breaking news
BC - SC corporations
-
బడుగు, బలహీనవర్గాల అభ్యున్నతే సీఎం లక్ష్యం
అమలాపురం రూరల్/చిలకలూరిపేట/మహారాణిపేట (విశాఖ దక్షిణ): బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతే లక్ష్యంగా సీఎం వైఎస్ జగన్ పనిచేస్తున్నారని ఎస్సీ, బీసీ సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి. తాజాగా ప్రకటించిన 18 ఎమ్మెల్సీ స్థానాల్లో 14 ఎస్సీ, ఎస్టీ, బీసీలకు కేటాయించినందుకు సీఎం వైఎస్ జగన్‌కు కృతజ్ఞతలు తెలిపాయి. బుధవారం పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలం మురికిపూడిలో సీఎం వైఎస్ జగన్ చిత్రపటానికి మంత్రి విడదల రజిని క్షీరాభిషేకం నిర్వహించారు. అలాగే బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా రోళ్లపాలెంలో ఎస్సీ సంఘాలు కేక్ కట్ చేసి ఆనందం వ్యక్తం చేశాయి. సీఎం చిత్రపటానికి క్షీరాభిషేకం నిర్వహించాయి. అదేవిధంగా ఎమ్మెల్సీ అభ్యర్థిగా కోలా గురువులును ప్రకటించినందుకు విశాఖ ఫిషింగ్ హార్బర్లో మత్స్యకార మహిళలు, బోటు యజమానులు, డ్రైవర్లు, వ్యాపారులు సంతోషం వ్యక్తం చేశారు. ‘సీఎం సార్ థ్యాంక్స్’ అంటూ నినదించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ చిత్రపటానికి క్షీరాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మత్స్యకార సంఘాల నాయకులు మూగి రాజా,జోగి సుధాకర్, దుంపు ఈశ్వర్ రెడ్డి, పిల్లా సుభద్రమ్మ, కె.పోలమ్మ, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. సీఎం వైఎస్ జగన్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేస్తున్న మంత్రి రజిని తదితరులు బీసీలకు వెన్నుదన్నుగా సీఎం జగన్: మంత్రి గుమ్మనూరు ఆలూరు రూరల్: బీసీలకు సముచిత స్థానం కల్పించిన ఏకైక సీఎం వైఎస్ జగన్ అని కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం అన్నారు. బుధవారం ఆయన ఆలూరులో మీడియాతో మాట్లాడారు. శాసనమండలికి వైఎస్సార్సీపీ తరఫున 18 మంది ఎమ్మెల్సీ అభ్యర్థులను ప్రకటించగా.. అందులో 11 మంది బీసీలేనని చెప్పారు. 68 శాతానికి పైగా ఎమ్మెల్సీ పదవులను బీసీ, ఎస్సీ, ఎస్టీలకు కట్టబెట్టడం ద్వారా సీఎం జగన్ తన నిబద్ధతను మరోసారి చాటుకున్నారని పేర్కొన్నారు. వైఎస్సార్‌సీపీతోనే బీసీలకు ఆత్మగౌరవం: ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి సాక్షి, విశాఖపట్నం: చట్టసభల్లో బీసీలకు సీఎం జగన్ పెద్దపీట వేశారని వైఎస్సార్సీపీ రాష్ట్ర మహిళా వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి అన్నారు. టీడీపీ హయాంలో బీసీలకు అవమానాలు ఎదురవ్వగా.. జగన్ ప్రభుత్వంలో ఆత్మగౌరవం పెరిగిందన్నారు. బుధవారం విశాఖలో ఆమె మీడియాతో మాట్లాడారు. మత్స్యకారులను చంద్రబాబు తాట తీస్తానంటే.. సీఎం జగన్ వారిని అక్కున చేర్చుకున్నారని కొనియాడారు. మత్స్యకారులంతా కాలర్ ఎగురేసుకొని తిరిగేలా రాజకీయ ప్రాధాన్యం కల్పించారని ప్రశంసించారు. -
నిరుద్యోగులతో ఆటలా..!
