పండించిన ప్రతి గింజనూ కొంటం | CM KCR Guaranted Farmers About Crop Selling In Press Meet | Sakshi
Sakshi News home page

పండించిన ప్రతి గింజనూ కొంటం

Mar 30 2020 2:33 AM | Updated on Mar 30 2020 9:33 AM

CM KCR Guaranted Farmers About Crop Selling In Press Meet - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : ‘తెలంగాణలో ప్రస్తుతం 50 లక్షల ఎకరాల పైచిలుకు పంటలున్నయి. 40 లక్షల ఎకరాల వరి, 14.50 లక్షల టన్నుల దిగుబడినిచ్చే మొక్కజొన్న పంటలున్నయి. యాసంగిలో ఇది రికార్డు. ఒక గింజ కూడా రైతులు బయట అమ్ముకోవాల్సిన అవసరం లేదు. అంతా ప్రభుత్వమే కొంటది. ప్రస్తుతం మొక్క జొన్నకు ధరలేదు. బయట అమ్ముకుంటే నష్టపోతారు. దాని దృష్ట్యా ప్రభుత్వమే కొనాలని నిర్ణయించింది. క్వింటాల్‌ మక్కలకు రూ. 1,200 కూడా కొన్ని చోట్ల ఇస్తలేరు. రూ. 800 అని కొన్నిచోట్ల అంటున్నరు. వరి, మొక్కజొన్న ప్రతి గింజనూ ప్రభుత్వమే 100 శాతం కొంటుంది’ అని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు రైతులకు హామీ ఇచ్చారు. వరి, మక్కల కొనుగోళ్లపై ఆదివారం ప్రగతి భవన్‌ నుంచి జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించిన అనంతరం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. నియంత్రిత విధానంలో కూపన్లలో ఇచ్చిన తేదీ రోజుల్లోనే రైతులు ధాన్యం, మక్కలను తీసుకురావాలి. లేకుంటే కొనరు.. వెనక్కి పంపిస్తారు. రవాణా డబ్బులు మీద పడుతాయి అని రైతులను హెచ్చరించారు. ఇతర వివరాలు ఆయన మాటల్లోనే..

హార్వెస్టర్ల మెకానిక్‌లకు అనుమతి...
వరి పంట కోతకు మన రాష్ట్రంలో 5 వేల హార్వెస్టర్లున్నయి. తమిళనాడు నుంచి 500–1,500 వరకు వస్తున్నాయి. ట్రాక్టర్‌ ఆధారిత హార్వేస్టర్లు మనవి. ఒకటే ట్రాక్టర్‌ను రైతులు అనేక పనులకు వాడుతున్నరు. హార్వెసర్లన్నీ ట్రాక్టర్ల నుంచి దించి ఉన్నయి. రైతులు ఎవరికి వారు ఎక్కించుకోలేరు. పట్టణాల్లో ఉన్న హార్వెస్టర్‌ టెక్నిషియన్లకు ప్రత్యేక పాసులు ఇచ్చి గ్రామాలకు అనుమతించాలని ఆదేశించినం. హార్వెస్టర్ల స్పేర్‌పార్ట్స్‌ కోసం షాపులు తెరిపించి ఇప్పించాలని, స్థానికంగా లభించకపోతే  హైదరాబాద్‌లోని పరిశ్రమలు, డీలర్లను సంప్రదించేందుకు సీఎస్‌కు ఫోన్‌ చేసి చెప్పండి.

బిహార్‌ నుంచి హమాలీలను ..
రైస్‌ మిల్లుల్లో పనిచేసే హమాలీల్లో 95 శాతం బిహార్‌వాళ్లే. హోలీ పండుగకు బిహార్‌ వెళ్లిన వారు అక్కడే ఉన్నరు. పౌరసరఫరాల శాఖ ధాన్యం సేకరించి కస్టమైజ్డ్‌ మిల్లింగ్‌ కోసం మిల్లులకు పంపిస్తది. ఆ మిల్లుల నుంచి బియ్యం ఎఫ్‌సీఐ గోదాములకు వెళ్లాలి. ఈ పనిచేసేటోళ్లు బిహార్‌ హమాలీలు. వారిని రప్పిస్తున్నాం. అవసరమైతే ప్రత్యేక ట్రైన్స్‌ పెట్టించి వారిని రప్పిస్తం.

