breaking news
Ayurvedic hospitals
-
ఆయుర్వేదంతో.. ఆరోగ్యమస్తు!
ఆయుర్వేదిక్ సంప్రదాయ వైద్య విధానాన్ని ప్రస్తుత కాలంలో కరోనా తరువాత నుంచి ఎక్కువ మంది ఆశ్రయిస్తున్నారు. ఆయుర్వేద ఆస్పత్రులకు వచ్చే రోగుల సంఖ్యలో గణనీయమైన మార్పు కనిపిస్తోంది. ఇందుకు తగ్గట్టుగా ప్రభుత్వ ఆయుర్వేదిక్ ఆస్పత్రులను తీర్చిదిద్దుతున్నారు. గత ప్రభుత్వ హయాంలో ఈ ఆస్పత్రులకు అధిక నిధులు కేటాయించి ఆధునికీకరణకు బాటలు వేశారు. - సాక్షి, అనకాపల్లి ఆయుర్వేద వైద్యానికి ఆదరణ పెరుగుతుంది. ముఖ్యంగా దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుపడుతున్న రోగులు ఎక్కువగా ఆయుర్వేదిక్ వైద్యం పట్ల ఆసక్తి చూపుతున్నారు. నాలుగు దశాబ్దాల క్రితం నుంచే అనకాపల్లి జిల్లాలో కొరుప్రోలు, వేంపాడు, కన్నూరుపాలెంలలో ఆయుర్వేదిక్ డిస్పెన్సరీల ద్వారా వైద్యం అందించేవారు. తొలుత దాతల సహాయంతోనే ఈ ఆయుర్వేదిక్ ఆసుపత్రుల నడిచేవి. దాతలు భూమిని సమకూర్చడంతో పెంకులతో భవనం నిర్మించి, అందులోనే వైద్య సేవలు ప్రారంభించారు. వైద్యునితోపాటు ఆరోగ్య సిబ్బందిని నియమించి సేవలందిస్తూ వచ్చారు. కాలక్రమంలో ఈ డిస్పెన్సరీ భవనాలు శిథిలావస్థకు చేరుకోవడంతో 2013లో ఎస్‌ఆర్‌హెచ్‌ఎం నిధులతో నూతన భవనాలను నిర్మించారు. జిల్లాలో ఆరు ఆస్పత్రులు అనకాపలి జిల్లాలో ఎన్టీఆర్ ఆసుపత్రిలో, ఎస్.రాయవరం మండలం కొరుప్రోలు, నక్కపల్లి మండలం వేంపాడు, కశింకోట మండలం కన్నూరుపాలెం, నర్సీపట్నం, ఎం.కోడూరులో 6 ఆయుర్వేద ఆస్పత్రులు హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్లుగా అప్‌గ్రేడ్ చేశారు. గత ఏడాది ఆగస్టులో ఎస్.రాయవరం మండలం కొరుప్రోలు ఆయుర్వేద కేంద్రాన్ని స్పెషలిస్ట్ వెల్నెస్ అండ్ పంచకర్మ సెంటర్‌గా అప్ గ్రేడ్ చేశారు. వాటితో పాటుగా ఆరు ఆస్పత్రులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా నిధులు కేటాయించారు. ఆరు వెల్నెస్ సెంటర్ల ఆధునికీకరణ జన ఆరోగ్య సమితి కమిటీని ఏర్పాటు చేసి ఆస్పత్రుల భవనాల ఆధునికీకరణ పనులు పూర్తి చేశారు. గత ప్రభుత్వ హయాంలోనే జాతీయ ఆరోగ్య మిషన్ ఆధ్వర్యంలో ఆయుష్మాన్ భారత్ కార్యక్రమంలో భాగంగా ఒక్కో ఆస్పత్రిని రూ.3.5 లక్షలతో ఆధునికీకరించారు. అదనపు సౌకర్యాలు కల్పిoచి ప్రజలకు విస్తృతంగా వైద్య సేవలందిస్తున్నారు. కశింకోట మండలంలోని కన్నూరుపాలెం ఆస్పత్రిని ఆయుర్వేదిక్ హెల్త్ అండ్ వెల్నెస్ స్పెషాలిటీ ఆస్పత్రిగా అభివృద్ధి చేస్తున్నారు. అనకాపల్లి ఎన్టీఆర్ ఆస్పత్రిలోని ఆయుష్ విభాగంలో మౌలిక వసతులకు రూ.3.50 లక్షలు మంజూరు చేసింది. తాజాగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో ఆయుష్మాన్ భారత్ కింద ఆయుర్వేదిక్ ఆస్పత్రులను అభివృద్ధి చేసి, సేవల్ని విస్తృత పరచాలని నిర్ణయించారు. ఇందులో భాగంగానే జిల్లాలోని