రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంలో ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదాతో సహా ఎనిమిది సవరణలను పొందు పరచాలని బుధవారం రాజ్యసభలో వైఎస్‌ఆర్‌సీపీ ప్రతిపాదించింది.
రాష్ట్రపతి ప్రసంగానికి ఎనిమిది సవరణలు ప్రతిపాదించిన వైఎస్‌ఆర్‌సీపీ
సాక్షి, న్యూఢిల్లీ : రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంలో ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదాతో సహా ఎనిమిది సవరణలను పొందు పరచాలని బుధవారం రాజ్యసభలో వైఎస్‌ఆర్‌సీపీ ప్రతిపాదించింది. ఎంపీ వి.విజయసాయి రెడ్డి వీటిని ప్రతిపాదించగా, తీర్మానంపై ఓటింగ్‌లో ఈ సవరణలు మూజువాణి ఓటుతో వీగిపోయాయి. సభలో ప్రధాన మంత్రి మోదీ ఉన్నారని, అందువల్ల తాను ప్రతిపాదించిన సవరణల ఆవశ్యకతను వివరించడానికి అవకాశమివ్వాలని విజయసాయి రెడ్డి కోరినప్పటికీ అవకాశం లభించలేదు. కాగా, అంతకు ముందు మరో అంశంపై ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ సహా పలు పార్టీలు వాకౌట్ చేసి సభ నుంచి బయటకు వెళ్లటంతో ఈ సవరణలపై పట్టు పట్టే అవకాశం లేకపోయింది.
విజయసాయి రెడ్డి ప్రతిపాదించిన సవరణలు..
► ఏపీకి ప్రత్యేక హోదా మంజూరు
► రాయలసీమ, ఉత్తరాంధ్రలకు ప్రత్యేక ప్యాకేజీ
► విభజన చట్టం ప్రకారం పన్నుల వసూలుపై స్పష్టత
► విశాఖపట్నం కేంద్రంగా నూతన రైల్వే జోను ఏర్పాటు
► పోలవరం ప్రాజెక్ట్ పూర్తి చేయడానికి కాల పరిమితి
► ఏపీలో హైకోర్టు ఏర్పాటుకు కాల పరిమితి
► ఉమ్మడి ఆస్తులైన 107 సంస్థల విభజన
► మహిళల సాధికారత కోసం మహిళలకు రిజర్వేషన్ల కల్పన