నగరంలో లిక్విడ్ పెట్రోలియం గ్యాస్ (ఎల్పీజీ) అక్రమ రీఫిల్లింగ్ దందా కుటీర పరిశ్రమను తలపిస్తోంది.
సాక్షి, సిటీబ్యూరో: నగరంలో లిక్విడ్ పెట్రోలియం గ్యాస్ (ఎల్పీజీ) అక్రమ రీఫిల్లింగ్ దందా కుటీర పరిశ్రమను తలపిస్తోంది. గుట్టుచప్పుడు కాకుండా అక్రమ గ్యాస్ వ్యాపారం మూడు పువ్వులు ఆరుకాయలుగా సాగుతోంది. అడపాదడపా స్పెషల్ ఆపరేషన్ టీం (ఎస్‌వోటీ) దాడులు, పోలీసుల కార్డన్ సర్చ్‌ల్లో అక్రమ గ్యాస్ బండారాలు బహిర్గతమవుతున్నప్పటికీ పౌర సరఫరాల శాఖ అధికారుల్లో మాత్రం చలనం లేదనే విమర్శలున్నాయి. గ్రేటర్ పరిధిలోని పౌరసరఫరాల విభాగానికి ఐఏఎస్ హోదాగల ఒక చీఫ్ రేషనింగ్ అధికారి (సీఆర్వో), ఇద్దరు జిల్లా స్థాయి పౌరసరఫరాల అధికారులు, 12 మంది సహాయ పౌరసరఫరాల అధికారులతో పాటు ప్రత్యేక విజిలెన్స్ అధికారుల పర్యవేక్షణ ఉన్నప్పటికీ సబ్సిడీ వంటగ్యాస్ పక్కదారి పట్టి మాఫియాకు కాసులు కురిపిస్తోంది.
డొమెస్టిక్ గ్యాస్‌ను కమర్షియల్ అవసరాలకు ఉపయోగించడమే మాఫియా వ్యాపారంగా మారింది. నగరం నలుమూలలా పెద్ద సంఖ్యలో గ్యాస్ రీఫిలింగ్ కే ంద్రాలు ఉండగా.. ఎనిమిది ప్రాంతాల్లో మాత్రం పెద్దఎత్తున గ్యాస్ సిలిండర్ల కేంద్రాలు నడుస్తున్నట్లు తెలుస్తోంది. నాచారం, బాలానగర్, మూసాపేట, బోరబండ, ఎల్‌బీ నగర్, సింగరేణి కాలనీ, మారేడుపల్లి, సంతోషన్‌గర్ తదితర ప్రాంతాల్లో అక్రమ రీఫిల్లింగ్ కేంద్రాలకు అడ్డూ అదుపు లేకుండా పోయింది.
వంట గ్యాస్ పక్కదారి
డొమెస్టిక్ వంటగ్యాస్ కంటే కమర్షియల్, వాహనాల్లో నింపే గ్యాస్ ధర అధికంగా ఉండడంతో అక్రమ వ్యాపారానికి డిమాండ్ పెరిగింది. కొందరు వ్యాపారులు ఎల్పీజీ డీలర్ల అండదండలతో అక్రమ గ్యాస్ రీఫిల్లింగ్‌కు తెరలేపి సొమ్ము చేసుకుంటున్నారు. ప్రస్తుతం డొమెస్టిక్ సిలిండర్లకు ఆధార్ అనుసంధానం, ఏడాదికి పన్నెండు సబ్సిడీ సిలిండర్ల సరఫరా పరిమితితో గ్యాస్‌కు బాగా డిమాండ్ పెరిగింది. దీన్ని ఆసరాగా చేసుకొని డీలర్లు వ్యాపారులతో కుమ్మక్కై వంటగ్యాస్ సిలిండర్లను పక్కదారి పట్టిస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు వాహనాలు, చిన్న ఐదు కిలోల ప్రయివేటు సిలిండర్లల్లో సైతం అక్రమ రీఫిల్లింగ్ చేస్తున్నారు.
చిన్న సిలిండర్లలో..
