
సాక్షి, న్యూఢిల్లీ : దేశానికి పట్టుగొమ్మలైన గ్రామాలను మరింతగా అభివృద్ధిచేయడమే తమ లక్ష్యమని ప్రధానమంత్రి నరరేంద్ర మోదీ చెప్పారు. గ్రామీణభారతం పంటపొలాలు కళకళలాడుతూ, సేద్యం చేసే రైతు ముఖంలో చిరునవ్వులు చిందించేలా చేయడమే అంతిమ గమ్యమన్నారు. సమాజంలో అట్టడుగున ఉన్న వ్యక్తికి కూడా చక్కటి జీవితాన్ని అందిస్తామని, అందుకే ‘ఈజ్ ఆఫ్ లివింగ్’ నినాదంతో బడ్జెట్ తీసుకొచ్చామని తెలిపారు. పార్లమెంట్‌లో ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ బడ్జెట్ సమర్పణ పూర్తయిన కొద్దిసేపటికే ప్రధాని మోదీ జాతిని ఉద్దేశించి ప్రసంగించారు.
‘‘2018-19 వార్షిక బడ్జెట్‌లో వ్యవసాయరంగానికి అధిక ప్రాధాన్యం ఇచ్చాం. ఇది రైతులకు, సాధారనపౌరులకు మేలు చేసే బడ్జెట. వ్యాపారవేత్తలకు కూడా అనువైనదే. బడ్జెట్‌లో గ్రామీణరంగాలకు పెద్దపీట వేసిన అరుణ్ జైట్లీకి అభినందనలు. గ్రామీణ ప్రాంతాల్లో జీవనోపాథి కల్పన కోసం గరిష్టంగా రూ.14.34 లక్షల కోట్లు కేటాయించడం సంతోషం. రైతుల జీవన స్థితుగతులు మెరుగుపడేందుకు అవసరమైన అన్ని చర్చలను తీసుకుంటాం. కనీస మద్దతు ధరను ఒకటిన్నర రెట్లు పెంచాం. అన్ని రాష్ట్రాలతో నీతి ఆయోగ్ చర్చల అనంతరం మద్దతు ధర అమలు కోసం యంత్రాంగాన్ని రూపొందిస్తాం. జిల్లాలను క్లస్టర్లుగా విభజించి సమీకృత వ్యవసాయ విధానాన్ని అమలు చేయబోతున్నాం. రైతు సంఘాలను ఏర్పాటు చేసి, సాగుకు సంబంధించిన అన్ని వివరాలను చేరవేస్తాం. దేశవ్యాప్తంగా 22 వేల గ్రామీణ అగ్రి కల్చరల్ సెంటర్లను ఏర్పాటుచేయనున్నాం. కేంద్ర వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నడిచే ఈ సెంటర్లను వాణిజ్య శాఖకు అనుసంధానం చేస్తాం. మొత్తం 2వేల కోట్ల మూలధనంతో ఈ అగ్రి మార్కెట్లను ప్రారంభించనున్నాం. పండ్లు, కూరగాయల రైతుల ప్రయోజనాల కోసం రూ.500 కోట్లతో ‘ఆపరేషన్ గ్రీన్స్’ పథకం ప్రారంభించాం. మత్స్య, పాడి రైతులకు కూడా కిసాన్ క్రెడిట్ కార్డులు అందజేసి, స్వల్ప కాలిక రుణాలు ఇస్తాం. గ్రామీణ ప్రాంతంలో పెద్ద ఎత్తున రోడ్ల నిర్మాణాన్ని చేపడతాం. తద్వారా పంట ధాన్యాల రవాణా వేగవంతమై, రైతుకు మేలు జరుగుతుంది. ‘ఆయుష్మాన్‌భవః’ పథకం కింద ఒక్కో పేద కుటుంబానికి రూ.5లక్షల వరకు హెల్త్ కవరేజి ఇస్తాం. రూ.330 చెల్లిస్తే కుటుంబానికి ఆరోగ్య బీమా అందిస్తాం’ అని మోదీ చెప్పారు.