రైతన్నకు ‘వైఎస్సార్‌ బీమా’ | YS Jagan promises at the prajasankalpayatra about farmers | Sakshi
Sakshi News home page

రైతన్నకు ‘వైఎస్సార్‌ బీమా’

Dec 4 2017 1:34 AM | Updated on Jul 25 2018 4:07 PM

YS Jagan promises at the prajasankalpayatra about farmers - Sakshi

ప్రజా సంకల్పం నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుల కోసం ప్రత్యేక బీమా పథకాన్ని ప్రవేశపెడతామని ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ప్రకటించారు. ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలకు ఈ పథకం కింద తక్షణమే రూ 5 లక్షలు ఆర్థిక సాయం అందేలా ఈ బీమాను రూపకల్పన చేస్తామన్నారు. ప్రజా సంకల్ప పాదయాత్రలో భాగంగా ఆయన కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గంలో పర్యటిస్తూ తుగ్గలి మండలం ఎర్రగుడి శివారులో రైతులతో  జరిగిన ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నారు.  కర్నూలు, అనంతపురం జిల్లాల నుంచి భారీగా తరలివచ్చిన రైతులు మెడలో ఆకుపచ్చ కండువాలను ధరించి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఓ రైతు అడిగిన ప్రశ్నకు జగన్‌ సమాధానమిస్తూ... ‘‘వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత ఎక్కడైనా ఒక రైతు ఆత్మహత్య చేసుకుంటే ఆ కుటుంబానికి నేరుగా రూ.5 లక్షలు ప్రభుత్వ సహాయంగా బీమా పథకం కింద అందజేస్తాం’’ అని జగన్‌ వివరించారు. ఆయన ఇంకేమన్నారంటే.. 

 అప్పులిచ్చినవారు పీడించకుండా చట్టం 
‘‘రైతుల కోసం మనందరి ప్రభుత్వం తీసుకువచ్చే బీమా పథకం ప్రస్తుతం టీడీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న చంద్రన్న బీమా పథకంలాంటిది కాదిది. ప్రస్తుతం అమలులో ఉన్న  పథకం ప్రకారం ప్రభుత్వం ఇచ్చే రూ.5 లక్షలు బాధితుడి కుటుంబానికి ఇవ్వడం లేదు. అందులోంచి రూ.1.50 లక్షలను మరణించిన రైతు చేసిన అప్పులు చెల్లించడానికి స్థానిక డీఎస్‌పీకి ఇస్తారు. మిగతా రూ.3.50 లక్షల కూడా చేతికి ఇవ్వడం లేదు. ఆ మొత్తాన్ని బ్యాంకులో తహశీల్దారు, మరణించిన వ్యక్తి కుటుంబీకుల ఉమ్మడి ఖాతాలో డిపాజిట్‌ చేస్తున్నారు. ఆ మొత్తం నుంచి  ఏటా వచ్చే రూ.35 వేలు వడ్డీని ఆ కుటుంబానికి ఇస్తున్నారు. ఇలా పదేళ్లు ఇస్తారు. ఇక ఆ రైతు కుటుంబానికి ప్రభుత్వం చేసిన మేలేమిటి..? వారికి అందిన సాయం ఏమిటి..? కానీ మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఎక్కడైనా ఒక రైతు ఆత్మహత్య చేసుకుంటే అప్పుల వారెవరూ  ఆ కుటుంబాన్ని పీడించే పరిస్థితి లేకుండా చేస్తానని భరోసా ఇస్తున్నాను. ఆమేరకు పక డ్బందీగా చట్టాన్ని తీసుకువస్తాం. ఆ కుటుంబానికి చెందాల్సిన రూ.5 లక్షలు వారి చేతికి అందజేస్తాం. దాంతో ఆ కుటుంబం నిలదొక్కుకుని జీవనం సాగించే అవకాశం ఉంది. అప్పుల బాధ తాళలేక మరణించిన రైతు ఆత్మ పైనుంచి చూస్తున్నప్పుడు తన కుటుంబాన్ని అప్పుల వాళ్లు వేధిస్తుంటే ఘోషిస్తుంది కదా..! నేను ఆ పరిస్థితి లేకుండా చేస్తా. అప్పుల వారెవ్వరూ ఆ కుటుంబం వైపు తలెత్తి చూసే పరిస్థితి లేకుండా చట్టాన్ని తెస్తాం. 

