జాడలేని వాన.. రైతన్న హైరానా!

No Rain In Telangana Farmers Are Waiting For Crop - Sakshi

ఎక్కడికక్కడ నిలిచిపోయిన సాగు 

వానల్లేక మొలకెత్తని విత్తనాలు 

2 లక్షల ఎకరాల్లో పత్తి విత్తనం భూమిలోనే.. 

నార్లు పోసేందుకు కలిసిరాని కాలం 

ఆకాశం వైపు ఆశగా చూస్తున్న రైతన్న

సాక్షి, హైదరాబాద్‌ : నిర్ణీత సమయానికి ముందే నైరుతి రుతుపవనాలు రాష్ట్రాన్ని తాకాయి.. రాష్ట్రవ్యాప్తంగా విస్తరించాయి.. మొదట్లో సాధారణస్థాయికి మించి వానలు కురిశాయి.. అన్నదాతల్లో ఆనందం పొంగింది.. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఆవిరైంది! రుతుపవనాలు బలహీనపడటంతో వానలు ముఖం చాటేశాయి. వారం రోజులుగా వాన జాడలేక రైతన్న దిక్కుతోచని స్థితిలో పడిపోయాడు. వానల్లేక వేసిన విత్తనం భూమిలో ఉండిపోయింది. కొన్నిచోట్ల విత్తనాలు మొలకెత్తినా ఎండలకు మాడిపోతున్నాయి. ఇంకొన్నిచోట్ల దుక్కులు దున్నిన రైతన్నలు ఆశగా నింగి వైపు చూస్తున్నారు. 

ఆగిన సాగు 
ఈసారి నైరుతి రుతుపవనాలు ఆశాజనకంగా ఉంటాయని వాతావరణ శాఖ వెల్లడించింది. సాధారణంతో పోలిస్తే 97 శాతం వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఈ లెక్కన తెలంగాణలో సాధారణ నైరుతి సీజన్‌ వర్షపాతం 755 మి.మీ. కాగా.. 97 శాతం లెక్కన 732 మి.మీ.లు కురిసే అవకాశముంది. అయితే ఈ నెల 15 నుంచి వర్షాలు ఒక్కసారిగా తగ్గుముఖం పట్టాయి. గత రెండ్రోజుల్లోనైతే పరిస్థితి ఘోరంగా ఉంది. ఏకంగా 84 శాతం లోటు వర్షపాతం నమోదైంది. దీంతో ఎక్కడికక్కడ పంటల సాగు నిలిచిపోయింది. నార్లు పోసే దిక్కు కూడా లేదు. రానున్న రోజుల్లో పరిస్థితి ఎలా ఉంటుందోనని రైతులు ఆందోళన చెందుతున్నారు. 

4 లక్షల ఎకరాల్లో పత్తి 
ఈ ఖరీఫ్‌ సాధారణ సాగు విస్తీర్ణం కోటి ఎకరాలకు పైనే ఉంది. అందులో 45 లక్షల ఎకరాల్లో పత్తి పంట వేస్తారు. పైపెచ్చు ఖరీఫ్‌పై ప్రభుత్వం కోటి ఆశలు పెట్టుకుంది. రుతుపవనాల ఆరంభ సమయంలో వర్షాలు కురుస్తాయన్న ఆశతో అనేక మంది రైతులు పత్తి, మెట్ట పంటల విత్తనాలను చల్లారు. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 10 లక్షల ఎకరాల్లో విత్తనాలు వేసి ఉంటారని అంచనా. అందులో పత్తి విత్తనాలు దాదాపు 4 లక్షల ఎకరాల్లో చల్లి ఉండొచ్చని చెబుతున్నారు. కొన్నిచోట్ల పెసర, కంది వంటి విత్తనాలను చల్లారు. వర్షాలు నిలిచిపోయి ఎండలు మండిపోతుండటంతో మొలకెత్తిన విత్తనాలు వాడిపోతుంటే, కొన్నిచోట్ల భూమిలోనే మాడిపోతున్నాయని రైతులు అంటున్నారు.

ముందుగా వేసిన విత్తనాలు మొలకెత్తినా ప్రయోజనం కనిపించటం లేదు. ఆ మొలకలు కూడా వాలిపోతున్నాయి. దాదాపు 2 లక్షల ఎకరాల్లో పత్తి విత్తనాలు భూమిలోనే మగ్గుతున్నాయి. ఇంకొన్ని చోట్ల పొడి దుక్కుల్లోనే రైతులు పత్తి విత్తనాలను నాటుతున్నారు. నేలలో తగిన తేమ ఉన్న సమయంలోనే పంటలను సాగు చేయాలని అధికారులు చెబుతున్నా రైతులు పట్టించుకోవడం లేదు. 60 మి.మీ. వర్షం కురిసినప్పుడే పత్తి విత్తనాన్ని నాటుకోవాలని వ్యవసాయశాఖ అధికారులు, శాస్త్రవేత్తలు సూచనలు చేస్తున్నారు. 

ప్రత్యామ్నాయ ప్రణాళిక ఏదీ? 
ప్రస్తుతం రైతు బీమా పథకంపై తప్ప వ్యవసాయశాఖ దేనిపైనా దృష్టి సారించడం లేదు. మండలాల్లో వ్యవసాయాధికారులు అంతా ఎల్‌ఐసీ ఫారాలను ముందేసుకొని రైతులను బీమాలో చేర్పించే పనుల్లోనే నిమగ్నమయ్యారు. అలాగే వ్యవసాయశాఖ ఇప్పటికీ 2018–19 ప్రణాళిక విడుదల చేయలేదు. అందులో ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా ప్రత్యామ్నాయ పంటల ప్రణాళికను తెలియజేయాలి. కానీ ఆ ప్రణాళిక విడుదలపై ఇంకా దృష్టి సారించడం లేదు. రైతులను చైతన్యపరిచేందుకు యాత్రలు కూడా నిర్వహించకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. 

22 నుంచి వర్షాలు: రాజారావు, సీనియర్‌ అధికారి, హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం 
ఈ నెల 22 లేదా 23వ తేదీ నుంచి వర్షాలు కురుస్తాయి. ప్రస్తుతం రుతుపవనాలు బలహీనంగా ఉన్నాయి. రెండు మూడు రోజుల్లో మళ్లీ పుంజుకుంటాయి. ఈ నెలాఖరుకు అనేకచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top