కదులుతున్న ట్రక్‌లో మహిళపై సామూహిక అత్యాచారం
న్యూఢిల్లీలో నిర్భయపై సామూహిక అత్యాచారం ఘటన మరువక ముందే అదే తరహా సంఘటన శుక్రవారం ఉత్తరప్రదేశ్‌లో చోటు చేసుకుంది. బోగినిపూర్లోని నౌబస్టా బైపాస్ రహదారిలో 45 సంవత్సరాల వయస్సు గల మహిళపై ప్రయాణిస్తున్న ట్రక్‌లో నలుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారం చేశారు. అనంతరం ఆ మహిళను ట్రక్ నుంచి విసిరివేశారు.
నలుగురు నిందితులు ట్రక్‌తో సహా పరారయ్యారు. దాంతో రహదారిపై అపస్మారకస్థితిలో పడి ఉన్న మహిళను చూసి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని సామూహిక అత్యాచారానికి గురైన మహిళను ఆసుపత్రికి తరలించారు.
రహదారిపై వెళ్లున్న ట్రక్‌ను ఆపి తనను బోగినిపూర్ వరకు తీసుకువెళ్లాలని డ్రైవర్‌ను కోరినట్లు, అందుకు డ్రైవర్ అంగీకరించినట్లు బాధితురాలు పోలీసులకు చేసిన ఫిర్యాదులో వెల్లడించింది. అలా కొంత దూరం వెళ్లిన తర్వాత మరో ముగ్గురు వ్యక్తులు ట్రక్‌లోకి ఎక్కారు. అనంతంర ఆ నలుగురు వ్యక్తులు తనపై సామూహిక అత్యాచారం చేశారని బాధితురాలు ఆ ఫిర్యాదులో వివరించింది. దీంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. సాధ్యమైనంత త్వరలో నిందితులను అరెస్ట్ చేస్తామని పోలీసులు ధీమా వ్యక్తం చేశారు.