వేంపాడు, కొరుప్రోలు, కన్నూరుపాలెం ఆయుర్వేదిక్ ఆస్పత్రుల అభివృద్ధికి మొత్తం రూ.10.5 లక్షలు వెచ్చిస్తున్నారు. ఎన్నికల సమయంలో నిలిచిన పనులు మూడు నెలలుగా తిరిగి కొనసాగాయి. పంచకర్మ నుంచి జలగ వైద్యం వరకూ... సగటున ఒక్కో ఆస్పత్రిలో నెలకు 900 నుంచి 1000 మంది వరకూ రోగులకు వైద్యసేవలందుతున్నాయి. జిల్లాలోని ఆరు ఆస్పత్రుల్లో 5 వేల నుంచి 6 వేల మందికి వైద్య సేవలందుతున్నాయి. ఆస్పత్రిలో పక్షవాతం, మోకాళ్లు, కీళ్ల నొప్పులు, ఇతర దీర్ఘకాలిక వ్యాధులతో పాటుగా పంచకర్మ చికిత్సలో అభ్యంగం, స్వేద కర్మ, పిండస్వేద కటివస్తి, జానువస్తి, గ్రీవ వస్తి, క్షారసూత్ర, అగ్రికర్మ, జలగ వైద్యంతో పాటుగా అనేక వైద్యసేవలు అందుబాటులోకి వచ్చాయి. ఇక్కడ ప్రస్తుతం రోజుకు 40 నుంచి 45 మంది వరకూ రోగులు వస్తున్నారు. పంచకర్మ థెరపీ..ఆయుర్వేద పంచకర్మ చికిత్స కోసం కేరళ, తమిళనాడు, కర్ణాటకకు ప్రత్యేకంగా థెరపీ వైద్యం కోసం వెళుతుంటారు. అదే తరహా కేరళ మెడికేటెడ్ ఆయిల్ ద్వారా వైద్యం అనకాపల్లి జిల్లాలో ఆయుర్వేద వెల్నెస్ సెంటర్లల్లో కూడా అందిస్తున్నారు. పంచకర్మ థెరపీ ద్వారా వైద్యసేవలు అందిస్తున్నారు. నశ్య, వమన, విరేచన, వస్తి, రక్తమోక్షణ వంటి థెరపీల ద్వారా చికిత్సలు అందిస్తున్నారు.వమన సొరియాసిస్, రెస్పిరేటరీ వంటి దీర్ఘకాలిక సమస్యలకు అందించే ఆయుర్వేదిక్ వైద్యం. థెరఫిటిక్ మెడిసిన్ ఇచ్చి వాంతులు చేయించి తద్వార శ్వాశకోశ వ్యవస్థ మెరుగ్గా పనిచేసేలా సహాయపడుతుంది.. విరేచన కడుపు ఉబ్బరం, అల్సర్ ఇతర దీర్ఘకాలిక సంబంధిత వ్యాధుల్లో కడుపులో విరేచన ద్వారా క్లీన్ చేయించి ఈ థెరపీ చేస్తారు. దీని ద్వారా కడుపు క్లీనింగ్ అయి లివర్, జీర్ణాశయం, కిడ్నీలు సక్రమంగా పనిచేసేలా థెరపీ చేస్తారు. వస్తి.. మగ,ఆడ వారిలో వెన్నుపూస, స్పైనల్ కార్డు వంటి సమస్యల్లో ఈ థెరపీ వాడతారు. మైక్రో ఛానల్ ద్వారా ఆయిల్ రాసి ఈ చికిత్స అందిస్తారు రక్త మోక్షణ... శరీరంపై వివిధ అవయవాలల్లో ధీర్ఘకాలికంగా పుండ్లుగా ఏర్పడి వాటి నుంచి రసి కారి కుళ్లిపోతే.. అక్కడ ఈ థెరపీ ద్వారా చెడు రక్తం తీసే చికిత్స ఇది. ఈ చికిత్స వచ్చే నెల నుంచి ప్రారంభమవుతుంది. అవగాహన పెరిగింది.. జిల్లాలో ఆరు ఆయుర్వేదిక్ హెల్త్ అండ్ వెల్నెస్ కేంద్రాల ద్వారా వైద్యసేవల అందిస్తున్నాం. చదవండి: పిన్న వయసులోనే ప్రపంచం మెచ్చిన అద్భుత మేధావికేరళలో లభ్యమయ్యే మెడికేటెడ్ ఆయిల్‌తో థెరపీ వైద్యం అందుబాటులో ఉంది. ప్రతి ఆస్పత్రిలో ఇద్దరు థెరపిస్టుల ద్వారా వైద్యసేవలందిస్తున్నాం. ఆయుర్వేదిక్ వైద్యం పట్ల ప్రజల్లో అవగాహన పెరిగింది. ఎక్కువగా ధీర్ఘకాలికంగా వివిధ వ్యాధులతో బాధపడుతున్న రోగులు వైద్యం కోసం వస్తున్నారు. పంచకర్మ థెరపీతో పాటు అదనంగా ఐఆర్ థెరపీ ద్వారా మోకాళ్ల నొప్పి వంటి సమస్యలకు వైద్య సేవలందిస్తున్నాం. ప్రజలకు ఆశాల ద్వారా అవగాహన కల్పిస్తున్నాం. ఆస్పత్రి ఆవరణలో ఔషధ మొక్కలు, హెర్బల్ గార్డెన్ కూడా పెంచుతున్నాం. – కె.లావణ్య, ఆయుష్ విభాగం వైద్యాధికారి, జిల్లా ఆయుర్వేదిక్ డిస్పెన్సరీ -
