breaking news
Arvindarsing
-
ఇవేం కోతలు..?
న్యూఢిల్లీ: నగరంలో విధిస్తున్న అప్రకటిత నీటి, విద్యుత్ కోతలపై కాంగ్రెస్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ధరల పెరుగుదల, విద్యుత్, నీటి కోతలపై ప్రభుత్వ తీరును తప్పుబడుతూ డీపీసీసీ అధ్యక్షుడు అర్వీందర్‌సింగ్ నేతృత్వంలో ఆందోళనకు దిగింది. ఆదివారం ఉదయం 9 గంటలకు అశోక్‌విహార్‌లోని వాటర్‌ట్యాంక్ సమీపంలోగల ప్రధాన రహదారిపై లవ్లీతోపాటు కాంగ్రెస్ నేతలు రాస్తారోకో చేశారు. దీంతో ఈ రహదారిపై వాహనాల రాకపోకలు నిలిచిపోయి ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగింది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ప్రధాని దిష్టి బొమ్మను దగ్ధం చేశారు. కేంద్ర విద్యుత్‌శాఖ మంత్రి పియూష్ గోయెల్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా లవ్లీ మాట్లాడుతూ... విద్యుత్ కంపెనీల ఒప్పందాలను బీజేపీ ప్రభుత్వం కావాలనే అడ్డుకుంటోందని ఆరోపించారు. ఢిల్లీలోని అనేక ప్రాంతాల్లో విద్యుత్ కోతలు ఇష్టానుసారంగా కొనసాగుతున్నాయని, నీటి సరఫరా కూడా సక్రమంగా జరగడంలేదని లవ్లీ ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారంలోకి రాకముందు 24 గంటలపాటు విద్యుత్, అవసరాలకు సరిపడా నీటి సరఫరా చేస్తామని కోతలు కోసిన బీజేపీ నేతలు అధికారంలోకి వచ్చిన తర్వాత చేస్తోందమేమిటని లవ్లీ నిలదీశారు. మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్దపెట్టున నినాదాలు చేయడంతో రంగప్రవేశం చేసిన పోలీసులు ఆందోళనకారులను చెదర గొట్టేందుకు ప్రయత్నించారు. అయినా వారి నుంచి ప్రతిఘటన ఎదురుకావడంతో సీనియర్ పోలీస్ అధికారి ఒకరు లవ్లీతో మాట్లాడి ఆందోళనను విరమింపజేశారు. -
ప్రతిపక్షాల సర్వేలపై కాంగ్రెస్ నేతల మండిపాటు
న్యూఢిల్లీ: సర్వేల పేరుతో ప్రతిపక్షాలు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయని కాంగ్రెస్ పార్టీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆ సర్వేల నివేదికలను తప్పుల తడకలుగా అభివర్ణించింది. సర్వే గణాంకాలను చూపుతూ విషప్రచారానికి పాల్పడుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేసింది. శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పార్టీ సీనియర్ మంత్రులు హరుణ్ యూసుఫ్, అర్వీందర్‌సింగ్ లవ్లీ, రాజ్‌కుమార్ చౌహాన్లు మాట్లాడారు. ఢిల్లీ బీజేపీతోపాటు కొత్తగా పుట్టుకొచ్చిన ఆమ్ ఆద్మీ పార్టీలు సర్వేల పేరుతో చేస్తున్న ప్రచారాన్ని ఎండగట్టారు. డిసెం బర్ 4న జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు తమదంటే తమదంటూ ఇరు పార్టీలు చెప్పుకుంటున్నాయని, నిజానికి ఇరు పార్టీల సర్వేల గణాంకాలు కూడా తప్పుల తడకలేనని విమర్శించారు. ప్రజ లను తప్పుదోవ పట్టిస్తూ తమను తాము విజేతలుగా ప్రకటించుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ప్రతిపక్ష బీజేపీకి ప్రజల సమస్యలు పట్టవని, కేవలం అధికారంలోకి రావడమే ఆ పార్టీ ప్రధాన లక్ష్యంగా కనిపిస్తోందని పట్టణాభివృద్ధిశాఖ మంత్రి అర్విందర్‌సింగ్ లవ్లీ విమర్శించారు. 1993 నుంచి 98 వరకు బీజేపీ అధికారంలో ఉందని, అప్పుడు ఆ పార్టీకి ముగ్గురు ముఖ్యమంత్రులు ఉండేవారని ఎద్దేవా చేశారు. ఇప్పటికీ ఆ పార్టీలో ముఖ్యమంత్రి పదవి కోసం కుమ్ములాటలు జరుగుతూనే ఉన్నాయన్నారు. ఎటువంటి అడ్డదారుల్లో ప్రయాణిం చైనా అధికారంలోకి రావాలని ఆ పార్టీ నేతలు ప్రయత్నిస్తున్నారని, అందుకే సర్వేల పేరుతో తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ ఘాటైన విమర్శలు చేశారు. కేవలం మాటలతో మాత్రమేకాకుండా బీజేపీ నేతల్లో ముఖ్యమంత్రి పదవి కోసం పోటీ పడుతున్న హర్షవర్ధన్, విజేందర్ గుప్తా, వీకే మల్హోత్రాల వ్యంగ్య చిత్రాలతో కూడిన పోస్టర్లను ఆవిష్కరించారు. సర్వేలు చేయించుకునే హక్కు ఇరు పార్టీలకు ఉందని, అయితే అధికారంలోకి వచ్చే అవకాశం ఇరు పార్టీలకు ఒకేసారి ఎలా దక్కుతుందో తనకు అర్థం కావడంలేదని లవ్లీ ఎద్దేవా చేశారు. సర్వేలపై ఇరు పార్టీలకు పలు ప్రశ్నలు సంధించారు. రానున్న పక్షం రోజుల్లో 90 శాతం మంది ఓటర్లను ఆకట్టుకుంటామంటూ ఏఏపీ చేస్తున్న ప్రకటనలు ఎలా ఆచరణ సాధ్యమంటూ ప్రశ్నించారు. ఇక తాము అధికారంలోకి వస్తే విద్యుత్ బిల్లులను తగ్గిస్తామని బీజేపీ చెబుతోం దని, కొత్త కంపెనీలను ఆహ్వానిస్తామని చెబుతూ ప్రజలను మోసగిస్తోందని, కొత్త కంపెనీలు ఏర్పాైటైతే బిల్లులు మరింత పెరుగుతాయన్నారు. ఇక విద్య విషయంతో ఢిల్లీని తీసిపారేసినట్లు ప్రతిపక్షాలు మాట్లాడుతున్నాయని, ఎమ్సీడీ పాఠశాలల్లో ఉత్తీర్ణత శాతం వారికి తెలియదా? అని మంత్రులు ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో పాఠశాలలు ఏవీ లేవని, ఉన్న పాఠశాలలు ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ నడుపుతోందని, అందులో చదువుతున్న విద్యార్థులు ఏ మేర చదువుతున్నారో ఆ పార్టీలకు తెలియదా? అని ప్రశ్నించారు. ఐదో తరగతి చదువుతున్న విద్యార్థి కూడా ఆంగ్ల అక్షరమాలను సరిగా రాయలేకపోతున్నాడని, కార్పొరేషన్ల వైఫల్యం ఇక్కడే కొట్టొచ్చినట్లు కనిపిస్తోందన్నారు. వైఫల్యాలకు చిరునామాగా మారిన మీకు ప్రజలు ఎలా అధికారాన్ని అప్పజెబుతారని ప్రశ్నించారు.