నేడు రైస్‌ మిల్లర్లతో సమావేశం..
రైస్‌ మిల్లర్లు, వ్యాపారస్తులు కొంటామంటే వారిని గ్రామాలకు రానీయాలి. వారు కచ్చితంగా కనీస మద్దతు ధర చెల్లించాలి. సోమవారం ఉదయం 11.30 రైస్‌ మిల్లర్స్‌ అసోసియేషన్‌కి చెందిన ఆరుగురు ప్రతినిధులతో సమావేశమై చర్చిస్తా. 

కంచెలు తొలగించాలి
గ్రామాలకు బయటి వారు రాకుండా ముళ్ల కంచెలు, రాళ్ల గోడవు పెట్టారు. కరోనా వరకు మంచిదే. రైతులు వడ్లు అమ్ముకోవాలి. హమాలీ వాళ్లు రావాలి. కూపన్లు ఇచ్చే అధికారి రావాలి. వారిని అనుమతించే విష యంలో స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, రైతు సమితి సభ్యులు సమన్వయం చేసుకోవాలి. వారి కోసం కంచెలను తొలగించాలి. తెల్లకార్డుదారులకు ఒకట్రెండు రోజుల్లో బియ్యం, రూ. 1,500 పంపిణీ ప్రారంభమవుతుంది. బియ్యం వాహనాన్ని గ్రామాల్లో రానివ్వాలి. మీ ఊర్లకు నిత్యవసర సరులకు రానీయండి. గంగాళం, శానిటైజర్, సబ్బులు పెట్టి వచ్చిపోయే వారు కాళ్లు చేతులు కడుక్కోవాలనే నిబంధన పెట్టండి. రోడ్లు మూసేయొద్దు.

ధాన్యం, మక్కల కొనుగోళ్లకు రూ. 30 వేల కోట్లు..
ధాన్యం కొనడానికి ప్రభుత్వం వద్ద డబ్బు లు లేవు. ప్రభుత్వ రెవెన్యూ పడిపోయింది. ఇంత కఠిన పరిస్థితిలో కూడా ధాన్యం సేకరణ కోసం సివిల్‌ సప్‌లైస్‌ కార్పొ రేషన్‌కు రూ. 25 వేల కోట్లు సమీకరిం చినం. కార్పొరేషన్‌కు ఇంత పెద్ద మొత్తంలో డబ్బులు సమీకరించడం చరిత్రలో ఇదే తొలిసారి. ఉమ్మడి ఏపీలోనూ ఇన్ని డబ్బు లు ఎన్నడూ ఇవ్వలేదు. మక్కల కొనుగోళ్ల కోసం మార్క్‌ఫెడ్‌కు రూ. 3,200 కోట్లు కలిపి రైతుల కోసం సుమారు రూ. 30 వేల కోట్లను ప్రభుత్వం సమీకరించింది. ఏ రాష్ట్రంలోనూ ఇన్ని ఏర్పాట్లు లేవు. ప్రతి గింజా కొంటామనిది డైలాగ్‌ కాదు. ప్రతి కిలో వరి, మక్కలను కొంటామని సీఎంగా చెబుతున్న. ఒక కోటీ 5 లక్షల టన్నుల వరి వచ్చే అవకాశముంది. ఒక్క కేజీ మిగల కుండా ప్రభుత్వమే కొంటది. ఆన్‌లైన్‌లో డబ్బులు వేస్తది. రైతులకు ఆందోళన వద్దు. 2, 3 రోజుల్లో జిల్లా కలెక్టర్లు, వ్యవసాయ, మార్కెటింగ్‌ అధికారులు సమన్వయం చేసుకుని కూపన్లు ఇస్తరు. రైతులు వచ్చేటప్పుడు ఖాతా నంబర్, పాస్‌బుక్‌ తీసుకుని రావాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement