యూట్యూబ్‌ మొట్టమొదటి వీడియో ఎవరిదంటే!

YouTube First Video Was From A Zoo Have A Look - Sakshi

'సోషల్‌ మీడియాలో ఆన్‌లైన్‌ వీడియో షేరింగ్‌ ప్లాట్‌ఫాం యూట్యూబ్‌ది ప్రత్యేక స్థానం. దాదాపు 2 బిలియన్‌ మంది యూజర్లు కలిగి ఉన్న ఈ యాప్‌కు నెటిజన్లలో క్రేజ్‌ ఏపాటిదో అందరికీ తెలిసిందే. ఇంటర్నెట్‌ వినియోగంలో దాదాపు మూడు వంతుల డేటా యూట్యూబ్‌ వీడియోల వీక్షణకే ఖర్చవుతుందట. అంతేగాక 2020 నాటికి ఇంటర్నెట్‌ యూజర్లలో దాదాపు 79 శాతం మంది సొంతంగా యూట్యూబ్‌ చానల్స్‌ కలిగి ఉన్నారని తాజా గణాంకాలు వెల్లడిస్తున్నాయి. వీరిలో అనేక మంది సెలబ్రిటీలు కూడా ఉండటం విశేషం. ఇక గూగుల్‌, ఫేస్‌బుక్‌ తర్వాత అంతటి విశేషాదరణ పొందిన యూట్యూబ్‌ ద్వారా చిన్న పిల్లల నుంచి పండు ముసలి దాకా ఎంతోమంది సెలబ్రిటీలుగా మారారన్న సంగతి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.(90 ఏళ్ల బామ్మ.. 39 ఏళ్లుగా వీడియో గేమ్స్‌ )

మొదటి వీడియో అదే..
యూట్యూబ్‌లో రోజూ మనం ఎన్నో వీడియోలు చూస్తుంటాం. మనకిష్టమైన యూట్యూబర్ల వ్లోగ్స్‌ చూస్తూ కాలక్షేపం చేస్తుంటాం. అయితే మొట్టమొదటి సారిగా యూట్యూబ్‌లో అప్‌లోడ్‌ అయిన వీడియో  ఎప్పుడు... ఎక్కడ రూపొందించారో తెలుసా?!.. 2005, ఏప్రిల్‌ 24న ‘మీ ఎట్‌ జూ’ అంటూ ఓ బాలుడు ఏనుగుల గురించి చెబుతూ వ్లోగ్‌ చేశాడు. 18 సెకన్ల నిడివి కలిగి ఉన్న ఈ వీడియోలో సాన్‌ డియాగోకు చెందిన బాలుడు.. ‘‘ మనం ఇప్పుడు ఏనుగుల ముందు ఉన్నాం. వీటి గురించిన అత్యంత మంచి విషయమేమిటంటే... ఇవి నిజంగా పొడవాటి తొండం కలిగి ఉంటాయి.. దట్స్‌ కూల్‌’’ అంటూ చెప్పుకొచ్చాడు. ఈ వీడియోను ఇప్పటి వరకు 9.7 కోట్ల మంది వీక్షించగా.. 63 లక్షల మంది కామెంట్ల రూపంలో అభిప్రాయాలు పంచుకున్నారు. 3.3 లక్షల మంది లైక్‌ కొట్టారు. (ట్రంపొకరు కిమ్మొకరు)

కాగా ఫిబ్రవరి 14, 2005లో స్టీవ్‌ చెన్‌, చాద్‌ హర్లే, జావేద్‌ కరీం యూట్యూబ్‌ను ఆవిష్కరించారు. 2006 నవంబరులో సెర్చింజన్‌ దిగ్గజం గూగుల్‌ దీనిని 1.65 బిలియన్‌ డాలర్లు వెచ్చించి సొంతం చేసుకుంది. దీని ప్రధాన కార్యాలయం కాలిఫోర్నియాలో ఉంది. దాదాపు వంద దేశాల్లో యూజర్లను కలిగి ఉన్న యూట్యూబ్‌ 80 భిన్న భాషల్లో వీడియోలను అందుబాటులో ఉంచుతోంది. ఎంతోమంది కంటెంట్‌ రైటర్లకు ఉపాధి కల్పించడంతో పాటుగా.. నెటిజన్లకు కావాల్సిన విజ్ఞానాన్ని, వినోదాన్ని అందిస్తోంది. నాణేనికి రెండో వైపు ఉన్నట్లుగానే.. కొంతమంది మాత్రం అనైతిక కార్యకలాపాలు, పబ్లిసిటీ కోసం వివిధ వీడియోలు రూపొందించి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top