breaking news
Assembly seats Distribution
-
సిటింగ్‌ల వైపే మొగ్గు..
సాక్షి ,శ్రీకాకుళం : ఇక ఒకటి రెండు రోజుల్లో సార్వత్రిక ఎన్నికలకు నోటిఫికేషన్ వచ్చేయనుంది! అధికార తెలుగుదేశం పార్టీ అధిష్టానం కూడా అభ్యర్థులపై అమరావతిలో రెండ్రోజులుగా ఎడతెగని కసరత్తు చేస్తోంది! దాదాపుగా సిటింగ్ ఎమ్మెల్యేలకే మళ్లీ సీటు దక్కే అవకాశం ఉన్నా ఆదివారం అభ్యర్థులు ఎవరనేదీ ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం పాలకొండ, పాతపట్నం మినహా జిల్లాలోని మిగిలిన ఎనిమిది నియోజకవర్గాలకు అభ్యర్థులను ఖరారు చేసినట్లు తెలిసింది. వాస్తవానికి శ్రీకాకుళం నియోజకవర్గం నుంచి పోటీ చేయడానికి ఈసారైనా తనకు అవకాశం వస్తుందని మాజీ మంత్రి, టీడీపీలో సీనియర్ నాయకుడైన గుండ అప్పలసూర్యనారాయణ ఆశించారు. 2014 ఎన్నికలలో ఆయనకు చంద్రబాబు మొండిచేయి చూపించారు. ఆయన భార్య గుండ లక్ష్మీదేవివైపే మొగ్గు చూపించారు. దీన్ని అవమానంగా భావించిన అప్పలసూర్యనారాయణ దాదాపు రెండేళ్ల పాటు రాజకీయాలకు దూరంగా ఉన్నారు. అయితే చిరకాల మిత్రుడు కిమిడి కళా వెంకటరావు చొరవతో చంద్రబాబు అరసవల్లి వెళ్లి అప్పలసూర్యనారాయణను బుజ్జగించిన సంగతి తెలిసిందే. శ్రీకాకుళం మున్సి పల్ కార్పొరేషన్ ఎన్నికలు నిర్వహిస్తే ప్రథమ మేయరు అయ్యేందుకు వీలుగా సహకరిస్తామని హామీ ఇచ్చారనే ప్రచారం జరిగింది. కానీ ఆ ఎన్నికలు ఇప్పటికీ జరగనేలేదు కానీ సార్వత్రిక ఎన్నికలు వచ్చేశాయి. మేయరు పద వీ లేదు ఎమ్మెల్యే సీటు లేదు అన్నట్లుగా మారి పోయింది అప్పలసూర్యనారాయణ పరిస్థితి. మంత్రులకు పాత స్థానాలే.. శ్రీకాకుళం సీటు కోసం ముద్దాడ కృష్ణమూర్తినాయుడు (నాగావళి కృష్ణ) దరఖాస్తు చేసుకున్నా దాన్ని పట్టించుకున్నదాఖలాలు లేవు. ఇక జిల్లాకు చెందిన మంత్రులు కింజరాపు అచ్చెన్నాయుడు, కిమిడి కళా వెంకటరావు తమ పాత స్థానాల్లోనే పోటీ చేయనున్నారు. టెక్కలి సీటు లేదంటే నరసన్నపేటలో తమ కుమారుడు కింజరాపు ప్రసాద్‌కు సీటు ఇవ్వాలని అచ్చెన్నాయుడి సోదరుడైన హరివరప్రసాద్ ఉవ్విళ్లూరినప్పటికీ టీడీపీ అధిష్టానం పెద్దగా పట్టించుకోలేదు. తన ప్రతిపాదనను ఉపేక్షిస్తే టెక్కలిలో స్వతంత్య్ర అభ్యర్థిగానైనా పోటీకి నిలబెడతానని కూడా ఆయన తన అనుచరుల వద్ద హెచ్చరికలు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. కింజరాపు కుటుంబానికి పెద్దదిక్కు దివంగత నాయకుడు ఎర్రన్నాయుడు జిల్లా రాజకీయాల్లో చక్రం తిప్పిన సమయంలో అచ్చెన్నాయుడి కన్నా ప్రసాద్‌దే టెక్కలిలో హవా. ఎర్రన్నాయుడి మరణంతో అనూహ్యంగా అచ్చెన్న ప్రాధాన్యం పెరగడంతో శ్రీకాకుళం ఎంపీ కింజరాపు రామ్మోహన్నాయుడు, ప్రసాద్ కుటుంబాలు కూడా తమ రాజకీయ భవితవ్యంపై కాస్త ఆందోళన చెందినట్లు కూడా గుసగుసలు వినిపించాయి. గత మూడేళ్లుగా అచ్చెన్న కార్యక్రమాలకు