వ్యక్తి మృతిపై ఏజేసీ విచారణ
ఖానాపురం : గూడూరు మండలంలోని బొల్లెపల్లికి చెందిన ఓ వ్యక్తి మృతిపై ఏజేసీ తిరుపతిరావు సోమవారం విచారణ చేపట్టారు. అనంతరం ఆయన విలేకరులకు వివరాలు వెల్లడించారు.
గూడూరు మండలంలోని బొల్లెపల్లికి చెందిన మెట్టు వీరస్వామి ఖానాపురం మండలంలోని కొత్తూరు గ్రామానికి చెందిన జ్యోతిని వివాహం చేసుకున్నాడు. గత ఐదేళ్ల క్రితం వీరస్వామి మృతిచెందాడు. అతడి మృతిపై గతం లో విచారణ చేపట్టిన రెవెన్యూ, పోలీస్ అధికారులు వేర్వేరు కారణాలు చూపుతూ ప్రభుత్వానికి నివేదికలు అందించారు. ఆర్థికపరమైన ఇబ్బందులతో ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసు అధికారులు నివేదించగా, మానుకోటలో జరిగిన దాడిలో రబ్బర్ బుల్లెట్ తగిలి మానసికంగా ఇబ్బందిపడుతూ మృతిచెందినట్లు నివేదికలు అందించారు. వేర్వేరుగా నివేదికలు రావడంతో కలెక్టర్ వాకాటి కరుణ పునర్విచారణకు ఆదేశించారు. ఇందులో భాగంగానే విచారణ చేపట్టినట్లు ఏజేసీ తెలిపారు. మృతుడి భార్య జ్యోతితో మాట్లాడగా రబ్బరు బుల్లెట్ తగలక ముందు బాగానే ఉన్నాడని, బుల్లెట్ తగిలి మానసికంగా తీవ్ర ఇబ్బందులకు గురై మృతిచెందినట్లు తెలపడం జరిగిందన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ పూల్సింగ్ చౌహాన్, ఏఆర్ఐ గండ్రాతి స్వప్న, వీఆర్వోలు వెంకన్న, వీఆర్ఏ యాకయ్య, ఐలేష్ పాల్గొన్నారు.