పోలీసుల ట్వీట్‌.. చిన్మయి హర్షం!

Chinmayi Says He Is In Jail Over Man Arrested For Harassing Women - Sakshi

అమ్మాయిలతో స్నేహం పెంచుకుని యువకుడి మోసం

ప్రైవేటు ఫొటోలతో బ్లాక్‌మెయిలింగ్‌కు దిగిన వైనం

అరెస్టు చేసిన పోలీసులు

చెన్నై: అనేక ఫిర్యాదుల అనంతరం కాశి అనే వ్యక్తిపై పోలీసులు చర్యలు తీసుకున్నారని ప్రముఖ సింగర్‌ చిన్మయి శ్రీపాద హర్షం వ్యక్తం చేశారు. మహిళలను వేధించినందుకు ఆఖరికి అతడు జైలు పాలయ్యాడని పేర్కొన్నారు. కన్యాకుమారి జిల్లాకు చెందిన కాసి అలియాస్‌ సుజి అనే వ్యక్తి ఫిట్‌నెస్‌ ట్రైనర్‌గా పనిచేస్తున్నాడు. ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌ తదితర సోషల్‌ మీడియా యాప్‌లలో యాక్టివ్‌గా ఉండే అతడు ఎప్పటికప్పుడు తన కొత్త ఫొటోలను అప్‌లోడ్‌ చేసేవాడు. ఈ క్రమంలో సంపన్న వర్గాలకు చెందిన అమ్మాయిల ప్రొఫైల్స్‌ గుర్తించి వారికి రిక్వెస్ట్‌ పంపేవాడు. అనంతరం వారితో చాటింగ్‌ చేస్తూ పరిచయాన్ని స్నేహంగా మార్చుకునేవాడు. ఆ తర్వాత వ్యక్తిగతంగా కలిసి సన్నిహితంగా మెలిగేవాడు. 

ఈ క్రమంలో వారికి తెలియకుండా ఫొటోలు, వీడియోలు తీయించేవాడు. వారితో చేసిన చాటింగ్‌, వీడియో కాల్స్‌ తాలూకు స్క్రీన్‌షాట్స్‌ కూడా సేవ్‌ చేసుకునేవాడు. కొన్ని రోజుల పాటు ఇలా స్నేహం కొనసాగించిన తర్వాత తన ఆరోగ్యం బాగా లేదంటూ డబ్బు కావాలని కోరేవాడు. కొంతమంది అతడి మాటలు నమ్మి పెద్దమొత్తంలో ముట్టజెప్పారు. అయితే మరికొంత మంది మాత్రం డబ్బులేదని చెప్పడంతో వారి ప్రైవేటు ఫొటోలు, వీడియోలు సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తానంటూ బ్లాక్‌మెయిలింగ్‌కు దిగేవాడు. అతడి ఆగడాలు ఎక్కువవడంతో కొంతమంది అమ్మాయిలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనంతరం సామాజిక మాధ్యమాల్లో అతడి గురించి సమాచారాన్ని పోస్ట్‌ చేశారు.

ఈ విషయం చిన్మయి దృష్టికి రావడంతో ఆమె పోలీసులను ట్యాగ్‌ చేస్తూ ట్వీట్‌ చేశారు. ఈ నేపథ్యంలో శనివారం కాశిని అరెస్టు చేసిన కన్యాకుమారి పోలీసులు.. అతడి మోడస్‌ ఆపరాండి గురించి వివరిస్తూ ట్విటర్‌లో పత్రికా ప్రకటనను షేర్‌ చేసి చిన్మయిని ట్యాగ్‌ చేశారు. ఫేక్‌ ఐడీలతో కాశి ఇదంతా చేశాడని.. ఇంకెవరైనా బాధితులు ఉంటే ధైర్యంగా ముందుకు వచ్చి ఫిర్యాదు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఎవరినీ గుడ్డిగా నమ్మకూడదని.. వ్యక్తిగత ఫొటోలు, వీడియోలు షేర్‌ చేయవద్దని హెచ్చరించారు. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top