
పూర్వం ఒక వ్యక్తి ఉండేవాడు. చాలా మంచి మనిషి. అతనికి ఒక పండ్లతోట ఉండేది. అతను తోటలో పనిచేసే కూలీల పట్ల ఎంతో ప్రేమతో, దయతో మసలుకునే వాడు. పేదసాదలకు, బాటసారులకు పండ్లు పంచిపెట్టేవాడు. బీదాబిక్కిని ఆదుకునే వాడు. ఆ వ్యక్తికి ముగ్గురు కొడుకులు. పెద్దవాళ్ళిద్దరూ,‘నాన్నా.. మీరిలా చేతికి దానధర్మాలు చేస్తూ పోతే కొండలు కూడా కరిగిపోతాయి. ఆఖరుకు బిచ్చగాళ్ళమైపోతాం.’ అని నసుగుతూ ఉండేవారు. తండ్రి వారికి నచ్చజెబుతూ, ‘దానధర్మాలవల్ల, పరులకు సహాయం చేయడం వల్ల సంపద వృద్ధి చెందుతుందే తప్ప తరగదు. నిజానికి మన దగ్గర ఉన్నదంతా మనదికాదు.
మనం కేవలం దాని పర్యవేక్షకులం, అమానత్తుదారులం మాత్రమే. ఈ సంపదకు అసలు యజమాని కేవలం అల్లాహ్ మాత్రమే. కాబట్టి ఆయన ఆదేశాలు, హితవుల ప్రకారమే మనమీ సంపదను వినియోగించాలి. నా తదనంతరం మీరు కూడా ఇదే విధానాన్ని అవలంబించండి. మీరొకవేళ నామాటల్ని పెడచెవినపెట్టి, మీ ఇష్టానుసారం నడుచుకుంటే అల్లాహ్ ఆగ్రహించే ప్రమాదం ఉంది.’ అంటూ హితోపదేశం చేశాడు. చిన్న కుమారుడు మాత్రం మొదటినుండీ పెద్దవాళ్ళిద్దరి వైఖరిని వ్యతిరేకిస్తూనే ఉన్నాడు.
తండ్రి మరణానంతరం కొడుకుల ప్రాధమ్యాలు మారిపొయ్యాయి. పంట సమయంలో కూలీలకు చేదు అనుభవం ఎదురైంది. పేదసాదలెవరినీ చేను దరిదాపులక్కూడా రానివ్వలేదు. ‘ఇప్పుడు మనం ఇలా చేయడం సరైన పధ్ధతి కాదు. నాన్నగారు ఉన్నప్పుడు వీరందరితో ఎలా వ్యవహరించారో మనం కూడా వీళ్ళతో అలాగే వ్యవహరిద్దాం.. అందులోనే మన శ్రేయం ఇమిడి ఉంది.’ అని నచ్చజెప్పే ప్రయత్నం చేశాడు చిన్నవాడు.
మరునాడు, తోటలోని పంటనంతా తామే కోసి పంచుకోవాలనే ఉద్దేశ్యంతో చిన్నోడికి కూడా చెప్పకుండా తెల్లవారు ఝామున్నే తోటకు వెళ్ళారు. కాని అక్కడి దృశ్యాన్ని చూసి వారు నిర్ఘాంతపోయారు. నిండుపంటతో కళకళలాడుతూ ఉన్న ఆ తోట నామరూపాల్లేకుండా నాశనమైపోయి ఉంది. విషయం తెలుసుకున్న చిన్నవాడు ‘మీలోని స్వార్ధబుధ్ధి, దుర్మార్గపు ఆలోచనల వల్లనే దేవుని ఆగ్రహం విరుచుకుపడింది.
ఇప్పటికైనా చేసిన తప్పులకు పశ్చాత్తాపం చెందండి. దైవం ముందు సాగిలపడి క్షమాభిక్ష వేడుకోండి.’అని వ్యాఖ్యానించాడు. అల్లాహ్ మనకు సంపదను, ఒక బాధ్యతగా అప్పగిస్తాడు. దాన్ని మనం ఏవిధంగా వినియోగిస్తామో పరీక్షిస్తాడు. అందుకని,పేదసాదలను, అవసరార్థులను ఆదుకుంటూ దాన్ని సద్వినియోగం చేస్తే ఆయన ఇంకా అనుగ్రహిస్తాడు. లేకపోతే ఏదో ఒకరోజు దాన్ని మననుండి దూరంచేసి కఠినంగా శిక్షిస్తాడు.
– ముహమ్మద్ ఉస్మాన్ ఖాన్