వినూత్న తీర్పునకు c/o స్టేషన్‌ఘన్‌పూర్‌

Station Ghanpur Constutiancy Election Informatuion - Sakshi

సాక్షి, స్టేషన్‌ఘన్‌పూర్‌/చిల్పూరు: అసెంబ్లీ ఎన్నికల్లో విలక్షణమైన తీర్పునకు పెట్టింది పేరు స్టేసన్‌ఘన్‌పూర్‌. ఇక్కడి ఓటర్లు మార్పును కోరుకోవడంలో ముందుంటారు.  వినూత్నమైన తీర్పులతో అభ్యర్థుల ఎంపికలో రాష్ట్ర నాయకత్వాన్ని చిక్కుముడిలో పడేస్తుంది. నియోజకవర్గం 1957లో ఏర్పడగా  1978 లో ఎస్సీకి రిజర్వ్‌ అయింది. అప్పటి నుంచి ప్రతిసారి ఓటర్లు తమదైన శైలిలో తీర్పును ఇస్తున్నారు. ఇక్కడ నుంచి గెలిచిన పలువురు రాష్ట్రంలో కీలక శాఖల్లో మంత్రులుగా పనిచేశారు. ఇక్కడి నుంచి గెలిచిన గోక రామస్వామి, కడియం శ్రీహరి, గుండె విజయరామారావు, డాక్టర్‌ రాజయ్య మంత్రి పదవులను చేపట్టారు.  

స్థానికేతరులకు అవకాశం.. 
 1957 నుంచి 1999 వరకు స్థానికేతరులకే అవకాశం ఇచ్చారు. పలువురు ఒకటి కంటే ఎక్కువ సార్లు గెలుపొందారు. అందులో గోకా రామస్వామి కాంగ్రెస్‌ నుంచి 1978, 1983లో జరిగిన ఎన్నికల్లో వరుసగా గెలుపొందారు. 1994, 1999 సాధారణ ఎన్నికలు, 2008లో జరిగిన ఉప ఎన్నికల్లో కడియం శ్రీహరి మూడుసార్లు గెలుపొంది మంత్రి పదవులను చేపట్టారు.  

పునర్విభజనతో స్థానికులకు.. 
నియోజకవర్గాల పునర్విభజన అనంతరం స్థానికుడైన డాక్టర్‌ రాజయ్యకు ప్రజలు అవకాశం కల్పించారు. 2009లో కాంగ్రెస్‌ పార్టీ నుంచి, 2012 ఉప ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ నుంచి,  2014లో సాధారణ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ నుంచి   రాజయ్య వరుసగా గెలుపొందారు.  2014 ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ నుంచి గెలుపొందిన రాజయ్యకు 1,34,089 ఓట్లు, కాంగ్రెస్‌ నుంచి గుండె విజయరామారావుకు 44,802 ఓట్లు, టీడీపీ నుంచి పోటీ చేసిన దొమ్మాటి సాంబయ్యకు 20,426 ఓట్లు వచ్చాయి. ఆ సమయంలో తెలంగాణ ఉద్యమ ఊపు ఉండడమే కాకుండా అధికార కాంగ్రెస్‌ పార్టీ నుంచి టీఆర్‌ఎస్‌లోకి రావడంతో రాజయ్యకు మంచి మెజార్టీ దక్కింది.  

బరిలో 8 మంది.. 
ప్రస్తుతం ఘన్‌పూర్‌ నియోజకవర్గం నుంచి ఎన్నికల బరిలో 8 మంది ఉన్నారు. ప్రధాన పారీలైన టీఆర్‌ఎస్‌ నుంచి డాక్టర్‌ తాటికొండ రాజయ్య, మహాకూటమి నుంచి సింగపురం ఇందిర, బీఎస్పీ నుంచి రాజారపు ప్రతాప్, బీజేపీ నుంచి పెరుమాండ్ల వెంకటేశ్వర్లు బరిలో ఉన్నారు.  

