breaking news
anvita Reddy
-
కిలిమంజారోపై ఐపీఎస్
సాక్షి, హైదరాబాద్/భువనగిరి: సీనియర్ ఐపీఎస్ అధికారి తరుణ్ జోషి ఖాతాలోకి మరో మైలురాయి వచ్చి చేరింది. ఆఫ్రికాలో అత్యంత ఎత్తైన పర్వతం కిలిమంజారోను ఆయన శుక్రవారం ఉదయం 8.15 గంటలకు అధిరోహించారు. ఇప్పటివరకు మొత్తం ఆరు పర్వతాలను ఈయన ఎక్కారు. నగర నిఘా విభాగం స్పెషల్ బ్రాంచ్‌కు సంయుక్త పోలీస్ కమిషనర్‌గా పని చేస్తున్న జోషి ఎవరెస్ట్ పర్వతాన్ని అధిరోహించడమే తన లక్ష్యంగా సాధన చేస్తున్నారు. జోషి పంజాబ్‌కు చెందిన వ్యక్తి. పటియాలాలోని గవర్నమెంట్ డెంటల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ నుంచి బీడీఎస్ పట్టా పుచ్చుకుని దంత వైద్యుడయ్యారు. 2004లో సివిల్ సర్వీసెస్ ఉత్తీర్ణుడైన ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ క్యాడర్లో ఐపీఎస్ అధికారిగా నియమితులయ్యారు. ప్రస్తుతం తెలంగాణ క్యాడర్లో ఉండి డీఐజీ హోదాలో సిటీ స్పెషల్ బ్రాంచ్ చీఫ్‌గా పని చేస్తున్నారు. 2017లో హిమాలయన్ మౌంటెనీరింగ్ ఇన్స్టిట్యూట్లో శిక్షణ తీసుకుని అదే ఏడాది అక్టోబర్‌లో తొలిసారిగా హిమాలయాల్లోని మౌంట్ రీనాక్‌ను అధిరోహించారు. అన్వితారెడ్డి కూడా... యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రానికి చెందిన అన్వితారెడ్డి కూడా జోషితో కలసి కిలిమంజారోను అధిరోహించారు. భువనగిరికి చెందిన పడమటి మధుసూదన్‌రెడ్డి, చంద్రకళల కమార్తె అన్విత భువనగిరి ఖిల్లాపై రాక్ క్లైంబింగ్ శిక్షణ పాఠశాల ఆధ్వర్యంలో 2018 నుంచి రాక్ క్లైంబింగ్, ర్యాప్లింగ్‌లో శిక్షణ పొందారు. అనంతరం ఖిల్లా వద్దనే శిక్షణ పాఠశాల ఆధ్వర్యంలో శిక్షకురాలిగా పనిచేస్తున్నారు. ‘చదువుతో పాటు పర్వతారోహణ అంటే ఇష్టం. ఎవరెస్టు పర్వతాన్ని అధిరోహించడమే నా లక్ష్యం. పర్వతారోహణకు గురువులు శేఖర్‌బాబు, పరమేశ్ ఎంతగానో ప్రోత్సహించారు’అని ఆమె అన్నారు. -
వాష్ రూంలో విద్యార్థిని ఆత్మహత్య
హైదరాబాద్: శ్రీచైతన్య కళాశాలలో ఇంటర్ చదువుతున్న ఓ విద్యార్థిని ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మహబూబ్‌నగర్ జిల్లా వడ్డేపల్లి మండలం తుమ్మల గ్రామానికి చెందిన కొల్లూరి శివశంకర్‌రెడ్డి కూతురు అన్వితారెడ్డి (17) హైదరాబాద్ ఎల్బీనగర్ ఎస్బీహెచ్ కాలనీలోని శ్రీచైతన్య ఐఐటీ అకాడమీలో ఇంటర్మీడియెట్ ఎంపీసీ మొదటి సంవత్సరం చదువుతోంది. 3వ అంతస్తులో స్నేహితురాలు సాయినిఖితతో కలసి ఉంటోంది. శుక్రవారం తరగతికి వెళ్లి.. మధ్యలో కడుపునొప్పి వస్తోందని గదికి వచ్చింది. బాత్రూమ్లోని గీజర్ రాడ్‌కు చున్నీతో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. తరగతి పూర్తయిన తరువాత గదికి వచ్చిన సాయినిఖిత.. బాత్రూమ్ తలుపు ఎంత కొట్టినా తీయకపోవడంతో అనుమానం వచ్చి యాజమాన్యానికి తెలిపింది. వెంటనే సిబ్బంది బాత్రూమ్ తలుపులు పగులగొట్టి చూడగా అన్వితారెడ్డి ఉరివేసుకుని కనిపించింది. వెంటనే ఆమెను చికిత్స నిమిత్తం కామినేని ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందింది. కాగా ఆమె మృతికి గల కారణాలు తెలియరాలేదు. అన్వితారెడ్డి తన పుస్తకంలో ‘‘గెలిచినప్పుడు జ్ఞాపకాలు మిగులుతాయి... గెలుస్తామో, ఓడతామో తెలియని ప్రేమలో పడితే కన్నీరు తప్ప ఏమీ మిగలదు’’ ‘‘నువ్వు ఇష్టపడే వాళ్లకంటే నిన్ను ఇష్టపడే వాళ్లనే కోరుకో’’... లాంటి కొటేషన్లతో ఉన్న లెటర్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. విద్యార్థిని తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. విద్యార్థి సంఘాల ధర్నా... విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న విషయం తెలుసుకున్న పలు విద్యార్థి సంఘాలు కళాశాల వద్ద పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టాయి. విద్యార్థిని ఆత్మహత్యకు కళాశాల యాజమాన్యమే కారణమని.. కళాశాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాయి. వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం గ్రేటర్ అధ్యక్షుడు బత్తుల నాని, టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు చిలుక మధుసూదన్‌రెడ్డి, ఏబీవీపీ, టీఆర్ఎస్వీ, ఎన్ఎస్యూఐ నాయకులు ఆందోళన చేపట్టారు.