కార్లు పార్క్ చేసినట్లుగా...
ఫొటో చూడగానే మీకేం అనిపించింది. ఏదో ఎయిర్‌పోర్టు ఫొటో.. అందులో చాలా విమానాలు పార్క్ చేసి ఉన్నాయి. అంతేగా.. అయితే.. మీరు ఎగ్లో లెగ్ పెట్టినట్లే.. నిజం ఏమిటంటే.. ఇదో గేటెడ్ కమ్యూనిటీ.. ఇక్కడుండేవారు వారి వారి ఇళ్ల ముందు వాళ్ల విమానాలను పార్క్ చేసుకున్నారు!! అంటే.. మనం మన ఇళ్ల ముందు కార్లు లేదా బైక్‌లను పార్క్ చేసినట్లుగా అన్నమాట. అమెరికా ఫ్లోరిడాలోని స్ప్రూస్ పార్క్‌కు వెళ్లినోళ్లంతా దీన్ని చూసి డంగైపోవాల్సిందే.. ఇక్కడ 1500 ఇళ్లు ఉన్నాయి. మన దగ్గర అందరికీ బైక్ ఉన్నట్లుగా.. ఇక్కడ దాదాపు అందరికీ ఓ విమానం ఉంది.
కొందరి వద్ద అయితే.. యుద్ధ విమానాల్లాంటివీ ఉన్నాయి. ఇక్కడుండే వాళ్లలో ఎక్కువ మంది పైలట్లే. అమెరికాలోని ఇది కాకుండా కొన్ని ఫ్లై ఇన్ కమ్యూనిటీలు ఉన్నా.. స్ప్రూస్ పార్క్ అన్నింటికన్నా పెద్దది. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత అమెరికాలో అవసరమైన దాని కన్నా ఎక్కువ సంఖ్యలో పైలట్లు, ఎయిర్ ఫీల్డ్స్ ఉండిపోయాయట. వాటిని సద్వినియోగం చేసే క్రమంలో ఎయిర్‌ఫీల్డ్స్ చుట్టూ ఇళ్లు కట్టి.. పైలట్లకు ఆవాసం కల్పించారు. తర్వాతి దశలో చాలా గేటెడ్ కమ్యూనిటీలు కనుమరుగైపోయినా.. స్ప్రూస్ పార్క్ లాంటివి ఇప్పటికీ అందరినీ అలరిస్తున్నాయి.