రాజకీయాల నుంచి తప్పుకుంటా | After 70 years in politics, Keishing to hang up boots at 95 | Sakshi
Sakshi News home page

రాజకీయాల నుంచి తప్పుకుంటా

Feb 2 2014 9:37 PM | Updated on Sep 17 2018 5:18 PM

రాజకీయాల నుంచి రిటైర్ కానున్నట్లు కాంగ్రెస్‌కు చెందిన రాజ్యసభ సభ్యుడు, మణిపూర్ మాజీ ముఖ్యమంత్రి రిషాంగ్ కీషింగ్ (95) ప్రకటించారు.

న్యూఢిల్లీ: రాజకీయాల నుంచి రిటైర్ కానున్నట్లు కాంగ్రెస్‌కు చెందిన రాజ్యసభ సభ్యుడు, మణిపూర్ మాజీ ముఖ్యమంత్రి రిషాంగ్ కీషింగ్ (95) ప్రకటించారు. రాజ్యసభలో ఆయన పదవీకాలం ఏప్రిల్ నాటితో ముగియనుంది. పార్లమెంటులో అత్యంత వద్ధుడైన కీషింగ్ మొదటి లోక్‌సభకు 1952లో ఎన్నికయ్యారు. ఏడు దశాబ్దాల ప్రజాజీవితం తర్వాత ఇక క్రియాశీల రాజకీయాల నుంచి తప్పుకోవాల్సిన సమయం ఆసన్నమైందని ఆయన భావిస్తున్నారు. స్వాతంత్య్రోద్యమం నాటి నుంచి దేశ రాజకీయాల్లో చాలా ఉత్థాన పతనాలను చూశానని, ఇక రిటైర్మెంట్ తీసుకోవాలనుకుంటున్నానని ఆయన చెప్పారు.

 

తొలుత సోషలిస్ట్ పార్టీపై 1952లో లోక్‌సభకు ఎన్నికైన కీషింగ్, తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ ఆహ్వానంపై 1962లో కాంగ్రెస్‌లో చేరారు. అప్పటి నుంచి ఆయన కాంగ్రెస్‌లోనే కొనసాగుతున్నారు. నెహ్రూ, ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ, సోనియా గాంధీలతో కలసి పనిచేసిన ఘనత కీషింగ్ సొంతం.  మణిపూర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 1985లో మిలిటెంట్ల హత్యాయత్నం నుంచి కీషింగ్ సురక్షితంగా బయటపడ్డారు. అయితే, ఆ దాడిలో ఆయన అంగరక్షకులు నలుగురు ప్రాణాలు కోల్పోయారు. మణిపూర్‌లోని నాగాల జనాభా ఎక్కువగా ఉఖ్రుల్ జిల్లాకు చెందిన కీషింగ్, తొలుత ఉపాధ్యాయుడిగా పనిచేశారు. రిటైరయ్యాక తోటపని, వ్యవసాయానికి సమయం కేటాయించాలనుకుంటున్నానని ఆయన చెప్పారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement