ధోనీ బ్యాట్ కంటే పెద్ద బ్యాట్ వద్దు
అధిక బరువు, మందం గల పెద్ద బ్యాట్లను టి-20 క్రికెట్లో వాడినా.. టెస్టు క్రికెట్లో మాత్రం ఇలాంటి బ్యాట్లను వాడవద్దంటూ ఆస్ట్రేలియా బ్యాటింగ్ దిగ్గజం రికీ పాంటింగ్ సూచించాడు. టెస్టు క్రికెట్లో భారీ మందం, బరువు గల బ్యాట్లను వాడకుండా నిషేధం విధించాలని డిమాండ్ చేశాడు.
టెస్టు క్రికెట్లో బ్యాట్‌కు, బంతికి మధ్య సమతూకం ఉండేందుకు బ్యాట్ల బరువు, సైజుకు సంబంధించి నిబంధనలు పెట్టాలని పాంటింగ్ చెప్పాడు. ప్రస్తుత క్రికెట్ నిబంధనల ప్రకారం బ్యాట్ పొడవు, వెడల్పుపై మాత్రమే పరిమితులున్నాయి. బ్యాట్ బరువు, మందంపై నిబంధనలు లేవు. దీంతో క్రికెటర్లు తమకు అనుగుణంగా బ్యాట్లను తయారు చేయించుకుంటున్నారు.
పరిమిత ఓవర్ల క్రికెట్లో శారీరక దారుఢ్యం ఉన్నవారు ఎక్కువ బరువు, మందం గల బ్యాట్లను వాడుకోవచ్చని పాంటింగ్ అన్నాడు. అయితే టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ వాడే బ్యాట్ కంటే పెద్ద సైజు బ్యాట్లను వాడవద్దని సూచించాడు. వెస్టిండీస్ విధ్వంసక బ్యాట్స్‌మన్ క్రిస్ గేల్ బ్యాట్ సైజు కూడా ఇలాగే ఉంటుందని చెప్పాడు.