
‘కోడ్స్’తో కొడతారు!
కొత్త ప్రదేశానికి వెళ్లాలంటేనే ఒక విధమైన బెరుకు. అక్కడి భాష, యాస ఇతరత్రా అన్నీ కొత్తగానే ఉంటాయి.
- మహారాష్ట్రలోని ఆటో, క్యాబ్ డ్రైవర్ల ప్లానింగ్
- సంకేత పదాలతో ‘టార్గెట్స్’ ఎంపిక
- గుర్తించకుంటే దుండగుల బారిన పడ్డట్టే!
- అనూహ్య కేసు దర్యాప్తులో వెలుగులోకి
- ఒంటరిగా, తొలిసారి వెళ్లేవాళ్లు జాగ్రత్త: పోలీసుల సూచన
సాక్షి, సిటీబ్యూరో: కొత్త ప్రదేశానికి వెళ్లాలంటేనే ఒక విధమైన బెరుకు. అక్కడి భాష, యాస ఇతరత్రా అన్నీ కొత్తగానే ఉంటాయి. ఒకవేళ మీరు మహారాష్ట్రలోని పట్టణాలకు తొలిసారి వెళ్తున్నా, అక్కడి క్యాబ్/ఆటోల్లో ఎక్కాలన్నా మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. ‘అక్కడి బస్సు, రైల్వే స్టేషన్లలో దిగగానే మీ చుట్టూ మూగిన డ్రైవర్ల నోటి వెంట ‘బెటర్’, ‘మాంగ్లో’, ‘జీపీఎల్’ వంటి కొత్త పదాలు వినిపిస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ వారి వాహనాల్లోకి ఒంటరిగా ఎక్కకండి. సదరు డ్రైవర్లు నిలువు దోపిడీకో, మోసగించడానికో పథకం పన్నారని గుర్తుంచుకోండి. మహిళలు, యువతులు మరింత అప్రమత్తంగా ఉండాలి’ అని పోలీసులు సూచిస్తున్నారు. ముంబైలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ హత్యకు గురైన నేపథ్యంలో ఒంటరిగా మహారాష్ట్రలోని పట్టణాలకు వెళ్లాలంటేనే ఒకటికి రెండుసార్లు ఆలోచించాల్సిన పరిస్థితి నెలకొంది. అసలీ ‘కోడ్స్’ ఏమిటి? అవి ఎందుకు?.. చదవండి మీకే తెలుస్తుంది.
అనూహ్య కేసు దర్యాప్తులో వెలుగులోకి..
ముంబైలోని టీసీఎస్‌లో పనిచేస్తున్న సాఫ్ట్‌వేర్ ఇంజనీర్, మచిలీపట్నం వాసి అనూహ్య అక్కడి కుందూర్ మార్గ్-భాందూప్ మధ్య దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. ఈ నెల 5న, ఉదయం 4.55 గంటలకు కుర్లాలోని లోకమాన్య తిలక్ టెర్మినల్ (ఎల్‌టీటీ) స్టేషన్‌లో రైలు దిగిన ఆమె ఆ తరవాత అదృశ్యమైంది. కొన్ని రోజుల తరవాత ఆమె మృతదేహం బయటపడింది.
ఈ ఘాతుకం ఎల్‌టీటీ పరిసరాల్లో ఉండే ఆటో/క్యాబ్ డ్రైవర్ల పనిగా అనుమానాలు వ్యక్తమయ్యాయి. ముంబై క్రైమ్‌బ్రాంచ్ అధికారుల దర్యాప్తులో ‘కోడింగ్’ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. సంకేత పదాల ద్వారా ప్రయాణికులకు అర్థం కాకుండా ఒకరితో మరొకరు సంప్రదించుకుంటున్న డ్రైవర్లు టార్గెట్స్‌ను ఎంపిక చేసుకుని పంజా విసురుతున్నారని గుర్తించామని అధికారులు చెబుతున్నారు.
