మరోసారి మొండి చేయి!

Government Medical Colleges Shocked By MCI In Nizamabad - Sakshi

ఇందూరు నగరంలో ఏర్పాటు చేసిన మెడికల్‌ కాలేజీని ఇక్కడి అధికారులు, పాలకులు పట్టించుకోవడంలేదు. ఎక్కడ చూసినా సమస్యల కుప్పలే. అన్ని విభాగాల్లోనూ లోపాలే. ఫలితంగా ఎంసీఐ గుర్తింపునకు నోచుకోలేకపోయింది. ఐదేళ్ల బోధనకు అనుమతులున్నా చివరగా వచ్చే గుర్తింపు సాధించలేకపోయింది. ఈఏడాది మూడుసార్లు పరిశీలించిన ఎంసీఐ అన్నింట్లోనూ వైఫల్యమేనంటూ అనుమతికి నిరాకరించింది. దీంతో మెడికోలు ఆందోళన చెందుతున్నారు.

నిజామాబాద్‌ అర్బన్‌ : జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ మెడికల్‌ కళాశాలకు మరోసారి ఎంసీఐ షాక్‌ ఇచ్చింది. కళాశాలకు గుర్తింపు ఇవ్వలేదు. ఈ మేరకు శనివారం ఉత్తర్వులు జారీ చేస్తూ ఎంసీఐ వెబ్‌సైట్‌లో పేర్కొంది. ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన ప్రభుత్వ మెడికల్‌ కళాశాలపై అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోకపోవడమే ప్రధాన లోపం. కళాశాలకు గుర్తింపు కూడా చాలా ముఖ్యం. గుర్తింపు ఉంటేనే కళాశాల వైద్య విద్యకు ప్రాధాన్యత ఉంటుంది. ఇప్పటి వరకు కళాశాలకు ఐదేళ్ల వరకు అనుమతి లభించింది. ప్రస్తుతం కళాశాలకు పూర్తిస్థాయి గుర్తింపు ఇవ్వాలి. దీని కోసం ఎంసీఐ మూడుసార్లు పరిశీలించింది. అయినా సమస్యల కారణంతో మరోసారి అనుమతికి నిరాకరించింది.  

ఇప్పటికే మూడుసార్లు పరిశీలన.. 
ప్రభుత్వ మెడికల్‌ కళాశాలను ఎంసీఐ బృందం గుర్తింపు కోసం మూడుసార్లు పరిశీలించింది. ఈ యేడాది ఫిబ్రవరి 21, మార్చి 18, జూన్‌ 18వ తేదీల్లో ముగ్గురు సభ్యుల బృందం పరిశీలించింది. మూడుసార్లు పరిశీలన అనంతరం కూడా గుర్తింపునకు అనుమతి లభించలేదు. రెండుసార్లు పరిశీలన జరిగితే అనుమతి నిరాకరించినప్పుడు లోపాలను సరిదిద్ది మూడోసారి సమస్య లేకుండా చూడాల్సిన బాధ్యత వైద్యాధికారులపై ఉంది. అయితే మూడోసారి సైతం ఇదే పరిస్థితి ఏర్పడింది. ఎంసీఐ గుర్తింపును సాధించలేకపోయింది.   

పట్టాలకు గుర్తింపు తప్పనిసరి.. 
వైద్య విద్యకు ఎంసీఐ గుర్తింపు తప్పనిసరి. ప్రస్తుతం ప్రభుత్వ మెడికల్‌ కళాశాలకు ఐదేళ్ల వరకు అడ్మిషన్లకు వైద్య విద్య బోధనకు అనుమతి ఉంది. అయితే తర్వాత దీనికి ఎంసీఐ గుర్తింపు తప్పనిసరి. ఎంసీఐ గుర్తింపు ఉంటేనే వైద్యుల పట్టాలు చెల్లుబాటు అవుతాయి. కళాశాలకు అధికారిక గుర్తింపు ఉంటుంది. ఎంసీఐ మొదటి రెండు అనుమతుల అనంతరం గుర్తింపు కోసం పరిశీలన చేసి అనుమతులు ఇస్తుంది. ప్రస్తుతం ఈ అనుమతి ప్రభుత్వ మెడికల్‌ కళాశాలకు రావాల్సి ఉంది.

ఎంసీఐ లేవనెత్తిన లోపాలు..

  • ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రిలో పడక గదుల ఆక్యుపెన్సీ రేటు వందకుగాను కేవలం 60శాతమే ఉంది. 40శాతం ఆక్యుపెన్సీ రేటు తక్కువగా ఉందని ఎంసీఐ పేర్కొంది.  
  • జనరల్‌ ఆస్పత్రిలో ఇస్టోపాథోలాజికల్‌ ల్యా బ్‌ పనిచేయడం లేదు. అత్యవసర వి భాగం ఆపరేషన్‌ థియేటర్లు పని చేయడం లేదు.  
  • ఆస్పత్రిలో ఎక్స్‌ రే మిషన్లు పని చేయడం లే దు. మెడికల్‌ కళాశాలలో లైబ్రరీలో ఏసీ అం దుబాటులో లేదు.  
  • కళాశాలలో ఎస్‌ఆర్‌ వైద్యులు అవసరమైన మేరకు అందుబాటులో లేరు.  
  • గైనిక్, చిన్న పిల్లల విభాగంలో రోగుల కేటా యింపు విధానం సక్రమంగా లేదు. ఇదే వి భాగంలో వైద్య సిబ్బంది కేటాయింపు సరిగ్గా లేదు.  
  • ప్రొఫెసర్లు, అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు లేక కిందిస్థాయి వరకు అదనపు బాధ్యతలు అప్పగిం చి కొనసాగిస్తున్నారు. దీంతో వైద్య విద్య బో ధన వీలు కాదని పేర్కొంది.  
  • వైద్య సిబ్బంది కేటాయింపు, రోగులకు అసౌకర్యాలు, అవుట్‌ పేషెంట్‌ విభాగంలో అసౌకర్యాలు ప్రధానంగా పేర్కొన్నారు.  
  • సిటీ స్కాన్, స్కానింగ్‌ సెంటర్‌ నిర్వహణ సక్రమంగా లేదు. అర్హులైన వైద్య సిబ్బంది పనిచేయడం లేదని పేర్కొంది.  
  • మెడికల్‌ కళాశాలలో వసతి కొరత సమస్యగా పేర్కొన్నారు. 

లోపాలను సవరిస్తాం.. 
మెడికల్‌ కళాశాలకు గుర్తింపు అనుమతి లభించకపోవడంపై ఉన్న లోపాలను సవరిస్తాం. సమస్యలు పరిష్కరించేందకు ప్రధానంగా దృష్టి సారిస్తాం. ఎంసీఐకి మరోసారి విన్నవిస్తాం. చిన్న చిన్న లోపాలను పూర్తిస్థాయిలో నివారిస్తాం.
–రాములు, ఆస్పత్రి సూపరింటెండెంట్‌ 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top