ప్రసాద్ దూరంగా ఉండటం, అన్నదమ్ముల మధ్య పొసగకపోవడం దృష్ట్యా సీటుకు ఎక్కడ ఎసరు వస్తుందోనని టీడీపీలో చర్చ నడుస్తోంది. ఇక కళా వెంకటరావుకు ఎచ్చెర్ల నియోజకవర్గంలో ప్రజాదరణ తగ్గిపోవడం, టీడీపీ నాయకుల అవినీతి పెచ్చుమీరిపోయిన నేపథ్యంలో పాతపట్నం వైపు దృష్టి పెడతారనే ప్రచారం జరిగింది. కానీ అక్కడ గత ఎన్నికలలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జెండాపై గెలిచిన కలమట వెంకటరమణ టీడీపీలోకి ఫిరాయించిన నేపథ్యంలో అక్కడ అధికార పార్టీకి వ్యతిరేక గాలులు వీస్తున్నాయి. మరోవైపు కింజరాపు కుటుంబానికి పట్టున్న గ్రామాలు 15 వరకూ ఆ నియోజకవర్గంలో ఉన్నాయి. ఇవన్నీ ఆలోచించి కళా చివరకు ఎచ్చెర్ల వైపే మొగ్గు చూపించినట్లు తెలిసింది. కళా సొంత ప్రాంతమైన రాజాం నియోజకవర్గంలో కావలి ప్రతిభాభారతిని కాదని కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన మాజీ మంత్రి కొండ్రు మురళీమోహన్‌కే టీడీపీ సీటు కేటాయించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదే జరిగితే సుదీర్ఘకాలం రాజకీయాల్లో కీలక పాత్ర పోషించిన ప్రతిభాభారతి తెరవెనుకకే పరిమితమైపోవచ్చు. ఇక కళా చక్రం తిప్పుతున్న పాలకొండ నియోజకవర్గం అభ్యర్థి ఎవరనేదీ శనివారం రాత్రికైనా కొలిక్కిరాలేదు. ఆదివారం ఉదయం మరోసారి ఇదే విషయమై అధిష్టానం చర్చించే అవకాశం ఉందని తెలిసింది. గత ఎన్నికలలో ఓడిపోయిన తర్వాత పాలకొండ నియోజకవర్గ ఇన్చార్జిగా ఉన్న నిమ్మక జయకృష్ణకే ఈసారి కూడా సీటు ఇప్పించాలని కళా వర్గం కోరుతుండగా, అతనికి తప్ప మరెవ్వరికి ఇచ్చినా పనిచేస్తామని పాలకొండ జడ్పీటీసీ సభ్యుడు దామోదరనాయుడు వర్గం గట్టిగా వాదిస్తోంది. ఇటీవలే పార్టీలో చేరిన మాజీ ఎమ్మెల్యే నిమ్మక సుగ్రీవులు కుమార్తె స్వాతికి సీటు వస్తుందని గుసగుసలు వినిపించినా జయకృష్ణకే సీటు ఖరారు కావొచ్చని తెలుస్తోంది. ఫిరాయింపు ఎమ్మెల్యేకు కష్టకాలం... వైఎస్సార్సీపీ నుంచి టీడీపీలోకి ఫిరాయించడానికి భారీగా నజరానాలే గాకుండా 2019 ఎన్నికలలో సీటు కూడా ఇస్తామని పాతపట్నం ఎమ్మెల్యే కలమట వెంకటరమణకు భరోసా ఇచ్చారనే ప్రచారం గతంలో జరిగింది. తీరా ఇప్పుడు సీట్లు ఖరారు చేసే సమయం వచ్చేసరికి కలమట అభ్యర్థిత్వంపై టీడీపీ అధిష్టానం తటపటాయించడం గమనార్హం. గతంలో ఇక్కడ టీడీపీ అభ్యర్థిగా ఓడిపోయిన శత్రుచర్ల విజయరామరాజు ఎమ్మెల్సీగా ఎన్నిక కావడం, ఇప్పుడీ ఎన్నికలలో పోటీ చేయడానికి ఆయన సుముఖంగా లేకపోవడం, ఇక్కడ వైఎస్సార్సీపీ అభ్యర్థి రెడ్డి శాంతికి పోటీగా నిలిచే మరో అభ్యర్థి కనిపించకపోవడంతో చివరకు కలమటకే టీడీపీ అధిష్టానం సీటు ఇస్తుందనే గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే కలమట పేరును చంద్రబాబు వ్యతిరేకించారనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో