
వాయు కాలుష్యం వల్ల వాటిల్లే శారీరక అనర్థాలు అందరికీ తెలిసినవే. వాయు కాలుష్యం మితిమీరిన ప్రాంతాల్లో నివాసం ఉండేవారిలో ఉబ్బసం, నిమోనియా వంటి శ్వాసకోశ రుగ్మతలు, ఊపిరితిత్తుల క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులు సోకే అవకాశాలు ఉంటాయని ఇప్పటికే పలు పరిశోధనలు రుజువు చేశాయి. వాయు కాలుష్యం మానసిక సమస్యలకు కూడా దారితీస్తుందని ఇటీవల ఒక తాజా పరిశోధన నిగ్గు తేల్చింది.
వాయు కాలుష్యం అధికంగా ఉండే ప్రాంతాల్లో నివసించే టీనేజర్లలో కోపాన్ని అదుపు చేసుకోలేని అసహనం, చిరాకు, దురుసు ప్రవర్తన ఎక్కువగా కనిపిస్తున్నట్లు అమెరికన్ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. సౌత్ కాలిఫోర్నియా వర్సిటీలోని కెక్ స్కూల్ ఆఫ్ మెడిసిన్‌కు చెందిన శాస్త్రవేత్తలు 682 మంది టీనేజర్లపై అధ్యయనం జరిపి ఈ విషయాన్ని నిర్ధారణ చేశారు.
వాయుకాలుష్యం వల్ల మెదడు కణజాలంలో సూక్ష్మమైన వాపు ఏర్పడుతుందని, దీని ప్రభావానికి గురైన వారి ప్రవర్తనలో అసహజమైన మార్పులు కనిపిస్తాయని వారు చెబుతున్నారు. పిల్లల్లో అకస్మాత్తుగా దురుసు ప్రవర్తన కనిపించినట్లయితే, వారిని కాలుష్యానికి దూరంగా కొన్నాళ్లు ఉంచితే వారి పరిస్థితి మెరుగుపడుతుందని వారు పేర్కొన్నారు. కాలిఫోర్నియా శాస్త్రవేత్తలు తమ పరిశోధన వివరాలను ‘అబ్నార్మల్ సైకాలజీ’ జర్నల్‌లో ప్రచురించారు.