ఆక్వా మందులకు నకిలీ మకిలి
తయారీ అడ్డాగా కైకలూరు
కొల్లేటితీర చేపల రైతులే లక్ష్యం
మొక్కుబడి తనిఖీలతో సరిపెడుతున్న డ్రగ్స్ అధికారులు
కైకలూరు : అనుమతులు లేని ఆక్వా మందుల తయారీకి కైకలూరు ప్రాంతం అడ్డాగా మారింది. చేపల చెరువుల సాగుపై అవగాహన ఉంటే చాలు ఇంటి వద్దే కుటీర పరిశ్రమగా చేపల మేత తయారీ కేంద్రాలను నెలకొల్పుతున్నారు. ఆకర్షణీయమైన లేబుళ్లతో మందులు తయారు చేసి చేపలు, రొయ్యల రైతులను బురిడీ కొట్టిస్తున్నారు. కొనుగోలు చేసిన మందులు ఏమేరకు నాణ్యమైనవనే విషయం తెలియని అనేకమంది ఆక్వా రైతులు ఆర్థికంగా నష్టపోతున్నారు. అనుమతులు లేని మేతల తయారీని అడ్డుకోవాల్సిన డ్రగ్స్ కంట్రోల్ అధికారులు మొక్కుబడి తనిఖీలతో సరిపెడుతుండటంతో వారి ఆగడాలు పెచ్చుమీరుతున్నాయి.
నెలకు రూ.50 లక్షల వ్యాపారం...
జిల్లాలో సుమారు రెండు లక్షల ఎకరాల్లో చేపల సాగు, 80 వేల ఎకరాల్లో రొయ్యల సాగు జరుగుతుందని అంచనా. ఇందులో ఎక్కువ శాతం కైకలూరు, మండవల్లి మండలాల్లో జరుగుతోంది. కైకలూరులో సుమారు 50 ఆక్వా మందుల దుకాణాలు ఉన్నాయి. వాటిలో కేవలం 13 దుకాణాలకు మాత్రమే లెసైన్సులు ఉన్నాయి. ఈ మందుల దుకాణాలన్నింటిలో కలిపి ఒక్క నెలలో దాదాపు రూ.50 లక్షలపైనే వ్యాపారం జరుగుతోందని అంచనా. అనేక దుకాణాల్లో అనుమతులు లేకుండా అమ్మకాలు చేస్తున్న యాంటీ బయోటిక్స్ మందులను డ్రగ్స్ అధికారుల తనిఖీలపై ముందే సమాచారం అందుతుండటంతో వాటిని రహస్య గోడౌన్లకు తరలిస్తున్నారు. సీడ్ సప్లిమెంటు పేరుతో అక్రమ వ్యాపారం చేసే కొంతమందికి రాజకీయ నాయకుల అండదండలు ఉండటం వల్లే తనిఖీల్లో వారు పట్టుబడటం లేదనే విమర్శలు ఉన్నాయి.
తయారీలో నిషేధిత మందులు...
సాధారణంగా చేపల సాగులో రెడ్ డిసీజ్, పేను, జలగ వ్యాధులు రైతులను ఇబ్బంది పెడతాయి. వాటి నివారణకు యాంటీ బయోటిక్స్ వాడతారు. ప్రభుత్వం ఎండ్రా ప్రాక్సిన్, సల్ఫా, ఆక్సి టెట్రాసైక్లిన్, ఎరిత్రా మైసిన్, కేనా మైసిన్, ఫిరిజోలైన్ వంటి మందులను నిషేధిత జాబితాలో పెట్టింది. రెడ్ డిసీజ్ వ్యాధి నివారణకు ఎండ్రా ప్రాక్సిన్, సల్ఫాలను వాడాలి. వాటిని వాడితేనే త్వరగా వ్యాధి నయమవుతుందని రైతులు భావిస్తున్నారు. కోళ్లఫారాల్లో వాటి వాడకం ఉంటుంది కాబట్టి కొందరు రైతులు అక్కడి నుంచి తీసుకొచ్చి చెరువుల్లో చల్లుతున్నారు. వాటికి డిమాండ్ పెరగడంతో కొంతమంది ముడిసరకు కొనుగోలు చేసి సొంతంగా తయారు చేసిన మందులను ప్యాకింగ్ చేసి విక్రయాలు చేస్తున్నారు. ఉదాహరణకు కేజీ సల్ఫా రూ.2,200 ఉంటే, దానిలో మైదా పిండి వంటి వాటిని కలిపి ఆకర్షణీయమైన ప్యాకింగ్‌లో ఎక్కువ ధరకు విక్రయిస్తున్నారు.
ఆర్థిక అవసరాలే పెట్టుబడి...
చేపలు, రొయ్యల సాగు లక్షల పెట్టుబడులతో కూడుకున్నది. ఏ మాత్రం నష్టం వచ్చినా రైతులు ఆర్థికంగా నష్టపోతారు. ఇటువంటి పరిస్థితుల్లో కొంతమంది దుకాణదారుల వద్ద మందులను అప్పుగా తీసుకుంటున్నారు. పట్టుబడులు సమయంలో డబ్బు చెల్లించే విధంగా ఒప్పందం కుదుర్చుకుంటున్నారు. ఈ కారణంగా దుకాణదారుడు ఏ మందు అంటగడితే అదే తీసుకునే పరిస్థితి నెలకొంటుంది. వ్యాపార ధోరణిలో పోటీతత్వం కారణంగా మార్కెట్లో నాసిరకం మందు వచ్చినా ఎవరూ పట్టించుకోవడం లేదు. రాష్ట్రంలోనే నాసిరకం మందులను గుర్తించడానికి ఆక్వా లేబరేటరీ కైకలూరులోనే ఉంది. అయినా రైతులు వినియోగించుకోవడం లేదు.
మత్స్యశాఖకు అధికారాలివ్వాలి
చేపల మందులపై నియంత్రణ మా చేతుల్లో లేదు. జిల్లాలో డ్రగ్స్ అధికారులు తక్కువ సంఖ్యలో ఉంటారు. ఎంపెడా అధికారుల అజమాయిషీ ఉంటుంది. స్థానికంగా ఉండే మత్స్యశాఖ అధికారులకు మందుల ఆకస్మిక తనిఖీలకు అవకాశమిస్తే బాగుంటుంది. చేపల రైతులు నాణ్యమైన మందులను గమనించి ఉపయోగించాలి.
- పి.సురేష్, మత్స్యశాఖ అభివృద్ధి అధికారి, కైకలూరు