
సాక్షి, హైదరాబాద్: సింగరేణి ఎన్నికల్లో టీఆర్‌ఎస్ నాయకులు దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి మండిపడ్డారు. టీఆర్‌ఎస్ ఎంపీ బాల్క సుమన్ సీపీఐ అనుబంధ కార్మికసంఘం నేతలను ప్రలోభాలకు గురిచేస్తున్నారని ధ్వజమెత్తారు. గురువారం ఆయన మఖ్దూం భవన్‌లో విలేకరులతో మాట్లాడారు. రాత్రివేళల్లో రహస్యంగా తన నాయకుల ఇళ్లకు వెళ్లి లక్షలాది రూపాయలు ఆశ చూపుతున్నారని ఆయన అన్నారు. అంతేకాక ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారని విమర్శించారు.
జాతీయ సంఘాలతోనే సింగరేణిలో కార్మికుల హక్కులకు రక్షణ ఉంటుందన్నారు. తాము అధికారం కోసం కాకుండా కార్మికుల సంక్షేమం కోసమే పనిచేస్తామన్నారు. సింగరేణి కార్మికులంతా జాతీయ సంఘాలనే నమ్ముతున్నారని కూడా చాడ పేర్కొన్నారు. తమ సంఘ నేతలు మారిపోతున్నారంటూ ఎంపీ సుమన్ గోబెల్స్ ప్రచారం చేస్తున్నారని అన్నారు. ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పార్టీలు మారిన వ్యక్తి అని, ఆయన కూడా ఇదే తరహాలో ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు.
సింగరేణి ఎన్నికల్లో ఓటుకు రూ. 5 వేలు పంచేందుకు అధికారపార్టీ నేతలు ప్రయత్నిస్తున్నారని ఆయన ఆరోపించారు. జీవో 39, 42లను ఉపసంహరించుకుని రైతు సమన్వయ సమితులను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అక్టోబరు 3న రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపడుతామని చాడ పేర్కొన్నారు.