ముస్లిం మతస్తులకు ఉద్యోగావకాశాల్లో కల్పించే రిజర్వేషన్‌ను కొందరు బీజేపీ మంత్రులు వ్యతిరేకిస్తున్నారు.
సాక్షి, ముంబై: ముస్లిం మతస్తులకు ఉద్యోగావకాశాల్లో కల్పించే రిజర్వేషన్‌ను కొందరు బీజేపీ మంత్రులు వ్యతిరేకిస్తున్నారు. దీంతో ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ పునరాలోచనలో పడ్డారు. గత కాంగ్రెస్, ఎన్సీపీ నాయకత్వంలోని డీఎఫ్ ప్రభుత్వం మరాఠాలకు విద్యా, ఉద్యోగాల్లో 16 శాతం రిజర్వేషన్ ఇవ్వాలని, అదేవిధంగా ముస్లింలకు ఉద్యోగ, విద్యావకాశాల్లో ఐదు శాతం చొప్పున రిజర్వేషన్ కల్పించాలని నిర్ణయం తీసుకుంది. అయితే దేవేంద్ర ఫడ్నవిస్ సహా బీజేపీ నాయకులు మరాఠా రిజర్వేషన్‌కు మద్దతు పలికారు కాని మతం పేరట ముస్లింలకు రిజర్వేషన్ అమలుచేయడాన్ని వ్యతిరేకించారు.
అయినప్పటికీ ప్రజాస్వామ్య కూటమి ఈ రిజర్వేషన్‌ను అమలు చేయడం ప్రారంభించింది. కాగా, ఈ రిజర్వేషన్లపై హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. దాంతో సదరు రిజర్వేషన్‌పై ముంబై హై కోర్టు స్టే ఇచ్చింది. దీన్ని సవాలు చేస్తూ బీజేపీ ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. కాని హిందూ ఓటర్లు తమకు ఎక్కడ దూరమవుతారోనన్న భయంతో కొందరు బీజేపీ నాయకులు ముస్లింలకు రిజర్వేషన్‌ను వ్యతిరేకిస్తుండటం గమనార్హం.