చివరి వరకూ ఉత్కంఠ తప్పేలా లేదు. శివాజీ అస్త్ర సన్యాసమేనా? గౌతు లచ్చన్న వారసుడిగా సుదీర్ఘకాలం రాజకీయాల్లో ఉన్న శ్యామసుందర శివాజీ ఈ ఎన్నికలలో అస్త్రసన్యాసం చేయడం దాదాపుగా ఖాయమైపోయింది. ఆయన కుమార్తె, టీడీపీ జిల్లా అధ్యక్షురాలైన యార్లగడ్డ శిరీషకే పలాస సీటు ఖరారయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఆమె భర్త యార్లగడ్డ వెంకన్న చౌదరిపై అనేక అవినీతి ఆరోపణలు వెల్లువెత్తడం, గత ఐదేళ్ల కాలంలో షాడో ఎమ్మెల్యేగా చక్రం తిప్పిన నేపథ్యంలో ఆమె గెలుపు నల్లేరుపై నడక కాదని పలాస ప్రజలు చెబుతున్నారు. అనూహ్య పరిణామాల మధ్య శిరీష గనుక ఇచ్ఛాపురంలో పోటీచేస్తే తనకు పలాస సీటు వస్తుందనే ఆశతో ఇటీవలే టీడీపీలో చేరిన పలాస మాజీ మున్సిపల్ చైర్మన్ వజ్జ బాబూరావుకు నిరాశ ఎదురైంది. అవినీతి ఆరోపణలు వచ్చినా... ఇచ్ఛాపురం సిట్టింగ్ ఎమ్మెల్యే బెందాళం అశోక్, నరసన్నపేట సిట్టింగ్ ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తిలపై కూడా అనేక అవినీతి ఆరోపణలు వెల్లువెత్తినా చివరకు వారిద్దరికీ టీడీపీ అధిష్టానం పచ్చజెండా ఊపినట్లు తెలిసింది. అశోక్‌కు మరోసారి సీటు దక్కకుండా శివాజీ అడ్డుకుంటారని, ఇటీవలే టీడీపీలో చేరిన నర్తు నరేంద్ర యాదవ్‌కు ఆ అవకాశం ఇప్పిస్తారనే ప్రచారం జరిగింది. నరేంద్రకు ఈసారీ ఆశాభంగం తప్పలేదు. ఇక బగ్గు రమణమూర్తిని కాదని నరసన్నపేటలో ఎంపీ కింజరాపు రామ్మోహన్నాయుడిని రంగంలోకి దించుతారని ప్రచారం జరిగినా చివరకు బగ్గు మాటే నెగ్గినట్లు తెలుస్తోంది. -
డీఎఫ్‌కు బీటలు?.
* కాంగ్రెస్, ఎన్సీపీ మధ్యపెరుగుతున్న దూరం * పరస్పరం విమర్శలుచేసుకుంటున్న పార్టీలు * అసెంబ్లీ సీట్ల పంపకంలో తకరారు * ఒంటరి పోరుకు సై అంటే సై అంటున్న మిత్రపక్షాలు సాక్షి, ముంబై: అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్నకొద్దీ కాంగ్రెస్, ఎన్సీపీల మధ్య సీట్ల పంపకాలపై నెలకొన్న విభేదాలు మరింత ముదిరి పాకాన పడుతున్నాయి. లోక్‌సభ ఎన్నికల్లో ఈ కూటమి ఘోరపరాజయం పొందిన విషయం తెలిసిందే. అయినా అసెంబ్లీ ఎన్నికల్లో సీట్ల పంపకంపై రెండు పార్టీల మధ్య పొంతన కుదరడంలేదు. రోజురోజుకీ రెండు పార్టీల నాయకులు ఒకరిపై ఒకరు తీవ్రంగా ఆరోపణలు చేసుకుంటున్నారు. ఒంటరిపోరుకు సై అంటే సై అంటున్నారు. ఇదిలా ఉండగా, తాజాగా ఎన్సీపీ నేత డి.పి.త్రిపాఠి వ్యాఖ్యలు ఈ రెండు పార్టీల మధ్య దూరాన్ని మరింత పెంచే అవకాశం కనిపిస్తోంది. