ఆ ఇద్దరూ నడుమా న్యాయం

ఆ ఇద్దరూ నడుమా న్యాయం


 ఆలస్యం అమృతం విషం అన్నారు. బంగ్లాదేశ్‌లో నేడు అదే జరుగుతోంది. వందలాది మందిని హతమార్చిన ‘మీర్‌పూర్ నరహంతకుడు’ ఖాదర్ ముల్లా (65) ఈ నెల 12న ఉరికంబం ఎక్కినప్పటి నుంచి దేశం అత లాకుతలం అవుతోంది. ఖాదర్ సాగించిన హత్యాకాండ, అత్యాచారాలు 1971 బంగ్లా విముక్తి పోరాట కాలం నాటివి. నాటి మారణహోమంలో 30 నుంచి 60 లక్షల మంది హతం కాగా, 6 లక్షల మందిపై అత్యాచారాలకు గురయ్యారు. నాలుగు దశాబ్దాలకు పైగా మురిగిన ‘న్యాయం’ నేడు ప్రాణాంతక విషంగా వికటిస్తోంది. కాబట్టే ఖాదర్ ఉరిని ‘రాజకీయ హత్య’ అంటూ ప్రతిపక్షాలు గగ్గోలు చేయగలుగుతున్నాయి. ముల్లా ‘ప్రతి నెత్తుటి బొట్టుకూ ప్రతీకారం తప్పద’ని జమాతే ఇస్లాం పార్టీ వీరంగం వేయగలుగుతోంది. అది రేకెత్తించిన ఘర్షణల్లో ఇప్పటికి కనీసం 26 మంది బలైపోయారు. బంగ్లాదేశ్ ఒకప్పడు తూర్పు పాకిస్థాన్‌గా పాక్‌లో భాగంగా ఉండేది. పశ్చిమ పాక్ రాజకీయ, సైనిక నేతల దురహంకారానికి, అణచివేతకు, వివక్షకు గురైంది.  విముక్తి పోరాట కాలంలోనూ, అంతకు ముందూ, తర్వాతా కూడా జమాతే పశ్చిమ పాక్ దురహంకారుల పక్షం వహించింది. ప్రస్తుతం ‘హిఫాజత్ ఏ ఇస్లామీ’ అనే ఛాందసవాద సంస్థను ముందు నిలిపి లౌకికతత్వాన్ని పాతరవేసి, బంగ్లాను షరియా పాలన సాగే ఇస్లామిక్ దేశంగా మార్చాలని ప్రయత్నిస్తోంది. ప్రధాన ప్రతిపక్షం బంగ్లా నేషనలిస్టు పార్టీ (బీఎన్‌పీ)తో కలిసి ప్రజాస్వామ్యాన్ని బలిపీఠం ఎక్కిస్తోంది. ఈ నేపథ్యంలోనే తాజా అల్లర్లు జనవరి 5న జరగాల్సిన  సార్వత్రిక ఎన్నికలు జరుగుతాయా? పౌర ప్రభుత్వం నిలుస్తుందా? అనే సందేహాలను రేకెత్తిస్తున్నాయి.   1975-81 మధ్య కాలం నాటి సైనిక నియంత జియావుర్ రెహ్మాన్ మతతత్వవాద శక్తులతో చెలిమి చేశారు. ఆయన భార్య బీఎన్‌పీ నేత్ర ఖలీదా జియా ఆ మైత్రిని బలోపేతం చేశారు. జమాతే బీఎన్‌పీకి నమ్మకమైన మిత్రపక్షం. మూడు దశాబ్దాలుగా బంగ్లా రాజకీయాలు మాజీ ప్రధాని ఖలీదాకు, నేటి ప్రధాని, అవామీ లీగ్ నేత్రి షేక్ హసీనాకు మధ్య వైరంగా మారాయి. ఒకరి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మరొకరు వీధులకెక్కి ఏ ప్రభుత్వాన్నీ పనిచేయనివ్వక పోవడం రివాజయింది. ఈ అసాధారణ వాతావరణంలో...అంతర్జాతీయ నేర విచారణ ట్రిబ్యునల్  ఫిబ్రవరిలో 1971 నాటి యుద్ధనేరస్తులైన జమాతే అగ్ర నేతలకు శిక్షలను విధించింది. ఆ విచారణల ఉత్తేజంతోనే బంగ్లా యువత, మధ్యతరగతి విద్యావంతులు అరబ్బు వసంతాన్ని తలపించే రీతిలో షాబాగ్ ఉద్యమాన్ని నిర్వహించారు. ‘మీర్‌పూర్ నరహంతకు’నికి జీవితఖైదును విధించడాన్ని నిరసించి, మరణశిక్షను డిమాండు చేశారు. చివరకు సుప్రీం కోర్టు తీర్పు మేరకు ఖాదర్ ఉరికంబమెక్కాడు. బీఎన్‌పీ అండతో జమాతే నాటి నుంచి హసీనా ప్రభుత్వ వ్యతిరేక అల్లర్లకు దిగింది. కాగా గత మూడు నెలలుగా ఖలీదా జనవరి ఎన్నికలకు వ్యతిరేకంగా ఆందోళన చేపట్టారు. ఖలీదా నేతృత్వంలోని 18 ప్రతిపక్షాల కూటమి ఎన్నికల బహిష్కరణకు పిలుపునిచ్చింది. హసీనాకు విజయావకాశాలు ఉండటమే ఖలీదా ఆందోళనకు అసలు కారణం. రాజ్యాంగం ప్రకారం తాత్కాలిక తటస్థ ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ఎన్నికలు జరగాలని ఆమె వాదన. కానీ ఆ ‘రాజ్యాంగ నిబంధన’ 1996లో జమాతే మద్దతుతో ఆమె ప్రభుత్వం చేసిన 13వ సవరణ ఫలితం. ఎన్నికకాని తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటు ఏదైనాగానీ రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమేనదేనని సుప్రీం కోర్టు ఇటీవల తీర్పు ఇచ్చింది. ఈ ఏర్పాటును గతంలో సైతం వ్యతిరేకించిన హసీనా 15వ సవరణతో తాత్కాలిక ప్రభుత్వ ఏర్పాటుకు స్వస్తి పలికారు. హసీనా నేతృత్వంలో ఎన్నికలు నిష్పక్షపాతంగా జరగవని, ఆమె ప్రభుత్వం రాజీనామా చేయాలని ఖలీదా పట్టుబడుతున్నారు. అల్లర్లతో, ఆందోళనలతో అసాధారణ పరిస్థితిని సృష్టించి ఎన్నికల కమిషన్ చేత ఎన్నికలను వాయిదా వేయించాలని  యత్నిస్తున్నారు. గతంలో అలా ఎన్నికలు మూడుసార్లు వాయిదా పడ్డాయి.  కాగా ఏది ఏమైనా ఎన్నికలను నిర్వహించాలని చూస్తున్న హసీనా... అధికార కూటమిలో భాగస్వామిగా ఉన్న మాజీ సైనిక నియంత హెచ్‌ఎమ్ ఎర్షాద్‌ను ‘ఆసుపత్రిలో చేర్పించారు.’ పరస్పర విభిన్న వైఖరులను ప్రదర్శించే ఎర్షాద్ మొదట ఎన్నికల్లో పాల్గొనాలని ఖలీదాకు హితవు పలికారు. తాజాగా బహిష్కరణకు పిలుపునిచ్చారు.  ఎర్షాద్‌ను ఆసుపత్రికి పంపి హసీనా ఆయన భార్య, మంత్రి రోషన్  నేతృత్వంలో ఎర్షాద్ ‘జాతీయ పార్టీ’ సహా మిత్ర పక్షాలతో ఎన్నికలకు దిగుతున్నారు. ఏది ఏమైనా బంగ్లా ఆశాంతి ఇప్పట్లో చల్లారేట్టు కనబడదు. బంగ్లా సైనిక నియంతృత్వాల  గతం పునరావృతం కాదని ఆశిద్ధాం.  పిళ్లా వెంకటేశ్వరరావు

 

 

Read latest Opinion News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top