సంక్రాంతికి సెలవులు లేవు
- ఏపీఎస్పీఎఫ్ లో ఏపీ సిబ్బందికి తేల్చిచెప్పిన టీ సర్కార్
- విధిలేక టికెట్లు రద్దుచేసుకుంటున్న ఆంధ్రా ఉద్యోగులు
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్(ఏపీ ఎస్పీఎఫ్)లో పనిచేస్తున్న ఏపీ ఉద్యోగులకు గొప్ప చిక్కొచ్చిపడింది. సంక్రాంతి పండక్కి ఊరెళ్లేందుకు రిజర్వేషన్లు చేయించుకున్నవారు కాస్తా ఉసూరుమంటూ టికెట్లు రద్దుచేసుకుంటున్నారు. హైదరాబాద్ విభాగంలో పనిచేస్తోన్న ఏపీ ఉద్యోగులకు పండగ సెలవులు మంజూరు చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం నిరాకరించడమే ఇందుకు కారణం.
రాష్ట్రాలు విడిపోయినప్పటికీ ఇంకా విభజనకు నోచుకోని శాఖల్లో ఏపీ ఎస్పీఎఫ్ ఒకటి. ప్రస్తుతం ఈ శాఖపై అజమాయిషీ తెలంగాణ సర్కారుదే. దీంతో ఏపీలో ఘనంగా నిర్వహించుకునే పండుగకు ఆ ప్రాంత ఉద్యోగులకు సెలవు దొరకటం దుర్లభంగా మారింది. ఇళ్లకు వెళ్లలేకపోతున్నందుకు ఆవేదనతోపాటు రిజర్వేషన్ల రద్దుతో డబ్బులు కూడా నష్టపోయామని వాపోతున్నారు హైదరాబాద్ లో పనిచేస్తోన్న ఏపీ ఎస్పీఎఫ్ ఉద్యోగులు.