ఇంగ్లిష్‌లో చదివితే మాతృభాష మరుస్తారా?

Ilapavuluri Murali Mohana Rao Article On Importance Of English Medium - Sakshi

సందర్భం

ఒకప్పుడు తెలుగులో శుద్ధ గ్రాంథికం ఉండేది. పండితులు, విద్యావంతులు మాట్లాడినా, రచనలు చేసినా, గ్రాంథికమే రాజ్యమేలుతుండేది.  ఒకసారి పానుగంటి లక్ష్మీనరసింహారావు వారి సాక్షి వ్యాసాలు, కందుకూరి వీరేశలింగం గారి ప్రహసనాలు, నాటక రచనలు చదివితే నాటి భాష నారికేళపాకంలా ఉండేదని బోధపడుతుంది. గిడుగు రామమూర్తి, త్రిపురనేని రామస్వామిచౌదరి లాంటి సంస్కరణవాదుల పుణ్యమా అని గ్రాంథికం స్థానంలో వ్యావహారిక భాష పురుడుపోసుకుని అభివృద్ధి చెందింది. ఇవాళ మనం మాట్లాడుకునేది, రాసేది అంతా వాడుకభాషగా, వ్యావహారికభాషగా చెప్పుకుంటున్నారు. భాషా సంస్కరణవాదులు తెలుగు భాషను సరళీకరించే సమయంలో, కొందరు గ్రాంథికభాషాభిమానులు స్వచ్ఛమైన తెలుగుభాషను చంపేస్తున్నారని నిరసనలు వ్యక్తం చేశారు.

సుమారు పాతికేళ్ల క్రితం దేశంలో ఆర్థిక సంస్కరణలకు తెరతీసింది పీవీ నరసింహారావు ప్రభుత్వం.  విదేశీ కంపెనీలు, పెట్టుబడులు వెల్లువలా వచ్చాయి. అప్పటివరకు ఒక ద్విచక్రవాహనం కొనాలంటే ఆరు మాసాలు ముందుగా బుక్‌ చేసుకోవాల్చి వచ్చేది.  బేగంపేట్‌ విమానాశ్రయానికో, లేదా బజాజ్‌ వారి షోరూంకో వెళ్లి స్కూటర్‌ తీసుకుని  వస్తే దాన్నో ఘనవిజయంగా భావించేవారు. మరి ఇప్పుడో? పాతిక లక్షల రూపాయల కారు కావాలన్నా, అలా వెళ్లి గంటలో ఇలా తెచ్చుకోవచ్చు. ఎంత ఖరీదైన వస్తువులైనా అంగట్లో  కూరగాయలు లభించినంత సులభంగా లభిస్తున్నాయి.

అంతకు కొద్దిగా ముందు రాజీవ్‌ గాంధీ పాలనలో కంప్యూటర్లు వచ్చాయి. పదిమంది ఉద్యోగులు ఒక రోజులో చేసేపని కంప్యూటర్‌ ద్వారా చిటికెలో చెయ్యడం సాధ్యమైంది. అప్పటివరకు కేవలం టైపు రైటర్‌ మీద మాత్రమే పని చెయ్యగల ఉద్యోగులు కంప్యూటర్‌ రాకతో హడలిపోయారు. ఇక తమ ఉద్యోగాలు పోతాయేమో అని భయపడిపోయారు. కంప్యూటర్‌ మీద పని చెయ్యడమంటే కత్తిమీద సాము అనుకున్నారు. అలాంటిది ఈ రోజు ఎలా ఉన్నది? ఇవాళ కంప్యూటర్‌ లేని ఇల్లు లేదంటే అతిశయోక్తి కాదు. ఎనభై ఏళ్ల వృద్ధులు కూడా ఇంట్లో కూర్చుని కంప్యూటర్ల మీద తాంబూలం వేసుకున్నంత సులభంగా పనిచేస్తున్నారు. ల్యాప్‌టాప్‌లు కూడా సంచిలో వేసుకుని బస్సుల్లో, రైళ్లలో, విమానాల్లో కూడా ప్రయాణాలు చేస్తూ పనులు చేసుకుంటున్నారు.  

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పేద పిల్లలను కూడా సంపన్నులు మాత్రమే చదువుకోగల కార్పొరేట్‌ పాఠశాలల మాదిరిగా ఆంగ్ల మాధ్యమంలో విద్య అభ్యసింపజేసి వారి జీవితాల్లో కూడా వెలుగులు నింపాలనే ఆలోచనతో వచ్చే ఏడాదినుంచి మొదలుపెట్టాలని ఒక కొత్త సంస్కరణకు జీవం పోశారు. దాన్ని హృదయపూర్వకంగా స్వాగతించాల్సింది పోయి, ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్లం బోధిస్తే తెలుగు భాష మృతభాష అయిపోతుంది అని గగ్గోలు పెట్టడం విచిత్రంగా ఉన్నది. దాదాపు ఎనభై మూడు శాతం మంది విద్యార్థులు గత పాతికేళ్లుగా ప్రైవేట్‌ పాఠశాలల్లోనే ఇంగ్లిష్‌లో చదువుతున్నారు. మరి అప్పుడు మరణించని తెలుగు, కేవలం పదిహేడు శాతం మంది చదివే ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్‌ బోధిస్తే అస్తమిస్తుందా?  పోనీ, ఇప్పుడు తెలుగుభాషకు వీరంగాలు వేసే ఘరానా పెద్దలంతా తమ పిల్లలను, మనుమలను తెలుగు మాధ్యమంలో చదివిస్తున్నారా? వారంతా లక్షల ఫీజులు చెల్లిస్తూ తమ పిల్లలను ఇంగ్లిష్‌ మాధ్యమంలో చదివిస్తారు. పేదపిల్లలు, బడుగు బలహీనవర్గాల వారి పిల్లలు ఇంగ్లిష్‌లో చదువుతామంటే పెడబొబ్బలు పెడతారు.  
ప్రపంచం ఒక కుగ్రామమైపోయింది. బతు కుతెరువు కోసం దేశాంతరాలు వెళ్లాల్సిన పరిస్థితులు వచ్చాయి. ఇలాంటి పరిస్థితుల్లో కూడా ఇంకా ఉద్యోగాలకు భరోసా ఇవ్వని మాధ్యమంలో చదివి బిచ్చమెత్తాలా ఏమిటి? ఇంగ్లిష్‌లో చదివి నంత మాత్రాన మాతృభాషను మరచిపోతారా?  ఇప్పుడు అమెరికాలో, రష్యాలో, చైనాలో బతుకుతున్నవారంతా తెలుగును మర్చిపోయారా? కాలంతో పాటు మార్పును ఆహ్వానించలేని చాదస్తం, జగన్‌ మీద చెప్పరాని ద్వేషం తప్ప ఈ ఛాందసవాదుల్లో ఏమైనా విజ్ఞత కనిపిస్తున్నదా? నూతిలోని కప్పలు సూర్యోదయాన్ని చూడలేవు అన్నట్లున్నది వీరి వరుస! 


ఇలపావులూరి మురళీమోహనరావు
(వ్యాసకర్త సీనియర్‌ రాజకీయ విశ్లేషకులు)

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top