ఇదీ నా కథ | Kamala Das My Story Book | Sakshi
Sakshi News home page

ఇదీ నా కథ

Nov 12 2018 1:33 AM | Updated on Nov 12 2018 1:33 AM

Kamala Das My Story Book - Sakshi

మధ్య తరగతి కుటుంబాల్లోని మహిళలకు సుఖం గగనమనీ, వారికి శయ్యాగృహాలే శిలువలనీ, భర్తలు కేవలం కామదాహంతో వారిని వాడుకొంటారే కానీ పిసరంత ప్రేమ కూడా చూపరనీ, ప్రేమ వారికి ఎండమావిలా మిగిలిపోయి ఆ వెతుకులాటలోనే వారి జీవితాలు ముగిసిపోతాయనీ తన ఆత్మకథ ‘మై స్టోరీ’లో ఆవేదనతో తన అభిప్రాయాల్ని వెలిబుచ్చారు ప్రఖ్యాత మలయాళ రచయిత్రి కమలాదాస్‌. మై స్టోరీలో 50 శీర్షికల్లో ఆమె తన అనుభవాల్ని వివరించారు. మధ్యతరగతి స్త్రీ తన బాధల్ని మౌనంగా భరిస్తుందనీ, ఆమె లోలోపల పడుతున్న వేదన ఎవరికీ కనిపించదని పేర్కొన్నారు. కమల 1934 మార్చి 31న కేరళలో జన్మించారు. తల్లి బాలామణియమ్మ స్వయంగా రచయిత్రి కావడం వల్ల కూతురి రచనా వ్యాసంగాన్ని ప్రోత్సహించారు. కమలకు 13వ ఏట మాధవదాస్‌తో వివాహం జరిగింది. కేవలం ఆరవ తరగతి వరకే చదివిన కమలాదాస్‌ ఇంటి వద్దే చదివిన ఆంగ్లంలోనూ, మలయాళంలోనూ కథలు, కవితలు రాయగలిగే ప్రావీణ్యాన్ని సంపాదించారు. ఆమె రాసిన కథలు, కవితలు ఫ్రెంచ్, రష్యన్, స్పానిష్, జర్మన్, జపనీస్‌ భాషల్లోకి అనువదించబడ్డాయి.

స్త్రీ విమోచనకు కొత్త కోణంలో రచనలు సాగించిన కమలాదాస్‌ జీవితం కూడా ఎన్నో మలుపులు తిరిగినట్లు తెలుస్తుంది. తన పల్లె జీవితం, ఢిల్లీలో, కలకత్తాలో అనుభవాల్ని చక్కగా రాశారు. తన చిన్నతనం నుండి తాను పెరిగిన వాతావరణాన్నీ, తానూ తన తమ్ముడూ కలిసి స్నేహితుల సాయంతో నాటకశాలని నిర్మించుకొని ప్రదర్శనలిచ్చిన సంగతీ చెబుతారు. తన భర్త ‘హోమో సెక్స్‌’ గురించి దాపరికం లేకుండా చెప్పి, ఇతర పురుషులతో తన సంబంధాన్ని కూడా దాచుకోకుండా చెప్పగలిగిన ధీశాలి కమలాదాస్‌. ‘‘నేను కలకత్తా వెళ్లిన కొత్తలో బొంబాయి నుండి వచ్చిన ఓ పరిచితుడు తాను దిగిన హోటల్‌కు బ్రేక్‌ఫాస్ట్‌కు ఆహ్వానించాడు. అతను బాగా చదువుకొన్న మేధావి. అతనితో నేటి సాహిత్యం గురించీ, రకరకాల పుస్తకాల గురించీ చర్చించడం నాకెంతో సంతోషకరమైన విషయం. మా చర్చలతో సమయం కనపడలేదు. అకస్మాత్తుగా అతడు నా తొడపై చేయి వేశాడు. ఈ చర్యతో నేను అవాక్కయ్యాను.

కానీ అభ్యంతరం చెప్పలేదు. నేనతని ప్రేమలో పూర్తిగా మునిగిపోయాను. అతను నన్ను గట్టిగా కౌగిలించుకున్నాడు. ఈ విషయాన్ని నేను విపులంగా నా భర్తతో చెప్పాను. అతడు అంతా విని, తొణక్కుండా యిటువంటి వ్యక్తుల్ని ప్రేమించడంలో ఎదురయ్యే ఆపదల్ని వివరించి, నన్ను జాగ్రత్తగా ఉండాల్సిందిగా హెచ్చరించాడు. నీవు నా దృష్టిలో లోకం తెలియని పసిపాపవు’’ అన్నాడు. జీవిత పయనంలో ఎన్నో సంచలనాలు సృష్టించిన కమలాదాస్‌ తన 65వ యేట ఇస్లాం మతం పుచ్చుకుని కమలా సురయ్యాగా పేరు మార్చుకున్నారు. ‘ఆల్ఫాబెట్‌ ఆఫ్‌ లస్ట్‌’, ‘ఎ డాల్‌ ఫర్‌ ద చైల్డ్‌ ప్రాస్టిట్యూట్‌’, ‘పద్మావతి ద హాలెట్‌’, ‘ద సైరన్స్‌’, ‘సమ్మర్‌ ఇన్‌ కల్‌కటా’ లాంటివి ఆమె పుస్తకాలు. 2009 మే 31న మరణించారు.
ముడార్‌ వేణుగోపాల్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement