వడదెబ్బకు ప్రజలు పిట్లల్లా రాలుతున్నారు. కేవలం నాలుగు రోజుల వ్యవధిలోనే రాష్ట్రంలో 45 మంది మృత్యువాత పడినట్లు తెలంగాణ విపత్తు నిర్వహణశాఖ వెల్లడించింది.
-సర్కారుకు విపత్తు నిర్వహణశాఖ నివేదిక
-అత్యధికంగా నల్లగొండ జిల్లాలో 18 మంది
-వడగాల్పుల కార్యాచరణ ప్రణాళిక అమలులో వైఫల్యం
-మూడు జిల్లాలు మినహాయిస్తే ఎక్కడా పట్టించుకోని వైనం
హైదరాబాద్ : వడదెబ్బకు ప్రజలు పిట్లల్లా రాలుతున్నారు. కేవలం నాలుగు రోజుల వ్యవధిలోనే రాష్ట్రంలో 45 మంది మృత్యువాత పడినట్లు తెలంగాణ విపత్తు నిర్వహణశాఖ వెల్లడించింది. ఈ మేరకు ప్రాథమిక నివేదికను ప్రభుత్వానికి పంపించినట్లు తెలిసింది. ఈ నెల 24 నుంచి 27వ తేదీల్లో ఈ వడదెబ్బ మృతులు సంభవించాయి. అందులో అత్యధికంగా నల్లగొండ జిల్లాలో 18 మంది, కరీంనగర్ జిల్లాలో 9 మంది చనిపోయారు. మహబూబ్‌నగర్ జిల్లాలో ఆరుగురు, వరంగల్ జిల్లాలో ఐదుగురు, ఖమ్మం జిల్లాలో నలుగురు మృతిచెందారు. మార్చి నెలలోనే అసాధారణ ఎండలు ఉండటంతో ఈ పరిస్థితి తలెత్తింది. ఈ నాలుగు రోజుల వ్యవధిలో రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల నుంచి 47 డిగ్రీలకు మించి చేరడంతో వడదెబ్బ మరణాలు సంభవించినట్లు అధికారులు అంచనా వేశారు. రాబోయే ఏప్రిల్, మే నెలల్లో ఉష్ణోగ్రతలు 50 డిగ్రీల వరకు చేరుకునే అవకాశాలున్నాయని వాతావరణశాఖ హెచ్చరిస్తోంది. ఈ నేపథ్యంలో వడదెబ్బ నుంచి ప్రజలను రక్షించాల్సిన అవసరం ఉంది.
వడగాల్పుల కార్యాచరణ ప్రణాళిక అమలేదీ?
వడదెబ్బ నుంచి ప్రజలను రక్షించేందుకు విపత్తు నిర్వహణ శాఖ జారీచేసిన వడగాల్పుల కార్యాచరణ ప్రణాళికను అమలు చేయడంలో వైఫల్యం కారణంగానే ఇంతమంది చనిపోయారని సమాచారం. ఇప్పటికీ మూడు జిల్లాలు మినహా మిగిలిన జిల్లాలు వడగాల్పులపై కార్యాచరణ ప్రణాళిక అమలుకు కసరత్తు చేయలేదని తెలిసింది. ఖమ్మం, వరంగల్, నల్లగొండ జిల్లాల కలె క్టర్లే ప్రణాళిక అమలుకు కార్యాచరణ సిద్ధం చేసి... సంబంధిత నివేదికను రాష్ట్ర విపత్తు నిర్వహణ శాఖకు పంపినట్లు సమాచారం. వడగాల్పులపై వాతావరణశాఖ హెచ్చరిస్తున్నా పట్టించుకోకపోవడంపై ఆరోపణలున్నాయి. వరంగల్ జిల్లా కలెక్టర్ ఆ జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించి వడగాల్పు కార్యాచరణ ప్రణాళికను అమలుచేయాలని సూచించారు.
పాఠశాలల పనివేళలను సవరించారు. ఉదయం 7 గంటల నుంచి 11 గంటల వరకే నిర్వహించాలని ఆదేశించారు. విపత్తు నిర్వహణశాఖ జారీచేసిన కార్యాచరణ ప్రణాళికను తహశీల్దార్, ఎంపీడీవోల వరకు పంపించారు. సర్పంచిలు, ఎంపీటీసీ, జడ్పీటీసీలను భాగస్వామ్యం చేయాలని నిర్ణయించారు. నల్లగొండ జిల్లాలో సిటీ కేబుల్ ద్వారా, పోస్టర్లు, బ్యానర్ల ద్వారా ఎండ తీవ్రత నుంచి రక్షణకు తీసుకోవాల్సిన చర్యలపై ప్రజలకు అవగాహన కల్పించాలని నిర్ణయించారు. ఆరుబయట పనిచేసే వారికి ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు సిద్ధంగా ఉంచాలని నిర్ణయించారు. వడగాల్పుల సమయంలో మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఆర్టీసీ బస్సులను నిలిపివేయాలని నిర్ణయించారు. ఆరుబయట పాఠశాల తరగతులు నిర్వహించవద్దని సూచించారు.
నిధులేవీ?
వడగాల్పుల కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసిన సర్కారు అందుకు తగ్గట్లు నిధులను జిల్లాలకు కేటాయించలేదు. ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు, చలివేంద్రాల ఏర్పాటు, ఐవీ ప్లూయీడ్స్, ఐస్ ప్యాక్స్ తదితర అవసరమైన వాటికి నిధులను కేటాయించలేదని అంటున్నారు. కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసినంత మాత్రాన సరిపోదని, నిధులు లేకుంటే ఏమీచేయలేమని సంబంధిత శాఖ అధికారవర్గాలు చెబుతున్నాయి.