మహానగరానికి ఉద్యోగం, చదువుల రీత్యా వలస వచ్చే బ్యాచిలర్స్, విద్యార్థులు అధికంగా ఐదు కిలోల చిన్న సిలిండర్లు వినియోగిస్తారు. వీరికి అధికారికంగా గ్యాస్ కనెక్షన్లు లేని కారణంగా బ్లాక్‌లోనే గ్యాస్ రీఫిల్లింగ్ చేయించడం తప్పదు. దీనిని అదునుగా తీసుకున్న కొందరు వ్యాపారులు గ్యాస్ పరికరాల దుకాణాల వుుసుగులో రీఫిల్లింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసి అక్రమ దందా కొనసాగిస్తున్నారు. రీఫిల్లింగ్ సందర్భంగా ప్రమాదాలు చోటుచేసుకుంటున్న సంఘటనలు కూడా లేకపోలేదు.గతంలో కంచన్‌బాగ్, కుషాయిగూడ, విజయనగర్ కాలనీల్లోని రీఫిల్లింగ్ కేంద్రంలో ప్రమాదాలు చోటుచేసుకున్న సంఘటనలు విదితమే.
వందకు పైగా రీఫిల్లింగ్ కేంద్రాలు
నగరంలో వందకు పైగానే అక్రమ రీఫిలింగ్ కేంద్రాలు ఉన్నట్లు సమాచారం. ఈ కేంద్రాల్లో కిలో గ్యాస్‌కు రూ.100 నుంచి 120లు తీసుకుని రీఫిల్ చేస్తున్నారు. మూడు, నాలుగు చక్రాల వాహనదారులు సైతం 35 శాతం వరకు వంట గ్యాస్‌ను వినియోగిస్తున్నారు. వారికి రెండు రోజులకు ఒకసారి గ్యాస్ అవసరర కావడంతో అక్రమ వ్యాపారానికి డిమాండ్ పెరిగింది.
మొక్కుబడి దాడులు...
వంటగ్యాస్ అక్రమ రీఫిల్లింగ్‌పై పౌరసరఫరాల శాఖ దాడులు మొక్కుబడిగా మారాయి. సైబరాబాద్ ఎస్‌వోటీ పోలీసులు ఇటీవల నగర శివారులోని నాచారం సింగం చెరువు తండా సమీపంలోని ఒక కేంద్రంపై దాడులు నిర్వహించి అక్రమ గ్యాస్ రీఫిల్లింగ్‌ను బట్టబయలు చేశారు. సుమారు 63 డొమెస్టిక్, 55 కమర్షియల్ సిలిండర్లను సీజ్ చేయడమే కాకుండా 60 రీఫిల్లింగ్ రాడ్స్, తూనికల పరికరాలను సీజ్ చేశారు. కానీ, వంటగ్యాస్ పంపిణీ వ్యవహారాలను నిరంతరం అధికారికంగా పర్యవేక్షించాల్సిన ఫౌరసరఫరాల శాఖ మాత్రం కనీసం పట్టనట్లు వ్యవహరించడం విస్మయానికి గురిచేస్తోంది. ఫిర్యాదులు వస్తే కానీ శాఖాధికారుల్లో చలనం కలగడం లేదు.
నగర ంలో ఎల్పీజీ గ్యాస్ పరిస్థితి ఇదీ...
ఎల్పీజీ సిలిండర్ ప్రభుత్వ ధర అక్రమ రీ ఫిల్లింగ్
కేంద్రాల్లో ధర
14.2 కిలోల డొమెస్టిక్ రూ. 681.00 రూ. 9,50.00
19 కిలోల కమర్షియల్ రూ. 1318.50 రూ.15,00.00
5 కిలోల డొమెస్టిక్ రూ.364.50 రూ. 5,50.00
పోలీసులు నమోదు చేసిన కేసులు
2013 2014
నమోదైన కేసులు 16 141
పట్టుబడ్డ నిందితులు 36 191
సబ్సిడీ సిలిండర్లు 331 986
చిన్న సిలిండర్లు 403 1241
ప్రాపర్టీ సీజ్ రూ.1.43 లక్షలు రూ.18 లక్షలు