breaking news
Agri Infra Fund Utilization
-
అగ్రిటెక్ స్టార్టప్‌లకు బూస్ట్
న్యూఢిల్లీ: అగ్రిటెక్ స్టార్టప్‌లకు ఆర్థిక సహాయం అందించడానికి కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ రూ.750 కోట్ల ఫండ్ ‘అగ్రిష్యూర్’ను ప్రారంభించారు. వ్యవసాయ రంగంలో ప్రభుత్వ, ప్రైవేట్ పెట్టుబడులను పెంచాల్సిన అవసరం ఉందని మంత్రి తెలిపారు. వ్యవసాయ రంగం పురోగతి లక్ష్యంగా దాదాపు రూ.14,000 కోట్లతో ఏడు పథకాలకు కేంద్ర మంత్రివర్గం ఆమోదించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా ‘అగ్రిష్యూర్’ ఆవిష్కరణ సందర్భంగా మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ చేసిన ప్రసంగంలో కొన్ని ముఖ్యాంశాలు...రూ.750 కోట్ల ‘అగ్రిష్యూర్’ (స్టార్టప్‌లు, రూరల్ ఎంటర్ప్రైజెస్) ఫండ్ ఈక్విటీ అలాగే డెట్ క్యాపిటల్ రెండింటినీ అందించడం ద్వారా స్టార్టప్‌లు, ‘అగ్రిప్రెన్యూర్’లకు మద్దతు ఇస్తుంది.స్టార్టప్‌లు ఈ నిధిని వినియోగించుకోవాలి. వ్యవసాయ రంగంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తున్న అగ్రిటెక్ స్టార్టప్‌లకు ఎటువంటి నిధుల కొరతనూ ఎదుర్కోకుండా తగిన చర్యలు తీసుకుంటారు.గ్రామీణ భారతదేశంలో వ్యవసాయ సంబంధిత మౌలిక సదుపాయాలను సృష్టించేందుకు ప్రభుత్వం రూ.లక్ష కోట్లతో వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధిని ప్రారంభించింది. వ్యవసాయం భారత ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. ఈ రంగం స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో 18 శాతం వాటాను కలిగి ఉంది. రైతులు అతిపెద్ద ఉత్పత్తిదారులు మాత్రమే కాకుండా అతిపెద్ద వినియోగదారులు కూడా అన్న విషయాన్ని గమనించాలి. ఇది ఆర్థిక వ్యవస్థకు గణనీయమైన పరోక్ష సహకారం.రైతుల ఆదాయాన్ని పెంపొందించడంతోపాటు ఆహారం, పౌష్టికాహార భద్రతకు ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది.ఉత్పత్తి పెంపు, ముడి పదార్థాల వ్యయం తగ్గింపు, వ్యవసాయ ఉత్పత్తులకు మంచి ధరలు, పంటల వైవిధ్యం, వ్యవసాయ రంగంలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రవేశపెట్టడంపై కేంద్రం దృష్టి సారించింది. ఎరువులపై కేంద్రం భారీ రాయితీలూ కల్పిస్తోంది.వ్యవసాయ రంగానికి కొత్త ప్రయోగాలు అవసరం. చిన్న రైతులు పెద్ద ఎత్తున వ్యవసాయం చేసేందుకు గ్రూపులుగా ఏర్పడే అంశాన్ని వారు పరిశీలించాలి. మితిమీరిన రసాయన పురుగుమందులు, ఎరువుల వాడకం మంచిది కాదు. సాగునేలను సారవంతమైనదిగా కొనసాగించే విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఏఐఎఫ్ ఎక్స్‌లెన్స్ అవార్డుల ప్రదానం వ్యవసాయ రంగంలో అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ (ఏఐఎఫ్) కింద వివిధ కేటగిరీల్లో అత్యుత్తమ పనితీరు కనబరిచిన బ్యాంకులు, రాష్ట్రాలకు వారి కృషిని గుర్తింపుగా వ్యవసాయ మంత్రి ఏఐఎఫ్ ఎక్స్‌లెన్స్ అవార్డులను ఈ సందర్భంగా అందజేశారు. ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో– స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కెనరా బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఇండియన్ బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్ అవార్డులు అందుకోగా, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఉత్తమ పనితీరు కనబరిచిన ప్రైవేట్ రంగ బ్యాంకుగా అవార్డును స్వీకరించింది. ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల విభాగంలో బరోడా రాజస్థాన్ క్షేత్రీయ గ్రామీణ బ్యాంక్, పంజాబ్ గ్రామీణ బ్యాంక్, బరోడా యూపీ గ్రామీణ బ్యాంక్, మహారాష్ట్ర గ్రామీణ బ్యాంక్, సర్వ హరియాణా గ్రామీణ బ్యాంక్ ఉత్తమ పనితీరుకు అవార్డులు అందుకున్నాయి. అత్యుత్తమ పనితీరు కనబరిచి, అవార్డులను అందుకున్న రాష్ట్రాలలో తెలంగాణసహా మధ్యప్రదేశ్, పంజాబ్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, గుజరాత్ ఉన్నాయి.ఇదీ చదవండి: ప్రకృతి బీభత్సం.. ఆర్థిక నష్టం..!‘కృషినివేష్’ పోర్టల్ ఆవిష్కరణ..‘కృషినివేష్’ పేరుతో ఇంటిగ్రేటెడ్ అగ్రి ఇన్వెస్ట్మెంట్ పోర్టల్‌ను కూడా మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈ సందర్భంగా ఆవిష్కరించారు. ఈ పోర్టల్ పెట్టుబడి అవకాశాలు సంబంధిత వ్యవసాయ సమాచారాన్ని కేంద్రీకరించడం ద్వారా వ్యవసాయ రంగాన్ని మార్చగలదన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. వ్యవసాయ వ్యాపారాలను మెరుగుపరచడానికి, పెట్టుబడులను ఆకర్షించడానికి, రైతుల ఆదాయాన్ని మెరుగుపరచడానికి రూపొందించిన సమగ్ర వేదికే ఈ పోర్టల్ అని ఆయన అభివర్ణించారు. వివిధ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించిన సమాచారాన్ని సులభంగా యాక్సెస్ చేసుకోవడానికి సంబంధించి రైతులు, పారిశ్రామికవేత్తలు, ఈ రంగంలోని విభిన్న వాటాదారులకు ఈ పోర్టల్ ఉపయోగపడుతుందని చౌహాన్ తెలిపారు. -
అగ్రి ఇన్ఫ్రా ఫండ్ వినియోగంలో ఏపీ నంబర్ 1
సాక్షి, అమరావతి: వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధుల (అగ్రి ఇన్ఫ్రా ఫండ్) వినియోగంలో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో నిలిచింది. వ్యవసాయ క్షేత్రం (ఫామ్ గేట్) వద్ద మౌలిక సదుపాయాల కల్పనకు పెద్ద పీట వేస్తూ ఉత్తమ రాష్ట్రంగా ఆవిర్భవించింది. 2021–22 ఆర్థిక సంవత్సరంలో అగ్రి ఫండ్స్ వినియోగంలో దేశంలోనే ఉత్తమ రాష్ట్రం అవార్డును కేంద్ర వ్యవసాయ, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ శనివారం న్యూ ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర రైతుబజార్ల సీఈవో బి.శ్రీనివాసరావుకు అందజేశారు. అగ్రి ఇన్ఫ్రా ఫండ్స్ వినియోగంలో అనేక రాష్ట్రాలు చాలా వెనుకబడి ఉన్నాయని, ఆంధ్రప్రదేశ్ మాత్రం ఈ నిధులను వినియోగించుకొని గ్రామస్థాయిలో పెద్ద ఎత్తున మౌలిక సదుపాయాలు కల్పిస్తూ అగ్ర స్థానంలో నిలిచిందని కేంద్ర మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ ప్రశంసించారు. రూ.2,706 కోట్లతో 39,403 మౌలిక సదుపాయాలు రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ క్షేత్రం వద్ద బహుళ ప్రాయోజిత కేంద్రాల ద్వారా పెద్ద ఎత్తున మౌలిక సదుపాయాలు కల్పిస్తోంది. పీఎసీఎస్ ద్వారా ఆర్బీకే స్థాయిలో 4,277 గోదాములు – డ్రయింగ్ ప్లాట్‌ఫారాలు, ఏపీ సీవిల్ సప్లైస్ కార్పొరేషన్ కోసం 60 బఫర్ గోడౌన్లు, ప్రైమరీ ప్రాసెసింగ్ కోసం 830 క్లీనర్స్, 4,277 డ్రయింగ్ ప్లాట్‌ఫారాలు, 2,977 డ్రయర్లు, 101 పసుపు పాలిషర్స్ ఏర్పాటు చేసింది. ఉద్యాన ఉత్పత్తుల కోసం 945 కలెక్షన్ సెంటర్లు, 344 కూల్డ్ రూమ్స్, ఆర్బీకేలకు అనుబంధంగా 10,678 ఎస్సైయింగ్ పరికరాలు, 10,678 ప్రొక్యూర్మెంట్ కేంద్రాలు వంటి మౌలిక సదుపాయాలను కల్పిస్తోంది. ఇలా 39,403 రకాల మౌలిక సదుపాయాల కల్పనకు రూ.2,706 కోట్లతో ప్రణాళికలు సిద్ధం చేసింది. తొలి విడతగా 1,305 పీఏసీఎస్‌ల పరిధిలో 10,677 మౌలిక సదుపాయాల కల్పనకు అగ్రి ఇన్ఫ్రా ఫండ్ కింద రూ.1,584.6 కోట్లు మంజూరు చేశారు. ఈ పనులు చురుగ్గా జరుగుతున్నాయి.