అంపశయ్యపై ఆయుష్
నెల్లూరు(అర్బన్) : భారతదేశ అతి ప్రాచీనమైన వైద్యవిధానాలతో రోగికి చికిత్సనందించి ఆరోగ్యవంతులను చేయడానికి ఉద్దేశించిన శాఖ ఆయుష్(ఆయుర్వేద, యోగ అండ్ నాచురోపతి, యునాని, సిద్ద అండ హోమియోపతి). అల్లోపతి ద్వారా నయంకాని దీర్ఘకాలిక నొప్పులు, తిమ్మిర్లు, అజీర్తి, వైరల్ ఇన్ఫెక్షన్లు నయమవుతుండటంతో సంప్రదాయ వైద్య విధానాలకు ఆదరణ పెరిగింది. వీటి ప్రాముఖ్యతను గుర్తించిన కేంద్రప్రభుత్వం 2002లో నేషనల్ రూరల్ హెల్త్ మిషన్(ఎన్ఆర్హెచ్ఎం) పథకం ద్వారా పీహెచ్‌సీలకు అనుబంధంగా ఆయుష్ వైద్యశాలలను ఏర్పాటు చేసి నిధులు అందిస్తోంది. అయితే ఈ పథకాన్ని దేశంలో ఎక్కడా లేని విధంగా తెలుగుదేశం ప్రభుత్వం నిర్వీర్యం చేసింది. ఆయుష్‌లోని ఖాళీలను భర్తీ చేయకపోవడం, ఉన్న సిబ్బందికి జీతాలు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతోంది. ఎంబీబీఎస్ డాక్టర్ల మాదిరిగానే ఐదున్నరేళ్లు కష్టపడి ఆయుష్ పరీక్షలు కూడా పాసై వృత్తిలో చేరిన డాక్టర్లయినా, వారిని కూడా చిన్నచూపు చూస్తుండటంతో వారు ఆందోళన బాట పడుతున్నారు. అన్నీ ఖాళీలే జిల్లాలో 22 ఆయుర్వేద ఆస్పత్రులున్నాయి. వీటిలో 22 మంది డాక్టర్లుండాల్సి ఉండగా 21 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇక వీరికి సహాయకులుగా ఉండాల్సిన అసిస్టెంట్ పోస్టులు కూడా ఖాళీగా ఉన్నాయి. 13 హోమి యో ఆసుపత్రిలున్నాయి. ఇందులో 13 మంది వైద్యు లకు 10 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 5 యునాని పోస్టులకు 3 ఖాళీలే. అలాగే నేచురోపతి వైద్యంలో 3 పోస్టులుంటే ఒక్కటీ భర్తీ చేయలేదు. ఇవే కాక జిల్లాలో నేరుగా రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో మరో 24 రెగ్యులర్ ఆయుర్వేద డిస్పెన్సరీలున్నాయి. రెగ్యు లర్ పోస్టుల్లో మాత్రం రెండు ఆయుర్వేద పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇందులో అల్లూరులోని ఆస్పత్రి భవనం శిథిలావస్థకు చేరి పోయి కూలేందుకు సిద్ధం గా ఉంది. దీంతో వరండాలో డిస్పెన్సరీని మాత్రమే నిర్వహిస్తున్నారు. రెగ్యులర్ హోమియో డిస్పెన్సరీలు 13 ఉండగా వాటిలో నలుగురు డాక్టర్లు లేరు. జిల్లాలో ఖాళీ పోస్టుల భర్తీకి 6 నెలల క్రితం మెరిట్‌లిస్టును ప్రకటించారు. అయినా వైద్య శాఖ నేటికీ పోస్టులను భర్తీ చేయకపోవడం చూస్తే ఆయుష్ డాక్టర్లపట్ల అధికారుల నిర్లక్ష్యవైఖరి ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. వేధిస్తున్న మందుల కొరత ఆయుష్కు చెందిన అన్ని డిస్పెన్సరీల్లో ఓపీ సరాసరి 50గా ఉంది. నెల్లూరులోని కుక్కలగుంట హోమియో