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ప్రజాస్వామ్య కూటమిలో సీట్ల పంపకాలపై ఢిల్లీలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. మిత్రపక్షంతో ప్రభుత్వాన్ని నడిపించడం కాంగ్రెస్‌కు తెలియదని విమర్శించారు. మిత్రపక్షాలను అణగదొక్కేందుకు కాంగ్రెస్ యత్నిస్తోందన్నారు. ఒంటరి పోరుకు దిగుతామని కాంగ్రెస్ నాయకులు చేస్తున్న ప్రకటనలు కూటమికి చేటు చేస్తాయనే విషయాన్ని గుర్తించుకోవాలన్నారు. లోక్‌సభలో ఎవరికి ఎక్కువ సీట్లు ఉంటే ఆ పార్టీకి అసెంబ్లీలో ఎక్కువ స్థానాలు కేటాయించాలనేది తమ మధ్య ఉన్న ఒప్పందమని, దానికి కాంగ్రెస్ తూట్లు పొడుస్తోందని వ్యాఖ్యానించారు. లోకసభ ఎన్నికల్లో మహారాష్ట్రలో కాంగ్రెస్ కంటే ఎన్సీపీకి అధిక స్థానాలు లభించాయి. దీంతో రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కంటే అధిక సీట్లు ఎన్సీపీకి కేటాయించాల్సి ఉందని ఆయన స్పష్టం చేశారు. అయినా ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్, పార్టీ రాష్ట్ర సునీల్తట్కరే కూడా 144 సీట్లు ఇవ్వాల్సిందేనని కోరుతున్నారని చెప్పారు. 2009 అత్యధికంగా లోకసభ సీట్లు కాంగ్రెస్‌కు ఉండడంతో అసెంబ్లీలో అధిక స్థానాల్లో కాంగ్రెస్ పోటీ చేసింది. ఈసారి తమ పార్టీకి లోక్‌సభ సీట్లు అధికంగా ఉన్నాయని, దీంతో తమకు 144 సీట్లు ఇవ్వాల్సిందేనని సునీల్ తట్కరే డిమాండ్ చేశారని పేర్కొన్నారు. కాగా దీనిపై ఎంపీసీసీ అధ్యక్షుడు మాణిక్‌రావ్ ఠాక్రే స్పందిసూ.. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరి పోరుకు కాంగ్రెస్ సిద్ధంగా ఉందని ప్రకటించారు. ఎన్సీపీ కోరిన న్ని సీట్లు ఇవ్వడానికి తాము సిద్ధంగా లేమన్నారు. గత ఒప్పందాల మేరకే సీట్ల కేటాయింపులుంటాయని, లేనిపక్షంలో ఎవరి దారి వాళ్లు చూసుకుందామని ఘాటుగా స్పష్టం చేశారు. ఆశావహులనుంచి దరఖాస్తుల ఆహ్వానం ముంబై: అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసేందుకు రాష్ట్రవ్యాప్తంగా ఆసక్తి ఉన్న అభ్యర్థుల నుంచి మహారాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ(ఎంపీసీసీ) దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈ మేరకు అన్ని జిల్లా యూనిట్ కార్యాలయాలకు ఎంపీసీసీ నుంచి లేఖలు అందాయి. పార్టీ జిల్లా కార్యాలయాల్లో దరఖాస్తులు అందుబాటులో ఉన్నట్లు పార్టీ అధికార ప్రతినిధి సచిన్ సావంత్ తెలిపారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు దరఖాస్తులు నింపి తిలక్‌భవన్‌లో ఉన్న రాష్ట్ర పార్టీ కార్యాలయానికి ఈ నెల 11వ తేదీలోగా పంపాలని కోరారు. రాష్ట్రంలో మొత్తం 288 అసెంబ్లీ స్థానాలు ఉండగా, గత ఎన్నికల్లో కాంగ్రెస్, ఎన్సీపీ కూటమిగా పోటీచేసి అధికారాన్ని చేజిక్కించుకున్నాయి. అప్పుడు 174 స్థానాల్లో కాంగ్రెస్, 114 స్థానాల్లో ఎన్సీపీ పోటీచేసిన విషయం తెలిసిందే. అయితే ఈసారి ఎన్సీపీ 144 స్థానాలు కావాలని డిమాండ్ చేస్తోంది. దీంతో రెండుపార్టీల మధ్య విభేదాలు పొడసూపుతున్నాయి. ఎన్సీపీకి మరో 10 సీట్లు అదనంగా ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్న కాంగ్రెస్, 50ః50 ఫార్ములాకు అంగీకరించడంలేదు.