మా భూమి ఇస్తాం... తీసుకోండి!

Farmers in advance for HMDA Landpooling - Sakshi

హెచ్‌ఎండీఏ ల్యాండ్‌పూలింగ్‌ కోసం ముందుకొస్తున్న రైతులు 

శివారు ప్రాంతవాసులు వచ్చి వివరాలు తెలుసుకుంటున్న వైనం 

మే 23 ఎన్నికల ఫలితాల తర్వాత ఊపందుకోనున్న ప్రక్రియ 

పూర్తిస్థాయిలో కసరత్తు చేస్తున్న హెచ్‌ఎండీఏ అధికారులు 

సాక్షి, హైదరాబాద్‌: హైదరాబాద్‌ మహానగరాభివృద్ధి సంస్థ(హెచ్‌ఎండీఏ) అభివృద్ధి చేసిన ‘ఉప్పల్‌ భగాయత్‌’ను శివారు రైతులు ఆదర్శంగా తీసుకుంటున్నారు. ఆ తరహాలోనే తమ ప్రాంతాల్లో లేఅవుట్‌లు అభివృద్ధి చేయాలంటూ కోరుతున్నారు. భూములు ఇచ్చేందుకు ముందుకు వస్తున్నారు. ‘మీ భూమి ఇవ్వండి.. అభివృద్ధి చేస్తామం’టూ ఈ నెల ఐదున హెచ్‌ఎండీఏ మళ్లీ నోటిఫికేషన్‌ విడుదల చేసిన క్రమంలో శివారు ప్రాంతరైతులు భూములివ్వడం వల్ల కలిగే ఫలితాలను తెలుసుకుంటున్నారు. ఘట్‌కేసర్, కీసర, శంషాబాద్, శంకర్‌పల్లి, ఇబ్రహీంపట్నం, శామీర్‌పేట, కొహెడ... ఇలా వివిధ ప్రాంతాల రైతులు తార్నాకలోని హెచ్‌ఎండీఏ కేంద్ర కార్యాలయంలో ల్యాండ్‌పూలింగ్‌ అధికారులను కలసి మాట్లాడుతున్నారు. ఈ నెల 23న లోక్‌సభ ఎన్నికల ఫలితాల తర్వాత ఆయా రైతులు చెప్పిన భూముల్లో పర్యటించి లేఅవుట్‌కు పనికొస్తాయా, లేదా అని అధికారులు నిర్ధారించుకొని ముందుకెళ్లనున్నారు.  

50 ఎకరాలకు తగ్గకుండా... 
హైదరాబాద్‌ మెట్రోపాలిటన్‌ ప్రాంత ల్యాండ్‌పూలింగ్‌ పథకం, ఏరియా డెవలప్‌మెంట్‌ ప్లాన్, డెవలప్‌మెంట్‌ స్కీం 2017 జీవో ప్రకారం కనీసం 50 ఎకరాలకు తగ్గకుండా భూమి ఉండాలి. భూమిపై సంపూర్ణంగా భూయాజమాన్యపు పట్టా(టైటిల్‌ క్లియర్‌) ఉండాలి. ప్రతిపాదిత భూమి మాస్టర్‌ప్లాన్‌ ప్రకారం బఫర్‌జోన్, చెరువులు, ఫుల్‌ ట్యాంక్‌ లెవల్, ఓపెన్‌ స్పేస్‌లో ఉండరాదు. ఉప్పల్‌ భగాయత్‌ లేఅవుట్‌ తరహాలోనే అంతా అభివృద్ధి చేసిన స్థలంలోని ప్లాట్లలో సగం మేర రైతులకు కేటాయించనుంది. మిగతాసగం ప్లాట్లను హెచ్‌ఎండీఏనే వేలం వేసి ఆదాయాన్ని సమకూర్చుకోనుంది. మౌలిక సదుపాయాల కల్పనకు అయ్యే ఖర్చంతా హెచ్‌ఎండీఏనే భరిస్తుందన్నారు. 

