కోటాకు కన్నం!
రేషన్ షాపుల ద్వారా ప్రభుత్వం సరఫరా చేస్తున్న సబ్సిడీ బియ్యంలో భారీ తరుగు వస్తోంది. దీనికి పౌరసరఫరా అధికారులు, రేషన్ డీలర్లు పలు కారణాలు చెబుతూ.. తప్పు తమది కాదంటే తమదని తప్పించుకోజూస్తున్నా..
తరుగు వల్ల అం తిమంగా నష్టపోతున్నది మాత్రం కార్డుదారులేనన్నది సుస్పష్టం. తెల్లకార్డుదారులకు సరఫరా చేస్తున్న సబ్సిడీ బియ్యం తూకంలో తేడాలుంటున్నాయన్న ఆరోపణలు ఎప్పటినుంచో ఉన్నాయి. కార్డుదారులు గగ్గోలు పెడుతున్నా.. ఈ లోపాన్ని సరిదిద్దడానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదు. ఆ తప్పు తమది కాదని డీలర్లు వాదిస్తున్నారు. తాము సరుకు విడిపించుకునే స్టాక్ పాయింట్లోనే ఈ విధంగా జరుగుతోందని అంటున్నారు.
ప్రతి 50 కేజీల ప్యాకెట్లో కనీసం ఒకటిన్నర నుంచి రెండు కేజీల తరుగు వస్తోందని అంటున్నారు. అయితే ఈ విషయం అధికారులకు చెప్పుకోలేకపోతున్నామని అంటున్నారు. మండలస్థాయి స్టాక్ పాయింట్ నుంచి సరుకు విడిపించుకునేటప్పుడు అక్కడ ఉన్న కాటాలో తూయించే అవకాశం ఉన్నా.. అందుకు సాహసించలేకపోతున్నామని అంటున్నారు. అన్ని ప్యాకెట్లనూ తూయించే, జాగ్రత్తగా పరిశీలించే సానుకూల పరిస్థితీ ఉండటం లేదన్నది డీలర్ల వాదన. కొందరు మాత్రం ఏదైనా ప్యాకెట్ లీకేజీ కనపడితే కలాసీల ద్వారా పక్కన పెట్టించి, మంచి ప్యాకెట్లు తీసుకుంటున్నారు. దీంతో ఎంఎల్ఎస్ పాయింట్లలోనూ ఇటువంటివి భారీగానే నిల్వ ఉండిపోతున్నాయి.
కాగా తరుగుతోనే ఎంఎల్ఎస్ పాయింట్‌కు బియ్యం ప్యాకెట్లు వస్తున్నాయని పాయింట్ల నిర్వాహకులు చెబుతున్నారు. ఇక్కడ లోడింగ్ అన్లోడింగ్ సమయాల్లో కొన్ని ప్యాకెట్లు చిరిగిపోయి, బియ్యం కారిపోతున్నాయని వివరిస్తున్నారు.
కార్డుదారుల కోటాకే కన్నం
ప్యాకెట్లలో తరుగులు, లీకేజీల కారణంగా ఎదురవుతున్న షార్టేజీని కార్డుదారుల కోటాకు కన్నం వేయడం ద్వారా డీలర్లు పూడ్చుకుంటున్నారు. కార్డుదారులకు రిటైల్‌గా బియ్యం అమ్ముతారు కనుక.. తూకంలో తగ్గించి లబ్ధిదారులకు అందజేస్తున్నారు. దాదాపు జిల్లా అంతటా ఇదే పరిస్థితి ఉంది. నరసన్నపేటలోని ఎంఎల్ఎస్ పాయింట్ నుంచి నరసన్నపేట మండలానికి నెలకు 2,579 క్వింటాళ్లు, పోలాకి మండలానికి 2,490 క్వింటాళ్ల బియ్యం కేటాయిస్తున్నారు. క్వింటాలుకు 2 నుంచి 3 కేజీల తరుగు లెక్క వేసినా ఈ రెండు మండలాల్లోనే 15 నుంచి 20 క్వింటాళ్ల తరుగు తేలుతుంది. దీని విలువ మార్కెట్ ధర ప్రకారం*60 వేల నుంచి *80వేల వరకు ఉంటుంది. ఈ విధంగా జిల్లాలోని 19 ఎంఎల్ఎస్ పాయింట్లలో ఏర్పడే తరుగును లెక్కిస్తే ప్రతి నెలా *15 లక్షల నుంచి *18 లక్షల విలువైన సబ్సిడీ బియ్యానికి కన్నం పడుతోంది. అయితే ఇదంతా ఒక ప్రణాళిక ప్రకారం జరుగుతున్న తంతన్న ఆరోపణలు ఉన్నాయి.
కొన్ని సమయాల్లో తప్పదు
గిడ్డంగుల్లోనూ, ఎంఎల్ఎస్ పాయింట్‌కు సరుకులు చేరినప్పుడు లోడింగ్, అన్లోడింగ్ చేసేటప్పుడు ప్యాకెట్లు కన్నాలు పడి కారడం వల్ల ఈ సమస్య అప్పడప్పుడు ఏర్పడుతోంది. సగటున 5శాతం వరకు వ్యత్యాసం ఉండడానికి ప్రభుత్వ అనుమతి కూడా ఉంది. ఒకేసారి ఎక్కువ లోడ్లు వచ్చి, భారీగా నిల్వ చేయాల్సిన సందర్భాల్లో కింద ఉన్న బస్తాలు చిరగడం, కారడం వంటివి జరుగుతున్నాయి.
-బి.శ్రీహరి, సీఎస్‌డీటీ, నరసన్నపేట
తూకం వేసుకునేందుకు వీలుగా కాటా
డీలర్లు తమకు కేటాయించిన సరుకులు తూకం వేసుకునేందుకు వీలుగా ఎంఎల్ఎస్ పాయింట్లో కాటా ఏర్పాటు చేశాం. తూకంలో తేడా ఉన్న ప్యాకెట్లను తిరిగి పౌరసరఫరాల గిడ్డంగికి పంపేస్తున్నాం. ఎక్కువ తేడా ఉన్న ప్యాకెట్లను డీలర్లు ఇక్కడే వదిలేస్తున్నారు. ఎంఎల్ఎస్ పాయింట్లో షార్టేజ్ సమస్య తలెత్తదు.
-బి.శ్రీరామమూర్తి, గోదాం ఇన్చార్జి