breaking news
Bajrang jute mill
-
గోరీ కట్టే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి
పట్నంబజారు(గుంటూరు): కార్మికుల కడుపులు కొట్టి.. వారి జీవితాలు రోడ్డున పడుతున్నా.. తమకేమి పట్టనట్లు బడా వ్యాపారులకు అండగా నిలుస్తున్న చంద్రబాబు సర్కార్‌కు కార్మికులు గోరీ కట్టే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని భజరంగ్ జూట్ మిల్లు పరిరక్షణ సమితి కన్వీనర్ లేళ్ల అప్పిరెడ్డి హెచ్చరించారు. జూట్ మిల్లు యాజమాన్యం మిల్లులోని సరుకుతో పాటు యంత్రాలను తరలించేందుకు మంగళవారం మరోసారి ఉపక్రమించింది. ఇప్పటికే రెండు సార్లు శతవిధాలా ప్రయత్నించి ఘోరంగా విఫలమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పోలీసులపై కోర్టు ద్వారా మరింత ఒత్తిడి పెంచి.. తన ఎత్తులను పారించుకునేందుకు చకచక పావులు కదిపింది. భారీగా పోలీసులను మొహరింపజేసి బలప్రయోగంతో సరుకు మాటున యంత్రాలను తీసుకుని వెళ్లేందుకు సమాయత్తమైంది. ఈ విషయం తెలిసిన వెంటనే కార్మికులు, పరిరక్షణ సమితి నేతలతో కలిసి పెద్ద సంఖ్యలో జూట్ మిల్లు వద్దకు చేరుకున్నారు. యాజమాన్య దుశ్చర్యలను అడ్డుకునేందుకు సమాయత్తమయ్యారు. దీనితో మరోమారు స్థానికంగా ఉద్రిక్తత నెలకొంది. చర్చలకు పిలిచిన డీఎస్పీ సౌమ్యలత : జూట్ మిల్లు వద్ద ఉద్రిక్తత నెలకొన్న నేపథ్యంలో వెస్ట్ డీఎస్పీ పి.సౌమ్యలత జోక్యం చేసుకున్నారు. పరిరక్షణ సమితి నేతలు, కార్మికులను చర్చలకు ఆహ్వానించారు. గతంలో కోర్టు ఆదేశాలు యాజమాన్యానికి అనుకూలంగా ఉన్నప్పటికీ, కార్మికుల ఆకలి కేకలు క్రమంలో తాము సంయమనం పాటించామని ఆమె తెలిపారు. దీనిపై యాజమాన్యం కోర్టు ధిక్కరణ కేసును తమపై హైకోర్టులో వేసినట్లు చెప్పారు. కోర్టు ఆదేశాలను శిరసావహించాల్సిందేనని వివరించారు. ప్రస్తుత సమస్యను దృష్టిలో పెట్టుకుని సహకరించాలని కోరారు. నగరంపాలెంలోని ఆమె కార్యాలయంలో లేళ్ల అప్పిరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు సుమారు గంటన్నరకుపైగా భేటీ అయి పూర్తిస్థాయిలో చర్చించారు. కోర్టును ధిక్కరించాలన్నది తమ ఉద్దేశం కాదని డీఎస్పీ సౌమ్యలతకు వివరించారు. చట్టంలో ఉన్న లొసుగులను ఆసరాగా చేసుకుని, మెటీరియల్ ముసుగులో మిషనరీ తరలింపే తమకు అభ్యంతరమని తెలిపారు. దీనికి ఆమె కోర్టు ఉత్తర్వులను అనుసరించి కేవలం సరుకు మాత్రమే యాజమాన్యం తీసుకుని వెళ్లేలా చూస్తామని హామీనిచ్చారు. యంత్ర పరికరాలను తరలనివ్వబోమని స్పష్టం చేశారు. ఇంకా ఏమైనా సందేహం ఉంటే కార్మికుల తరఫున న్యాయవాదిని, ఒక కార్మికుడిని మిల్లులోకి పంపి పరిశీలించుకోవచ్చని సూచించారు. ఊపిరి పీల్చుకున్న పోలీసులు : పోలీసులతో చర్చల అనంతరం మరోసారి పరిరక్షణ సమితి నేతలు కార్మికులతో భేటీ అయ్యారు. డీఎస్పీ సౌమ్యలతతో జరిగిన చర్చల సారాంశం వివరించారు. సరుకు తరలించేందుకు యాజమాన్యానికి అనుగుణంగా ఉన్న కోర్టు ఉత్తర్వులు, తద్వారా పోలీసులకు ఎదురవుతున్న చిక్కులను కార్మికులకు వెల్లడించారు. యంత్ర పరికరాల జోలికి వెళ్లకుండా సరుకు మాత్రమే తరలించుకుపోతారని తెలిపారు. దీంతో అప్పటి వరకు నెలకొన్న ఉద్రిక్తత పూర్తి ప్రశాంతంగా మారటంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. సీఎంను కలిసేందుకు సహకరించండి : సీఎం చంద్రబాబు నాయుడు బుధవారం గుంటూరుకు రానున్న నేపథ్యంలో ఆయన్ను కలిసి సమస్యను వివరించేందుకు సహకరించాలని పరిరక్షణ సమితి నేతలు డీఎస్పీ సౌమ్యలతను కోరారు. దీనిపై సానూకూలంగా స్పందించి ఆమె ఎస్పీ సిహెచ్.