ఇంతకు రాజీవ్‌ హంతకులు విడుదలవుతారా?

Article On Rajiv Gandhi Assassination Case - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : భారత మాజీ ప్రధాన మంత్రి రాజీవ్‌ గాంధీ హత్య కేసులో తమకు క్షమాభిక్ష పెట్టాల్సిందిగా కోరుతూ ఏడుగురు దోషులు పెట్టుకున్న పిటిషన్‌పై నిర్ణయం తీసుకునే అధికారం తమిళనాడు రాష్ట్ర గవర్నర్‌కు ఉందంటూ సుప్రీం కోర్టు ఉత్తర్వులు జారీ చేయడం, దోషులను తాను ఎప్పుడో క్షమించేశానని రాజీవ్‌ గాంధీ తనయుడు, కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ ప్రకటించిన నేపథ్యంలో దోషులు విడుదలయ్యే అవకాశం ఉందా ! అన్న అంశంపై ఆసక్తి నెలకొంది.

 దోషులందరిని విడుదల చేయాల్సిందిగా ఆదివారం నాడు తమిళనాడు కేబినెట్‌ కూడా తీర్మానించి ఆ మేరకు రాష్ట్ర గవర్నర్‌కు సిఫార్సు పంపింది. రాష్ట్ర ప్రభుత్వం సిఫారసును పునర్‌ పరిశీలించాల్సిందిగా తిప్పి పంపే అధికారం రాష్ట్రపతి లాగా గవర్నర్‌కు లేనందున గవర్నర్‌ సిఫార్సును ఆమోదించి దోషుల విడుదలకు ఆదేశాలు జారీ చేస్తారా? ఆయన చేసినంత మాత్రాన దోషులు విడుదలవుతారా? గవర్నర్‌ నిర్ణయాన్ని తిరిగి కేంద్రం సవాల్‌ చేసే అవకాశం లేదా? ఏడాదిలో సార్వత్రిక ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం గవర్నర్‌ స్వేచ్ఛగా నిర్ణయం తీసుకునేందుకు అనుమతిస్తుందా? అనుమతిస్తే అందుకు ప్రజల సానుభూతి కేంద్రానికి లభిస్తుందా ? కాంగ్రెస్‌ పార్టీకి లభిస్తుందా? లేదా మొదటి నుంచి దోషుల విడుదలను కోరుతున్న తమిళనాడు ప్రభుత్వానికి దక్కుతుందా?

రాజీవ్‌ గాంధీ హత్య కేసులో యావజ్జీవ శిక్షలు అనుభవిస్తున్న ఏడుగురు దోషులను విడుదల చేయాలని తమిళనాడు ప్రభుత్వం 2014లో నిర్ణయించింది. భారతీయ శిక్షాస్మతిలోని 432 సెక్షన్‌ కింద దోషుల శిక్షను తగ్గించేందుకు లేదా రద్దు చేసేందుకు ఓ రాష్ట్ర ప్రభుత్వానికి అధికారం ఉండడంతో నాడు తమిళనాడు ప్రభుత్వం ఆ నిర్ణయం తీసుకుంది. అయితే తమిళనాడు నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం హైకోర్టులో సవాల్‌ చేసింది. కేసును రాష్ట్ర పోలీసులు కాదు, కేంద్ర దర్యాప్తు సంస్థ అయిన సీబీఐ విచారించినందున ఏకపక్షంగా నిర్ణయం తీసుకునే అధికారం ఓ రాష్ట్ర ప్రభుత్వానికి లేదని, అందుకు కేంద్రం అనుమతి తప్పనిసరని కేంద్రం వాదించింది. దీంతో కేసు సుప్రీం కోర్టుకు వెళ్లింది. 2015లో అదే భారతీయ శిక్షాస్పతిలోని 435 సెక్షన్‌ కింద కేంద్రం అనుమతి తప్పనిసరంటూ కేంద్ర ప్రభుత్వానికి సానుకూలంగా సుప్రీం కోర్టు తీర్పు చెప్పింది. 

అయితే భారత రాజ్యాంగంలోని 161వ అధికరణ కింద రాష్ట్ర గవర్నర్‌ దోషులకు క్షమాభిక్షను ప్రసాదిస్తే 435 సెక్షన్‌ కింద కేంద్రం అనుమతి లేకుండా రాష్ట్ర ప్రభుత్వం దోషులను విడుదల చేయవచ్చని అదే తీర్పులో సుప్రీం కోర్టు సూచించింది. దీంతో పాతికేళ్లకుపైగా జైలు శిక్షను అనుభవిస్తున్న ఏడుగురు దోషులు తమిళనాడు గవర్నర్‌కు మెర్సీ పిటిషన్లు దాఖలు చేసుకున్నారు. ఈ నేపథ్యంలోనే వాటిని ఆమోదించాల్సిందిగా కోరుతూ రాష్ట్ర కేబినెట్‌ ఆదివారం నాడు సిఫార్సు చేసింది. దోషులను విడుదల చేయడం వల్ల అంతర్జాతీయ పర్వవసానాలను ఎదుర్కోవల్సి వస్తుందంటూ ప్రతి దశలో దోషుల విడుదలను అడ్డుకున్న కేంద్ర ప్రభుత్వం ఈసారి మాత్రం గవర్నర్‌ నిర్ణయాన్ని సవాల్‌ చేయదా? చేయడానికి చట్టపరంగా అవకాశాలు కూడా ఉన్నాయి. 

