మద్యం వదిలి.. మనిషిగా మారి..
► మద్యం రహిత గ్రామం బీర్జేపల్లె
► కట్టుబాట్లతో మద్యం మహమ్మారిని అరికట్టారు
► మద్యం తాగితే రూ.వెయ్యి జరిమానా
► ప్రతినెలా గ్రామ కమిటీ సమావేశం
బీర్జేపల్లెలో నిత్యం మద్యం ఏరులై పారేది. ఎప్పుడూ ఘర్షణలు, మధ్యవర్తి పంచాయితీలు, దుర్భాషలాడుకోవడం అత్యంత సహజంగా ఉండేది. పగలంతా కష్టపడి కూలి పని చేసి సంపాదించిన సొమ్మంతా తాగుడుకు ఖర్చు చేసి ఇళ్లకు చేరుకునే వారు. ప్రశ్నించిన కుటుంబ సభ్యులు, భార్యాపిల్లలను మత్తులో చితకబాది తమ జీవితాలను నాశనం చేసుకొనే వారు. ఇదంతా గతం. మద్యం మహమ్మారిని గ్రామస్తులు వదిలేయడంతో ప్రస్తుతం బీర్జేపల్లె ఆదర్శ గ్రామంగా మారింది. ప్రశాంత వాతావరణంలో ఎలాంటి గొడవలు లేకుండా సుఖసంతోషాలతో జీవిస్తున్నారు బీర్జేపల్లె గ్రామస్తులు.
చౌడేపల్లె: మండలంలోని చారాల పంచాయతీ బీర్జేపల్లె ప్రశాంతతకు మారుపేరుగా నిలుస్తోంది. సుమారు 52 కుటుంబాలున్నారు. వడ్డెర కులానికి చెందిన వీరందరూ రాతిబండ పని, ఉపాధిహామీ పనులతోపాటు, వ్యవసాయం, కూలి పనులు చే స్తూ జీవనం సాగిస్తున్నారు. 370 మంది జనాభా ఉన్న ఈ గ్రామం గతంలో మద్యం మత్తులో తూ లుతుండేది. కొందరు సంపాదన మొత్తం తాగుడుకే ఖర్చుచేసి అప్పుల పాలయ్యారు. గ్రామంలో మత్తుపదార్థాలు, జూదానికి యువకులు, వృద్ధులు, వయోతారతమ్యం లేకుండా బానిసలయ్యారు. కలహాలు, ఘర్షణలు చోటు చేసుకునేవి.
కఠిన నిర్ణయం
వీటిని గుర్తించిన గ్రామపెద్దలు ఒక నిర్ణయానికి వచ్చారు. మద్యం తాగడానికి, విక్రయించడానికి వీల్లేకుండా కట్టుబాటు పెట్టారు. మద్యం తాగి గ్రామంలోకి రాకూడదని నిర్ణయించారు. గ్రామంలోని రామాలయం వద్ద సమావేశాన్ని నిర్వíహించి కట్టుబాటు పాటిస్తామని అందరితో ప్రతిజ్ఞ చేయిం చారు. మహిళలు సైతం పెద్ద ఎత్తున్న మద్దతు పలికారు. గ్రామపెద్దలు చెంగళ్రాయప్ప,పెద్దరెడ్డె ప్ప, శీనప్ప, నాగరాజు, రామచంద్ర ఒక అంగీకార పత్రాన్ని రాతపూర్వకంగా తయారుచేశారు. నిబం ధనలు ఉల్లంఘిస్తే రూ.వెయ్యి జరిమానా వేయడంతోపాటు తగిన గుణపాఠం చెప్పేలా ఒప్పందం కుదుర్చుకొన్నారు. ఈ పత్రంలో గ్రామస్తులందరితో సంతకాలు చేయించారు. అప్పటి నుంచి నేటి వరకు మద్యం తాగి వచ్చి ఇద్దరు మాత్రమే పట్టుబడ్డారు. వారికి కమిటీ సభ్యులు జరిమానా విధించారు. మద్యం తాగితే కఠిన చర్యలు తీసుకొంటామని హెచ్చరించారు. ప్రతినెలా ఆలయం వద్ద గ్రామస్తులు సమావేశమై కట్టుబాటును గుర్తు చేస్తూ ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు.
కట్టుబాట్లుతో అరికట్టాం
గ్రామంలో మద్యం కారణంగా నిత్యం ఘర్షణలతో ప్రశాంతత లేకుండా ఉండేది. గ్రామస్తుల సూచనల మేరకు కమిటీ ఏర్పాటు చేసుకొన్నాం. కట్టుబాట్లు చేసినప్పటి నుంచి మద్యం తాగడం మానేశారు. రోజూ కూలి పనులకు వెళ్లి సంపాదించిన సొమ్ముతో భార్యాపిల్లలతో హాయిగా గడుపుతున్నారు. – పెద్దరెడ్డెప్ప, గ్రామపెద్ద, బీర్జేపల్లె
మత్తుతో జీవితాలు నాశనమయ్యాయి
సంపాదించిన సొమ్మంతా తాగుడుకు పోసేవారు. అప్పులు చేసి మరీ చిన్నాపెద్దా తేడా లేకుండా తాగేవారు. ఇలా అయితే గ్రామం పరువుతోపాటు, కుటుంబాలు రోడ్డున ప డుతాయని గుర్తించాం. అందరి సహకారంతో కమిటీ ఏ ర్పాటు చేసుకొని మద్యం మాట లేకుండా చేశాం. చాలా ఆనందంగా ఉన్నాం. – శీనప్ప, గ్రామ కమిటీ సభ్యుడు