ఇలా చేయడం ఉత్తమం
ఈ తరహా పదాలు, ముఠాలు మహారాష్ట్రలో చాలా ఉన్నాయని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ప్రయాణ సందర్భంలో వారికి ఎదురు తిరిగినా, ప్రతిఘటించినా దాడులకు వెనుకాడరు. ఒంటరిగా, తొలిసారి ఆయా ప్రాంతాలకు వెళ్లే వారు కొన్ని కనీస జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు.
కొత్తగా, ఒంటరిగా ఆయా ప్రాంతాలకు వెళ్లే వారు వాహనాలను అద్దెకు తీసుకోరాదు. రాత్రి, తెల్లవారుజాము వేళల్లో మరింత జాగ్రత్తగా ఉండాలి
వీలున్నంత వరకు ప్రీపెయిడ్ సర్వీస్‌ను వినియోగించుకోవాలి. ఎక్కే వాహనం రిజిస్ట్రేషన్ నెంబర్, డ్రైవర్ పేరు, ఇతర వివరాలను బంధువులు, స్నేహితులకు ఫోన్‌చేసి చెప్పాలి. ఇది డ్రైవర్‌కు తెలిసేలా చేయాలి
ప్రీపెయిడ్ సేవలు అందుబాటులో లేకుంటే తోటి ప్రయాణికుల్ని సంప్రదించి, వారితో కలిసే వాహనంలో ప్రయాణించాలి. అలాకాని పక్షంలో వాహనాన్ని మాట్లాడుకునేందుకు పోలీసుల సహకారం తీసుకోవాలి
అక్కడకు వెళ్లగానే రిసీవ్ చేసుకునేందుకు అక్కడ నివసిస్తున్న బంధువులు, స్నేహితులు, పరిచయస్తుల్ని రమ్మని కోరాలి. మహిళలు/యువతులు ఈ విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి
బెటర్
ప్లాట్‌ఫామ్ వద్ద రైలు ఆగగానే అప్పటికే అక్కడకు చేరుకునే ‘డ్రైవర్ ముఠా’ సభ్యుడు ఒంటరిగా రైలు దిగుతున్న, ముఖ్యంగా మహిళలు, యువతుల్ని గుర్తిస్తాడు. వారు బయటకొచ్చి ఆటో/క్యాబ్ కోసం ప్రయత్నిస్తున్న సమయంలో, వారు ఒంటరిగా వచ్చారని తెలిపేందుకు ముఠా సభ్యుడు మిగిలిన వారికి ‘బెటర్’ అంటూ సమాచారమిచ్చి టార్గెట్ చేయాలని సూచిస్తాడు.
మాంగ్‌లో
ప్రయాణికుల ఆహార్యం, ప్రవర్తనను బట్టి వారికి మహారాష్ట్రతో పరిచయం ఉందా? లేదా? అనేది ఇట్టే గుర్తుపట్టేస్తారు. తొలిసారి వచ్చిన వారైతే మోసం చేయడం తేలిక కావడంతో ఆ విషయాన్ని ఇతర ముఠా సభ్యులకు తెలిపేందుకు వారికి వినిపించేలా ‘మాంగ్‌లో’ పదాన్ని ప్రయోగిస్తాడు.
జీపీఎల్
మార్గమధ్యంలో మోసం చేయడానికి అనువుగా తయారు చేసుకున్న పదం ‘జీపీఎల్’. ప్రయాణికుడు ప్రీపెయిడ్ వాహనం తీసుకున్నా, ముందే కిరాయి చెల్లించినా అతడిని ఎక్కించుకునే ముఠా సభ్యుడు మరొకరితో ‘జీపీఎల్’ అంటాడు. అంటే తన వాహనాన్ని అనుసరించాలని అర్థం. మధ్యలో బ్రేక్‌డౌన్ పేరుతో ప్రయాణికుడిని దించేసిన తరువాత ఎక్కువ మొత్తం డిమాండ్ చేస్తూ ఎక్కించుకోమని అర్థం.