ఖమ్మం హవేలి, న్యూస్‌లైన్ : స్వయం ఉపాధి పొందేందుకు బీసీ, ఎస్సీ కార్పొరేషన్ల ద్వారా 2013-14 ఆర్థిక సంవత్సరంలో దరఖాస్తు చేసుకున్న నిరుద్యోగులతో అధికారులు బంతాట ఆడుతున్నారు. దీంతో ఆర్థిక సంవత్సరం పూర్తయినా నిర్దేశిత లక్ష్యం చేరుకోకపోగా, రుణం మంజూరైన నిరుద్యోగులలో ఇప్పటికి ఒక్కరికి కూడా సబ్సిడీ విడుదల కాలేదు. దీంతో వారి పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. కాగా, ఎన్నికల కోడ్‌తో రుణం మంజూరైన వారి బ్యాంకు ఖాతాల వివరాలు ఈనెల 20 వరకు పంపించే అవకాశం లేదు. అయితే 24లోగా ఆ వివరాలు ప్రభుత్వానికి అందకుంటే సబ్సిడీ వచ్చే అవకాశం లేకపోవడంతో నిరుద్యోగులు ఆందోళన చెందుతున్నారు. ఇక పోలవరం ముంపు కింద సీమాంధ్రలో కలిసే మండలాల నిరుద్యోగుల పరిస్థితి మరీ దారుణంగా తయారయింది. జిల్లా వ్యాప్తంగా సుమారు రూ.4 కోట్ల వరకు నిరుద్యోగులకు సబ్సిడీ నిలిచిపోయింది. దీంతో యూనిట్లు గ్రౌండింగ్ అయ్యే అవకాశం లేకుండా పోయింది. సంవత్సరమంతా నిర్లక్ష్యం.. చివర్లో నిరుద్యోగులపై ఒత్తిడి... బీసీ కార్పొరేషన్‌కు సంబంధించి 2013-14 ఆర్థిక సంవత్సరానికి జిల్లాలోని 46 మండలాల్లో 2,457 యూనిట్లకు రుణాలివ్వాలని నిర్ణయించారు. ఇందులో రూ.20 వేల యూనిట్లు 544, రూ. 25 వేల యూనిట్లు 927, రూ.30 వేల యూనిట్లు 895, రూ.50 వేల యూనిట్లు 57, రూ. లక్ష విలువైన యూనిట్లు 34 ఇవ్వాల్సి ఉంది. అయితే మొత్తం 2,457 యూనిట్లకు గాను 801 యూనిట్లు మాత్రమే మంజూరయ్యాయి. అలాగే జిల్లాలోని ఖమ్మం, కొత్తగూడెం, మణుగూరు, పాల్వంచ, సత్తుపల్లి, ఇల్లెందు మున్సిపాలిటీల పరిధిలో 530 యూనిట్లు లక్ష్యంగా నిర్దేశించారు. ఇందులో రూ.20 వేల యూనిట్లు 149, రూ.25 వేల యూనిట్లు 184, రూ.30 వేల యూనిట్లు 184, రూ.50 వేల యూనిట్లు 5, రూ. లక్ష విలువైన యూనిట్లు 8 ఇవ్వాల్సి ఉంది. కాగా వీటిలో 150 యూనిట్లు మాత్రమే మంజూరయ్యాయి. సంవత్సరం మొత్తం వృథా చేయడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. 2013 అక్టోబర్‌లో నిరుద్యోగులు దరఖాస్తు చేసుకోగా 2014 ఫిబ్రవరి వరకు అధికారులు వారిని ఇంటర్వ్యూలకే పిలువలేదు. జిల్లాలోని అన్ని మండల కేంద్రాలు, మున్సిపాలిటీల్లో దరఖాస్తులను ఆన్లైన్ చేసేందుకు నెలల తరబడి ఆలస్యం చేశారు. అప్పటి వరకు నిర్లక్ష్యం చేసి, తీరా ఎన్నికల కోడ్ రావడానికి 10 రోజుల ముందు పిలిచి హడావుడి చేయడంతో నిరుద్యోగులు అనేక ఇబ్బందులు పడ్డారు. చివరకు బ్యాంకర్లు కాన్సెంట్లు ఇవ్వడంలో విముఖత చూపడంతో లక్ష్యానికి సుదూరంలో నిలవాల్సిన దుస్థితి ఏర్పడింది. మొత్తం లక్ష్యంలో మూడోవంతు మందికి కూడా రుణాలు మంజూరు కాకపోవడం గమనార్హం. ఇక ఎస్సీ కార్పొరేషన్ ద్వారా పరిశ్రమలు, సేవలు, వ్యాపారాలకు సంబంధించి జిల్లాలోని అన్ని మండలాల్లో మొత్తం 1323 మంది నిరుద్యోగులకు 763 యూనిట్లు ఇవ్వాలని నిర్ణయించగా 660 మందికి 652 యూనిట్లు మంజూరయ్యాయి. అలాగే మున్సిపాలిటీల పరిధిలో 2302 మందికి 1292 యూనిట్లు ఇచ్చేలా లక్ష్యం ఉండగా 771 మందికి 763 యూనిట్లు మంజూరు అయ్యాయి. 20వ తేదీ వరకు ఇదే పరిస్థితి.. ఎన్నికల కోడ్ నేపథ్యంలో రుణాలు మంజూరైన నిరుద్యోగులకు సంబంధించి వారి బ్యాంకు ఖాతాల వివరాల ఆన్లైన్ ప్రక్రియ పూర్తి చేయలేదు. ఎన్నికల కోడ్ నేపథ్యంలో ఈ నెల 20 వరకు పంపించే పరిస్థితి లేదని అధికారులు చెపుతున్నారు. అయితే గత ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన రుణాల సబ్సిడీని ఇంకా విడుదల చేయకపోవడం పట్ల నిరుద్యోగులు ఆందోళన చెందుతున్నారు. ముంచుకొస్తున్న మరో ముప్పు.. ఎన్నికల కోడ్ కారణంగా నానా అగచాట్లు పడిన నిరుద్యోగులు రాష్ట్ర విభజన నేపథ్యంలో తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు. ఈ నెల 24 లోగా అన్ని ప్రభుత్వ విభాగాలకు సంబంధించి, ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు కూడా క్లియర్ చేయాలని నిర్ణయించారు. ఈ క్రమంలో 24లోగా తమకు సబ్సిడీ అందకపోతే ఆ తర్వాత వచ్చే పరిస్థితి ఉండదని నిరుద్యోగులు బెంబేలెత్తుతున్నారు. ఇక పోలవరం ముంపు ప్రాంతాలైన ఏడు మండలాలు జూన్ 2 తర్వాత అవశేష ఆంధ్రప్రదేశ్‌లో విలీనం కానుండడంతో ఆయా మండలాల నిరుద్యోగుల పరిస్థితి మరింత అగమ్యగోచరంగా మారింది. వెంటనే సబ్సిడీలు విడుదల చేసి, తమను ఆదుకోవాలని నిరుద్యోగులు కోరుతున్నారు.