విజయారావు దృష్టికి ఈ అంశాన్ని తీసుకుని వెళ్తామని, సీఎం అపాయింట్మెంట్కు తన వంతు ప్రయత్నిస్తామని హామీనిచ్చారు. ఈ మేరకు సీఎం చంద్రబాబును కలిసి వినతిపత్రం సమర్పించాలని ఏకగ్రీవంగా తీర్మానించారు. ఈ సందర్భంగా అప్పిరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ లక్ష్మణరావు మాట్లాడుతూ ప్రభుత్వం మిల్లు అంశంలో మొదటి నుంచి పొంతన లేని విధంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. మాజీ ఎమ్మెల్యే చల్లా వెంకటకృష్ణారెడ్డి, సీపీఎం నేతలు భావన్నారాయణ, నళినీకాంత్, కార్మిక నేతలు ఎబ్బూరి పాండురంగ, నూకరాజు, సింగు నరసింహారావు తదితరులు పాల్గొన్నారు. -
కార్మికులకు న్యాయం చేస్తాం
వ్యవసాయశాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు గుంటూరు వెస్ట్ : భజరంగ్ జూట్‌మిల్లు వ్యవహారంలో కార్మికులకు న్యాయం చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. యాజమాన్యం దిగిరాని పక్షంలో కఠినచర్యలు తప్పవని స్పష్టం చేశారు. అక్రమ లాకౌట్‌కు నిరసనగా భజరంగ్ జూట్‌మిల్లు పరిరక్షణ కమిటీ కన్వీనర్ లేళ్ల అప్పిరెడ్డి నాయకత్వంలో ప్రతినిధులు ఆదివారం స్థానిక ఐబీలో మంత్రి పుల్లారావును కలిశారు. యాజమాన్య మొండివైఖరిని వారు మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. దీనిపై ఘాటుగా స్పందించిన మంత్రి పుల్లారావు యాజమాన్య ధిక్కార ధోరణిని సహించే ప్రసక్తే లేదన్నారు. కార్మికమంత్రి అచ్చెన్నాయుడు, కార్మికశాఖ కమిషనర్ వరప్రసాద్‌తో ఫోన్లో సంప్రదింపులు జరిపారు. జూట్‌మిల్లు పరిరక్షణ కమిటీ కన్వీనర్ లేళ్ల అప్పిరెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం భజరంగ్ జూట్‌మిల్లు యాజమాన్య మెడలు వంచుతుందనే భావిస్తున్నట్లు చెప్పారు. సోమవారం నుంచి రిలే నిరాహార దీక్షలతో మొదలుపెట్టి కార్మికశాఖ కార్యాలయాన్ని ముట్టడిస్తామని అన్నారు. మాజీ ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు మాట్లాడుతూ కార్మికుల్లో కోపం కట్టలు తెంచుకోకముందే ప్రభుత్వం తగుచర్యలు చేపట్టాలన్నారు. మంత్రి పుల్లారావును కలిసిన వారిలో బీజేఎంఎం నాయకులు ఎబ్బూరి పాండురంగ, రాయ నాగేశ్వరరావు, సీపీఎం నగర కార్యదర్శి భావన్నారాయణ, సీపీఐ(ఎంఎల్) నాయకుడు ఉల్లిగడ్డల నాగేశ్వరరావు, ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు పరిశపోగు శ్రీనివాస్, దళితనేత చార్వాక, ఐఎన్టీయూసీ నాయకుడు ఎర్రబాబు, వైఎస్సార్ సీపీ నగర యువజన అధ్యక్షుడు ఎలికా శ్రీకాంత్ యాదవ్, మైనార్టీ అధ్యక్షుడు టింబర్ డిపో జానీ, ఇల్లూరి బాబూరావు తదితరులు పాల్గొన్నారు.