త్రిముఖ పోటీ.. 
స్టేషన్‌ఘన్‌పూర్‌ నియోజకవర్గంలో ప్రధానంగా ముగ్గురు అభ్యర్థుల మధ్య పోటీ నెలకొంది. టీఆర్‌ఎస్‌ పార్టీ నుంచి పోటీ చేస్తున్న డాక్టర్‌ రాజయ్య, కాంగ్రెస్‌ అభ్యర్థి సింగపురం ఇందిర, బీఎస్పీ అభ్యర్థి రాజారపు ప్రతాప్‌ మధ్య పోటీ తీవ్రంగా ఉంది. అయితే అంతిమ విజయం ఎవరిదో వేచి చూడాల్సిందే. 

తాటికొండ రాజయ్య, టీఆర్‌ఎస్‌ అభ్యర్థి 
బలాలు     

  • టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలు 
  • నియోజకవర్గంలో పట్టున్న కడియం శ్రీహరి, పల్లా రాజేశ్వర్‌రెడ్డి వెన్నంటి ఉండడం
  • తెలంగాణ ఉద్యమ సమయంలో కాంగ్రెస్‌ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి టీఆర్‌ఎస్‌లోకి రావడం  

బలహీనతలు

  • అవినీతి ఆరోపణలు రావడం 
  • ప్రతీ పనికి కమీషన్‌ తీసుకుంటాడనే దుష్ప్రచారం
  • ఇటీవల రాజయ్య రాసలీలలు అంటూ ఓ ఆడియో టేప్‌ వైరల్‌గా మారడం
  • కడియం వర్గీయులు రాజయ్యకు టికెట్‌ రావడంపై సంతృప్తిగా ఉండడం 
  • మండల స్థాయి ముఖ్యనాయకులు కాంగ్రెస్‌ పార్టీలో చేరడం

సింగపురం ఇందిర, ప్రజాకూటమి అభ్యర్థి
బలాలు

  • నియోజకవర్గ ప్రజలకు పెద్దగా పరిచయం లేనప్పటికీ   రాజయ్యకు చెల్లెలు వరుస కావడం      
  • టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ పనితీరు, రాజయ్యపై వ్యతిరేకతే బలం
  • మొదటి నుంచి ఇక్కడ మహిళా ఎమ్మెల్యే లేకపోవడంతో మహిళల నుంచి ఆమెకు మంచి ఆదరణ  

బలహీనతలు 

  • కేవలం ఎన్నికల సమయంలో తెరపైకి రావడం 
  •  స్థానికంగా ఉండదని, సమస్యలను పట్టించుకోదని ప్రచారం 
  •  ఎన్నికలు సమీపిస్తున్న ప్రజల వద్దకు పూర్తి స్థాయిలో వెళ్లకపోవడం

రాజారపు ప్రతాప్, బీఎస్పీ అభ్యర్థి
బలాలు  

  • మొదటి నుంచి సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రజల్లో ఉండడం 
  • గతంలో కాంగ్రెస్, టీఆర్‌ఎస్‌ పార్టీలో పనిచేయడం 
  • ప్రస్తుతం ఆరెండు పార్టీల నుంచి పరోక్షంగా సపోర్ట్‌  
  • అన్నింటికి మించి మంచి పేరు ఉండడం దానికి తోడు కడియం శ్రీహరి వర్గీయుల అనుకూలం 

బలహీనతలు 

  • బీఎస్పీ పార్టీ, ఆగుర్తు ఇక్కడ ప్రజలకు పెద్దగా పరిచయం లేకపోవడం 
  • అంతేకాకుండా టీఆర్‌ఎస్‌ రెబల్‌గా పోటీ చేస్తే బావుండేదని ఓటర్ల ఆలోచన 
  • బీఎస్పీలోకి వెళ్లడం సరికాదని బహిరంగ చర్చ 
నియోజకవర్గ ఓటర్లు 
       మొత్తం ఓటర్లు   2,25,616 
పురుషులు 1,12,968   
మహిళలు 1,12,645 
ఇతరులు 3  

    
  
    

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top