స్వతహాగా... పట్టాదారుల అంగీకారంతో... 
హెచ్‌ఎండీఏ స్వతహాగా గుర్తించిన ప్రాంతాల్లో భూమి సేకరించి లేఅవుట్‌ అభివృద్ధి తీసుకునే అధికారం కూడా ఉంది. ఔటర్‌ రింగ్‌ రోడ్డు ఇరువైపులా కిలోమీటర్‌ పరిధిలో మినీ నగరాలు అభివృద్ధి చేసేందుకు ఈ అధికారాలు ఉపయోగించుకునే దిశగా హెచ్‌ఎండీఏ అధికారులు కసరత్తు చేస్తున్నారు. అంగీకరించిన రైతులతో అభివృద్ధి ఒప్పందం–జీపీఏ కుదుర్చుకుంటారు. ఇది ఆమోదం పొందిన ఆరునెలల్లోగా రోడ్లు, పాఠశాలలు, పార్కులు, పచ్చదనం, రవాణాసౌకర్యాలు కల్పించి అభివృద్ధి చేసిన ప్లాట్లను సంబంధిత యజమానికి అప్పగిస్తారు. రోడ్డుకు అనుకొని ఉన్న భూముల యజమానులకు అక్కడే స్థలాన్నిచ్చేందుకు ప్రాధాన్యం ఇస్తారు. మిగతాభూములకు లాటరీ పద్ధతిలో కేటాయిస్తారు. ప్లాట్లు కేటాయించిన తర్వాత ఆరునెలల్లోగా అక్కడ మౌలిక సదుపాయాల నిర్వహణ బాధ్యతను యజమానుల సంఘానికి అప్పగించేలా ల్యాండ్‌పూలింగ్‌ పథకంలో నిబంధనలు పొందుపరిచారు. మూడేళ్లలోగా మౌలిక సదుపాయాలను కల్పించకపోతే ప్రతినెలా ఆ భూమి మూల విలువ(బేసిక్‌ వాల్యూ)పై 0.5 శాతం పరిహారాన్ని చెల్లిస్తారు.  

మినీ నగరాలతోపాటే లాజిస్టిక్‌ హబ్‌లు... 
ల్యాండ్‌ పూలింగ్‌ పథకం కింద ఉదాహరణకు ఒక ప్రాంతంలో 100 ఎకరాలను రైతులు ఇచ్చారు. ఇందులో వస్తువు నిల్వ కేంద్రాలు(లాజిస్టిక్‌ హబ్‌)ల కోసం 20 ఎకరాలు పక్కన పెడితే, మిగతా 80 ఎకరాల్లో లే అవుట్‌ను అభివృద్ధి చేయాలి. మొత్తం మౌలిక వసతులు కల్పించగా 2,45,000 గజాలు ప్లాట్ల రూపంలో ఉంటుంది. రైతులతో కుదుర్చుకున్న అవగాహన ప్రకారం ఎకరాకు 1,500 గజాలు కేటాయించాలి. అంటే 2,45,000 గజాలలో 100 మంది రైతులకు 1,50,000 గజాలను ఇవ్వనుంది. మిగిలిన 90,000 గజాలలో ఉన్న ప్లాట్లను విక్రయించడం ద్వారా వచ్చిన సొమ్మును అదే ప్రాంతంలో ఉన్న లాజిస్టిక్‌ హబ్‌కు కేటాయించి అభివృద్ధి చేయడం ద్వారా ఆ ప్రాంతానికి మంచి డిమాండ్‌ రానుంది. అటు నగరంపై పడుతున్న రవాణా, ట్రాఫిక్‌ ఒత్తిడిని తగ్గించడం, ఇటు శివారు ప్రాంతాలను అభివృద్ధి వైపు తీసుకెళ్లేలా చేయడంలో ఈ ల్యాండ్‌ పూలింగ్‌ పథకం ఉపయోగపడుతుందని అంచనా వేస్తున్నారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top