పోలవరం పూర్తి చేస్తే...  
పట్టిసీమలో ఓ చెంబు నీళ్లు పోసి రాయలసీమకు మేలు జరిగిందని చంద్రబాబు చెబుతున్నారు. ఎలా మేలు జరిగిందని నేను ప్రశ్నిస్తున్నా. రాయలసీమకు ప్రయోజనం జరిగేది పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసినప్పుడే. వాస్తవానికి పోలవరం నుంచి కృష్ణానదికి కలుపుతూ కాలువల నిర్మాణం చేసింది వైఎస్‌ రాజశేఖరరెడ్డి కాదా అని ప్రశ్నిస్తున్నా. చంద్రబాబు పోలవరం పూర్తి చేసి ఉంటే ఒక్క చెంబు కాదు ఒక చెరువు నీళ్లే ఏకంగా కృష్ణానదిలోకి పోసి ఉండవచ్చు. పట్టిసీమలో నీళ్లు పోసి ప్రకాశం బ్యారేజీ ద్వారా 50 టీఎంసీల నీటిని సముద్రంలో వదిలివేస్తున్నారు. పులిచింతల ప్రాజెక్టులో 45 టీఎంసీల నీరు అందుబాటులోకి రావడం లేదు. మన అందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత వ్యవసాయానికి రోజూ 9 గంటల పాటు విద్యుత్‌ సరఫరా చేస్తాం. ప్రతి రైతుకూ ఏటా మే నెలలో రూ.12,500 రైతు భరోసా కింద (మొత్తం రూ.50 వేలు) ఇస్తాం. మార్కెట్‌లో దళారీల ప్రమేయం లేకుండా చేసేందుకు రూ.3వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేస్తాం. «ఈ నిధి నిర్వహణ బాధ్యతలను రాష్ట్ర పార్టీ రైతు విభాగం అధ్యక్షుడు నాగిరెడ్డికి అప్పగిస్తాం. ప్రతీ పంటకు ముందే గిట్టుబాటు ధరను ప్రకటిస్తాం. ఆ ధరలకే కొనుగోలు చేసేలా చేస్తాం.రూ.2వేల కోట్లతో ప్రకృతి వైపరీత్యాల సహాయ నిధిని ఏర్పాటు చేస్తాం. దానికి కేంద్రం ఇచ్చే మరో రూ.2వేల కోట్లను జత చేసి మొత్తం రూ.4వేల కోట్ల నిధిని నిర్వహిస్తాం. పెండింగ్‌ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తాం.  

కల్తీ విత్తనాలు, మందులను అరికట్టడానికి సమగ్ర చట్టం
రాష్ట్రంలో రైతులకు తీవ్రంగా నష్టం కలిగిస్తున్న కల్తీ విత్తనాలు, కల్తీ పురుగు మందుల నిరోధానికి వైఎస్సార్‌ సీపీ అధికారంలోకి వచ్చిన తరువాత సమగ్రమైన చట్టం తెస్తామని ప్రతిపక్ష నేత  జగన్‌ ప్రకటించారు. ఆళ్లగడ్డకు చెందిన రామకృష్ణ అనే రైతు తమ నియోజకవర్గంలో కల్తీ విత్తనాల సరఫరా ఫలితంగా సుమారు 600 ఎకరాల్లో పంట నష్టపోయిందని, దీనిపై అధికారులు విచారణ జరపాల్సి ఉన్నా, మంత్రి అడ్డుకుంటున్నారని రైతు సమ్మేళనంలో జగన్‌ దృష్టికి తెచ్చారు. ‘‘కల్తీ విత్తనాలు, కల్తీ పురుగు మందులు రాష్ట్రంలో చంద్రబాబు పాలనలో యథేచ్ఛగా సరఫరా అవుతున్నాయి. అయినా పట్టించుకోవడం లేదు.  కేసులు నమోదు చేయరు. నమోదైనా దర్యాప్తు జరగడం లేదు. ఈ వ్యవహారంలో సాక్షాత్తు అసెంబ్లీ స్పీకర్‌ పేరే వినిపిస్తోంది. ఈ ఫిర్యాదులు మంత్రి వద్దకు వెళితే అవి బుట్టదాఖలవుతున్నాయి. కూపీ లాగితే మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, మరో మంత్రి లోకేశ్‌ ప్రమేయమూ ఉందంటున్నారు. రైతుల జీవితాలను సంక్షోభంలోకి నెట్టేస్తున్న వీటిని పూర్తిగా కట్టడి చేయడానికి ఒక పక్కా పద్ధతిని అమలు చేసేందుకు సమగ్రమైన చట్టాన్ని తెస్తాం’’ అని జగన్‌ పేర్కొన్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement