మరో ఉద్దానంగా ఇబ్రహీంపట్నం.. మా పోరాటం ఆగదు: జోగి రమేష్
సాక్షి, ఎన్టీఆర్ జిల్లా: చంద్రబాబు హయాంలో గాలి, నీరు.. మొత్తం కలుషితం అయిపోతున్నాయని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ నేత జోగి రమేష్ ఆవేదన వ్యక్తం చేశారు. మూలపాడు డంప్ నుంచి టీడీపీ నేతల బూడిద అక్రమ రవాణాను అడ్డుకునే క్రమంలో ఆందోళన చేపట్టిన ఆయన్ని మంగళవారం ఉదయం పోలీసులు అరెస్ట్ చేశారు. భవానిపురం పీఎస్ నుంచి విడుదలైన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు వస్తే ఏ సంస్థ అయిన ప్రవేట్ అవ్వాల్సిందే. బూడిద(ఫ్లై యాష్) టెండర్ ఒక వింగ్‌గా చేసి లోకేష్ కనుసన్నల్లో ప్రవేట్ చేసేశారు. ఇబ్రహీంపట్నంలో ఇప్పుడు నీరు, గాలి మొత్తం కలుషితం అయ్యింది. ప్రజలు, థర్మల్ ప్లాంట్లలో లారీ డ్రైవర్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కిడ్నీ సమస్యల బారిన పడుతున్నారు. వెరసి.. ఇబ్రహీంపట్నం మరో ఉద్దానం గా మారింది. అందుకే ఇక్కడ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పెట్టాలని డిమాండ్ చేస్తున్నాం.ఇబ్రహీంపట్నం నుంచి అక్రమంగా బూడిద నిలువ చేసి హైదరాబాద్‌కి తరలిస్తున్నారు. మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్‌పై చర్యలు తీసుకోవాలని కోరితే.. అధికారులు మమ్మల్నే అరెస్ట్ చేస్తున్నారు. కనీసం చంద్రబాబైనా స్థానిక ఎమ్మెల్యేపై చర్యలు తీసుకొంటారా?. వీటీపీఎస్‌లో బూడిద టెండర్లు తక్షణమే రద్దు చేయాలి. కాలుష్యం భరితంగా మారిగా గ్రామాలను ఆదుకోవాలి. మొక్కలు నాటించి.. చెట్ల సంరక్షణ కొనసాగించాలి. అక్రమ డంప్‌ని ప్రభుత్వం చేసుకునేంత వరకు పోరాటం కొనసాగిస్తాం అని జోగి రమేష్ అన్నారు. ఇదిలా ఉంటే.. బూడిద రాజకీయాలు ఎన్టీఆర్ జిల్లా రాజకీయాలను ఒక్కసారిగా హీటెక్కించాయి. టీడీపీ నేతల అక్రమ బూడిద రవాణాను(Ash Mafia) అడ్డుకునేందుకు జోగి రమేష్ పోరాటానికి సిద్ధమయ్యారు. ఈ క్రమంలో.. బుధవారం మూలపాడులో బూడిద డంప్‌ను పరిశీలించేందుకు ఆయన సిద్ధమయ్యారు. అయితే ఆయన పర్యటనను అడ్డుకునేందుకు కూటమి ప్రభుత్వం కుట్రలకు దిగింది. ఈ క్రమంలో ఇబ్రహీంపట్నంలో భారీగా పోలీసులు మోహరింపజేసింది. మరోవైపు.. మూలపాడుకు వెళ్లకుండా జోగి రమేష్ ఇంటి వద్ద పోలీసులు భారీగా మోహరించారు. 144 సెక్షన్ అమల్లోకి తెచ్చిన పోలీసులు.. అటువైపుగా గుంపులుగా వెళ్లేందుకు ఎవరినీ అనుమతించడం లేదు. దీంతో అప్పటికే అక్కడికి భారీగా చేరుకున్న వైఎస్సార్సీపీ కార్యకర్తలు.. తమను అనుమతించాలంటూ పోలీసుల కాళ్లు మొక్కుతూ నిరసనలు తెలియజేశారు. ఈ పరిణామాలతో జోగి రమేష్ నివాసం వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొనగా.. ఆందోళనకు సిద్ధమైన జోగి రమేష్‌ను పోలీసులు అరెస్ట్ చేసి పీఎస్‌కు తరలించారు.బూడిద రవాణా ద్వారా ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ అక్రమార్జన చేశారన్నది జోగి రమేష్ చెబుతోంది. అంతేకాదు అక్రమ బూడిద నిల్వలను ప్రభుత్వమే స్వాధీనం చేసుకోవాలని డిమాండ్ చేస్తున్నారాయన. అయితే.. జోగి రమేష్ వ్యాఖ్యలపై వసంత కృష్ణ ప్రసాద్ తీవ్రంగా స్పందించారు. జోగి రమేష్ ఇల్లు నేలమట్టం చేస్తా అంటూ అనే వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ తరుణంలో అక్కడ రాజకీయ అలజడి రేగింది.