ఆస్పత్రిని పరిశీలిస్తే అక్కడ ప్రతిరోజు దాదాపు 100 మంది వరకు రోగులు వస్తున్నారు. అయితే సంప్రదాయ వైద్యవిధానాలను ఆశ్రయించే రోగులకు తగిన విధంగా మందులను సరఫరా చేయడంలో అధికారులు విఫలమయ్యారు . దీంతో రోగులు మందుల కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇటీవల జన్మభూమి సభలు నిర్వహించినప్పుడు గ్రామ సభల్లో ఆయుర్వేద మందులను దాదాపు ఖాళీ చేసేశారు. ఇక వైద్యం కోసం ఓపీకి వచ్చే రోగులకు మందులు ఇవ్వలేక డాక్టర్లు ఒకటి, అరా ఇచ్చి సర్దుబాటు చేస్తున్నారు. రాష్ట్రం విడిపోయాక అసలు రాష్ట్రానికి ఇంకా ఫార్మసీ కూడా ఏర్పాటు చేయలేదు. అధికారులు అరకొర మందులు కొనుగోలు చేసి డిస్పెన్సరీలకు పంపుతున్నారు. పోస్టుల భర్తీలో ఆయుష్కు అన్యాయం ఎన్ఆర్హెచ్ఎం, ఆర్బీఎస్కే లాంటి స్కీముల కింద మంజూరైన పోస్టుల్లో ఆయుష్ శాఖకు 50 శాతం పోస్టులు కేటాయించాలని జీవోలో స్పష్టంగా ఉంది. అయినా ఈ పోస్టులను కూడా అల్లోపతి డాక్టర్లతో నింపి ఆయుష్ డాక్టర్లకు అన్యాయం చేస్తున్నారు. జీతాలకు నోచుకోని డాక్టర్లు ఆయుష్ డాక్టర్లు ఐదు నెలలుగా జీతాలకు నోచుకోలేదు. బడ్జెట్ ఉన్నప్పటికీ తగిన విధంగా ఫైలు ఎప్పటికప్పుడు రన్ చేయడంలో ఎన్ఆర్హెచ్ఎం సిబ్బంది నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారు. దీంతో పేరుకే డాక్టర్లు అయినప్పటికీ భార్యా, బిడ్డలకు తిండిపెట్టేందుకు అప్పులపాలవుతున్నారు.దీంతో ఆయుష్శాఖకి చెందిన ఉద్యోగులు, డాక్టర్లు ఆందోళనలకు పూనుకుంటున్నారు. మా పోస్టులు మాకే దక్కాలి ప్రభుత్వ జీవో ప్రకారం మాకు దక్కాల్సిన పోస్టులను కూడా అల్లోపతి వారితో భర్తీ చేయడం అన్యాయం. మా పోస్టులను మాకే ఇవ్వాలి. ప్రభుత్వం చిన్న చూపుచూడటం తగదు. సమస్యలు పరిష్కారమయ్యేందుకు ఆందోళనకు శ్రీకారం చుడుతున్నాం. డా.శ్రీనివాసరావు , నేషనల్ ఆయుష్ మెడికల్ అసోసియేషన్(నామా) జిల్లా అధ్యక్షుడు అల్లోపతి ప్రాక్టీసు చేసేందుకు అనుమతించాలి మేము కూడా ఐదున్నరేళ్లు వైద్య కోర్సులు చేశాం. కర్ణాటక రాష్ట్రంలో మాదిరిగా ఇక్కడ కూడా మాకు అల్లోపతి వైద్య విధానంలో మూడు నెలల పాటు రిఫ్రెషర్ శిక్షణనిచ్చి అల్లోపతివైద్యం చేసేందుకు అనుమతించాలి. డాక్టర్ల పోస్టులను వెంటనే భర్తీ చేయాలి. జీతాలు తక్షణమే విడుదల చేయాలి. లేకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమిస్తాం. డాక్టర్ సిరాజ్, నామా జిల్లా కార్యదర్శి త్వరలో జీతాలు ఇస్తాం. పోస్టులను భర్తీ చేస్తాం. టెక్నికల్ సమస్యల వల్ల తాత్కాలికంగా ఆయుష్ డాక్టర్లకు జీతాల సమస్య ఏర్పడింది. త్వరలో జీతాలు ఇస్తాం. అలాగే గతంలో పోస్టుల భర్తీకి మెరిట్ లిస్టు ప్రకటించిన మాట వాస్తవమే. ఈ మెరిట్ లిస్టుకు అనుగుణంగా వెంటనే పోస్టులను భర్తీ చేసేందుకు చర్యలు చేపడుతున్నాం. డా.వరసుందరం, జిల్లా వైద్యఆరోగ్యశాఖాధికారి