క్షమించే అధికారం...ఆంక్షలు
వివిధ కేసుల్లో శిక్ష పడిన దోషులకు క్షమాభిక్ష ప్రసాదించి విడుదల చేసే అధికారాలను రాజ్యాంగంలోని 72వ అధికరణ కల్పిస్తుండగా, అలాంటి అధికారాలనే రాష్ట్ర గవర్నర్‌కు రాజ్యాంగంలోని 161వ అధికరణ కల్పిస్తోంది. రాష్ట్ర కార్యనిర్వహణ అధికారాల పరిధిలోకి వచ్చే ఏ చట్టం కిందయినా, ఏ నేరానికైనా, ఎంత శిక్ష పడినా, దోషుల శిక్షను తగ్గించే అధికారం రాష్ట్ర గవర్నర్‌కు ఉంది. కేంద్ర, రాష్ట్రాలకు సంబంధించిన ఉమ్మడి జాబితాలోని అధికారాలు కూడా రాష్ట్ర ప్రభుత్వానికి వర్తిస్తాయి కనుక ఇండియన్‌ పీనల్‌ కోడ్, క్రిమినల్‌ ప్రొసీజర్‌ కోడ్‌ పరిధిలో శిక్షలు పడిన దోషులకు గవర్నర్‌ క్షమాభిక్ష ప్రసాదించవచ్చు. 

ప్రమాణాలు ఉండాల్సిందే
క్షమాభిక్ష అధికారాలు ఉన్నాయికదా! అని వాటిని విచక్షణా రహితంగా ఉపయోగించడానికి వీల్లేదంటూ ఓ రెండు కేసుల విచారణ సందర్భంగా సుప్రీం కోర్టు మార్గదర్శకాలను సూచించింది. ‘ఇవేమి విశేషాధికారాలు కాదు. పనితీరుకు సంబంధించిన విచక్షణాధికారాలు. దోషుల క్షమాభిక్ష కారణంగా అది వారి ఒక్కరికే లాభం చేకూర కూడదు. వారితోపాటు ప్రజలకు కూడా మేలుచేస్తుందని అనుకున్నప్పుడే ఈ అధికారాలు ఉపయోగించాలి. రాజకీయ లబ్ధిని ఆశించి అసలు నిర్ణయం తీసుకోరాదు. 72వ అధికరణ కింద రాష్ట్రపతి, 162 కింద గవర్నర్‌కు సంక్రమించే అధికారాలకు ఈ మార్గదర్శకాలు వర్తిస్తాయి’ అని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. 

మరేం జరుగుతుంది?
రాష్ట్ర కేబినెట్‌ సిఫార్సును తింపి పంపే అధికారం గవర్నర్‌కు లేకపోయినప్పటికీ, ఆ సిఫార్సుపై న్యాయ సమీక్షను కోరే అవకాశం ఆయనకు ఉంది. పైగా దోషులు స్వయంగా తనకే పిటిషన్లు పెట్టుకున్నందున తానే స్వయంగా నిర్ణయం తీసుకోవచ్చు. సుప్రీం కోర్టు మార్గదర్శకాల ప్రకారం రాజీవ్‌ హత్య కేసులో ప్రజలకు మేలు చేసే అంశం లేనందున గవర్నర్‌ పిటిషన్లకు తిరస్కరించే అవకాశమే ఎక్కువగా ఉంది. ఒకవేళ గవర్నర్‌ దోషుల పట్ల సానుకూల నిర్ణయం తీసుకున్నా సవాల్‌ చేసే అధికారం కేంద్రానికి ఉంది. దోషులను ఎవరు క్షమించినా రాజీవ్‌తోపాటు మరణించిన 17 మంది వ్యక్తుల కుటుంబాలు దోషులను క్షమించక పోవచ్చు.వారైనా సవాల్‌ చేయవచ్చు!

అంతర్జాతీయ అంశాలు
దోషుల్లో ముగ్గురు శ్రీలంక జాతీయులు అవడం వల్ల అంతర్జాతీయ న్యాయ, దౌత్యపరమైన అంశాలు కూడా ఇందులో ఇమిడి ఉన్నాయి. శ్రీలంక జాతీయులను విడుదల చేసి వారి దేశానికి పంపిస్తే వారిని తిరిగి అరెస్ట్‌ చేసి వారి చట్టాల ప్రకారం విచారించి మళ్లీ శిక్ష విధించే అవకాశం ఉంది. వారికి మన దేశంలో ఆశ్రయం కల్పించాలన్నా, మరో దేశంలో ఆశ్రయం కల్పించాలన్నా దౌత్యపరమైన ఇబ్బందులు ఉంటాయి. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top