో తన పరువుకు భంగం కలిగించే సమాచారం ఉందని, తన ఆర్థిక ప్రయోజనాలను దెబ్బతీసే విధంగా అది ఉందని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. -
మూతపడిన పుస్తకం-నవోదయ
అక్షర తూణీరం వారి ఆధరువులు (ఆధర్స్ని రా. రావు ఇలా అనేవారు) కాక పోయినా ఎందరో మహనీయులు నవోదయతో ఆత్మీయంగా ఉండేవారు. ఇందులో శ్రీశ్రీ, ఆరుద్ర, కాళీపట్నం కొన్ని శాంపిల్స్. ఒక ఘన చరిత్ర, నవోదయ అంటే మంచి అభిరుచి. నవోదయ అంటే ఒక సంప్రదాయం. ఒక సరదా. అరవైయ్యేళ్ల ప్రస్థానంలో మంచి పుస్తకాలు అందమైన గెటప్‌లో వెలువడి తెలుగు పాఠకులను అలరించాయి. ప్రారంభంలో కమ్యూనిస్టు సాహిత్యం వైపు మొగ్గు చూపినా, 1960 వచ్చేసరికి బాపురమణలు నవోదయని పూర్తిగా ఆవహించేశారు. నవోదయ రామ్మోహనరావు కూడా ఆ నమ్మకంలోనే ఉండేవారు. బుక్ షాపుగా, ప్రచురణ సంస్థగా నవోదయ ఒక వెలుగు వెలిగింది. వావిళ్ల, ఆంధ్రపత్రిక లాగే మంచి వేదికగా పేరు తెచ్చుకుంది. వ్యాపారం కంటే పాప్యులారిటీ, గ్లామర్ ఎక్కువగా ఉండేవి. విజయవాడ, గుంటూరు నవోదయలు సాంస్కృతిక కేంద్రాలుగా బతికాయి. లాండ్మార్క్స్గా నిలిచాయి. కవులకు అకవులకు కూడా విజయవాడ నవోదయ అడ్డాగా ఉండేది. ఆకాశవాణి ప్రయోక్తలకు, పత్రికా ప్రముఖులకు, లెక్చరర్లకు ఏలూరు రోడ్ నవోదయలో హాజరు వేసుకోవడం ఒక వ్యసనం. కొందరికి కొన్ని సాయంకాలాలు ఫలించి అనంతర కార్యక్రమాలకు బీజాలు పడేవి. ఎక్కడో ఏ నడిజాముకో అవి మొల కలెత్తేవి. నవోదయ రామ్మోహనరావు అంత సరసు డేమీ కాదు. మాట పెళుసు. అయినా బలమైన అయస్కాంత క్షేత్రం ఆయన చుట్టూ ఉండేది. పుస్తకాల ఎంపికలో రామ్మోహనరావుది రాచ మార్గం. పుస్తక ప్రచురణలో ఆయన అభిరుచిని ఎవరూ వంక పెట్టలేరు. ముళ్లపూడి రచనలు, నండూరి నరావతారం, విశ్వరూపం, ఇంద్రగంటి కీర్తితోరణం, శ్రీకాంతశర్మ పుస్తకాలు, శంకరమంచి అమరావతి కథలు, శ్రీరమణ రచనలు- ఇలా వెరసి టైటిల్స్ తక్కువేగానీ అన్నీ నవోదయకి కితాబులే. ‘‘బాపు బొమ్మలకైతే హలో, నవో దయకి చలో’’ అనేవారు. మొత్తం తెలుగునాట ఎవరికి బాపు ముఖచిత్రాలు కావాలన్నా నవో దయ అధీకృత ఏజెంటులా వ్యవహరించేది. బాపు కార్టూన్ల పుస్తకాన్ని నవోదయ ప్రచురించింది. ఆయన బొమ్మల్ని మార్చి పరిమార్చి గ్రీటింగ్ కార్డ్స్‌ని వెలువరించారు. రామ్మోహనరావు పుస్తక ప్రియులకు చేసిన సేవ గణనీయమైంది. అమెరికా తెలుగు సంఘం రామ్మోహనరావు దంపతులను తానా సభలకు రావించి సత్కరించింది. ఒక పుస్తక వ్యాపారిగా తానా సత్కృతి అందుకున్న ఘనత ఆయనదే. వారి ఆధరువులు (ఆధర్స్ని రా. రావు ఇలా అనేవారు) కాకపోయినా ఎందరో మహ నీయులు నవోదయతో ఆత్మీయంగా ఉండేవారు. ఇందులో శ్రీశ్రీ, ఆరుద్ర, కాళీపట్నం కొన్ని శాంపిల్స్. యువజ్యోతి ఎమ్వీయల్ నవోదయ ఆప్తవర్గంలోని వారు. ఎప్పుడైనా యస్పీ బాల సుబ్రహ్మణ్యం లాంటివారు మద్రాసు మెయిల్ కోసం నవోదయ గోదాములో నిరీక్షించేవారు. పుస్తకాల దొంతరల మీద కూచుని ఆధార షడ్జమాన్ని ఆలపిస్తూ, రైలు ఆలస్యాన్ని హాయిగా ఆస్వాదిస్తూ, నూజివీడు మిత్రులతో యస్పీబాసు గడపడం ఒక సరదా. విశాలాంధ్ర రాఘవాచారి, ఉషశ్రీ, పన్నాల భట్టు, శ్రీకాంతశర్మ సాయంత్రాలు తప్పక హాజరు వేసుకునేవారు. వారు రాగానే ‘‘గడ్డి తింటారా?’’ అని మర్యాదగా అడిగేవారు. అంటే బృందావన్ హోటల్ ఇడ్లీలని భావం. అక్కడ నుంచి ఎస్టీడీలు ఉచితంగా చేసుకుని ఉదారంగా మాట్లాడుకోవచ్చు. రైలు రిజర్వేషన్ కౌంటర్. సినిమా టికెట్లు లభించును. నండూరి రామ్మోహనరావు ఈవెనింగ్ ఎడిషన్ కోసం వచ్చేవారు. అనగా క్వార్టర్ బాటిల్‌ని పేపర్లో చుట్టి ఇప్పించడం. నవోదయ షాపు చాలా జంటల్ని కలిపింది. ఫిక్షన్, నాన్ఫిక్షన్ చూస్తూ మనసులు విప్పేవారు. మూతపడడం బాధాకరమే. కానీ ఆ ప్రాభవం, వైభవం లేకుండా దేనికి? రెండుమూడు తరాలకి నవోదయ ఒక అక్షర జ్ఞాపకం. (వ్యాసకర్త ప్రముఖ కథకుడు) శ్రీరమణ