విపత్తు నిర్వహణ - విజయ సూత్రాలు


ఓ విపత్తు.. పచ్చని పల్లెను ఆబగా కబళిస్తుంది! నింగికేసే నిచ్చెనలా ఠీవిగా నిలబడిన నిలువెత్తు భవనాన్ని నేలకూలుస్తుంది! భూకంపం రూపంలో బతుకులను బుగ్గి చేసేవి కొన్నయితే.. వరదల రూపంలో విరుచుకుపడి, ప్రళయం సృష్టించేవి మరికొన్ని.. ఈ నేపథ్యంలో ప్రజల బాగోగులతో ముడిపడిన విపత్తుల నిర్వహణపై పంచాయతీ కార్యదర్శికి అవగాహన అవసరం. అందుకే ఈ ఉద్యోగాల నియామకాలకు జరిగే పరీక్ష  సిలబస్‌లో విపత్తుల నిర్వహణ (Disaster Managemen్ట)ను చేర్చారు. ఇందులో అధిక మార్కుల సాధనకు వ్యూహాలు..

 

 

 ఎన్. విజయేందర్ రెడ్డి

 జనరల్ అవేర్‌నెస్ ఫ్యాకల్టీ, హైదరాబాద్.

 

 

 మొత్తం 2,677 పంచాయతీ కార్యదర్శి ఉద్యోగాలకు ఏపీపీఎస్సీ ఫిబ్రవరి 23న పరీక్ష నిర్వహించనుంది. ఈ పరీక్షలో రెండు పేపర్లుంటాయి. 150 మార్కులకుండే పేపర్-1 జనరల్ స్టడీస్ సిలబస్‌లో ఏడు అంశాలను పేర్కొన్నారు. దీంట్లో ఏడో అంశంగా విపత్తుల నిర్వహణ ఉంది. ఈ విభాగం నుంచి 15-20 ప్రశ్నలు వచ్చే అవకాశముంది. ఇప్పటికే గ్రూప్-1, గ్రూప్-2, గ్రూప్-4 తదితర పరీక్షల జనరల్ స్టడీస్ పేపర్‌లలో విపత్తుల నిర్వహణపై ప్రశ్నలు వస్తున్నాయి. పంచాయతీ కార్యదర్శి పరీక్షలో వచ్చే ప్రశ్నలు కూడా ఇదే తరహాలో ఉంటాయని భావించవచ్చు.




 

 ఏ విభాగాల నుంచి వస్తాయి?

 విపత్తులు ఎలా సంభవిస్తాయి?

 విపత్తులు- రకాలు.

 విపత్తులు సంభవించినప్పుడు స్పందించాల్సిన విధానం.

 విపత్తులు- నివారణ.

 నివారణ సాధ్యం కానప్పుడు వాటి ప్రభావాన్ని ఎలా తగ్గించాలి?

 పునర్నిర్మాణ, పునరావాస కార్యక్రమాలు.

 ఆస్తి, ప్రాణ నష్టం నివారణ తదితర అంశాలపై ప్రశ్నలు వస్తాయి.




 

 పాత ప్రశ్నపత్రాలు కీలకం:

 వివిధ ఉద్యోగ నియామకాలకు సంబంధించి గతంలో ఏపీపీఎస్సీ నిర్వహించిన పరీక్షల ప్రశ్నపత్రాలను పరిశీలిస్తే చాలా ప్రశ్నలు వచ్చినవే వస్తున్నాయి. అందువల్ల అభ్యర్థులు తప్పనిసరిగా పాత ప్రశ్నపత్రాలను సేకరించి, ప్రాక్టీస్ చేయాలి. దీనివల్ల ప్రశ్నల క్లిష్టత, ప్రశ్నలు అడిగే విధానం అవగతమవుతుంది. ఉ్ఠ:

 1.సునామి అనే మాట ఏ భాష నుంచి వచ్చింది?

 జవాబు:    జపనీస్

 2:జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ ఎక్కడ ఉంది?

 జవాబు:    న్యూఢిల్లీ

 3:జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీ చైర్మన్ ఎవరు?

 జవాబు:    ప్రధానమంత్రి




 

 సహజసిద్ధ విపత్తులు:

 సహజసిద్ధమైన విపత్తులలో వరదలు, హరికేన్లు, తుపానులు, భూకంపాలు, అగ్నిపర్వతాల విస్ఫోటనం, కరువు, సునామీ తదితరాల గురించి తెలుసుకోవాలి. ఇలాంటి విపత్తులు సంభవించినప్పుడు తీసుకోవాల్సిన చర్యల గురించి క్షుణ్నంగా చదవాలి. దాదాపు అన్ని ప్రశ్నలు వీటి కేంద్రంగానే వస్తున్నాయి.

 జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ (ఎన్‌డీఎంఏ), దాని చైర్మన్, బాధ్యతలు, విధుల గురించి ప్రశ్నలు వస్తాయి. రాష్ట్ర, జిల్లా స్థాయిలో కూడా విపత్తు నిర్వహణకు ప్రత్యేక యంత్రాంగాలను ఏర్పాటు చేశారు. ఈ యంత్రాంగాల నిర్మాణం, బాధ్యతలు తదితరాల గురించి తెలుసుకోవాలి.

 ఇటీవల కాలంలో సంభవించిన విపత్తులపై ప్రత్యేకంగా దృష్టిసారించాలి. 2004, డిసెంబర్ 26న హిందూ మహాసముద్రంలో సంభవించిన సునామీ, దాని ప్రభావం వల్ల నష్టపోయిన దేశాలు (ఇండోనేషియా, శ్రీలంక, ఇండియా, థాయిలాండ్, మాల్దీవులు మొదలైనవి..), ప్రాణ నష్టం (2,30,000) వంటి విషయాలను చదవాలి. 2013లో సంభవించిన ఫైలిన్, హెలెన్, లెహర్ వంటి తుపానులు, ఉత్తరాఖండ్ వరదలపై దృష్టిసారించాలి. వివిధ విపత్తుల గురించి చదివేటప్పుడు ఆంధ్రప్రదేశ్‌ను ప్రత్యేకంగా దృష్టిలో ఉంచుకొని అధ్యయనం చేయాలి.




 

 విపత్తులు- ఉపశమన చర్యలు:

 విపత్తు నిర్వహణ అనేది వివిధ కార్యక్రమాల సమాహారం. విపత్తుకు ముందు, విపత్తు సమయంలో, విపత్తు అనంతరం చేపట్టే కార్యక్రమాలను కలిపి సంయుక్తంగా విపత్తు నిర్వహణ అనొచ్చు. విపత్తు తీవ్రతను తగ్గించేందుకు చేపట్టే చర్యలు ఉపశమన చర్యలు. ఈ చర్యల్లో ప్రజలు, ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలకూ భాగస్వామ్యం ఉంటుంది. వీటికి సంబంధించి కూడా ప్రశ్నలు వచ్చే అవకాశముంది.

 ఒక విపత్తు కచ్చితంగా ఏ తేదీన సంభవించింది? ఎంతమంది మరణించారు? వంటి ప్రశ్నలు కూడా అడుగుతున్నారు. విద్యార్థులు వివిధ విపత్తులను గురించి అధ్యయనం చేసేటప్పుడు ఈ దిశగా కూడా ప్రిపరేషన్ కొనసాగించాలి.

 దేశంలో రకరకాల విపత్తులకు ప్రత్యేకంగా నోడల్ మంత్రిత్వశాఖలు ఉన్నాయి. ఈ విభాగం నుంచి ఒకట్రెండు ప్రశ్నలు వస్తున్నాయి. అందువల్ల ఈ విభాగాన్ని తప్పనిసరిగా అధ్యయనం చేయాలి. ఉదాహరణకు జీవ విపత్తులకు సంబంధించి కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ నోడల్ మంత్రిత్వ శాఖగా వ్యవహరిస్తోంది.

 

 పెద్ద ఎత్తున సంభవించే ప్రకృతి సిద్ధ విపత్తులు: భూకంపాలు, సునామీలు, వరదలు, తుపానులు, కరువులు.

 ........................................................




 భారీ ఎత్తున సంభవించే మానవపూరిత

 విపత్తులు: యుద్ధాలు, రసాయన విస్ఫోటనాలు, కాలుష్యం, అణు ప్రమాదం, అడవుల నిర్మూలన (Deforestation).

 ........................................................




 స్వల్ప ప్రకృతి సిద్ధ విపత్తులు: చలిగాలులు (Cold wave) ఉరుములతో కూడిన తుపానులు, వడగాలులు (Heat wave).

 ........................................................




స్వల్ప మానవ పూరిత విపత్తులు: రోడ్డు,  రైలు ప్రమాదాలు, కొట్లాటలు, విషపూరిత ఆహారం (Food poisoning), పారిశ్రామిక విస్ఫోటనం, అగ్నిప్రమాదాలు.




 

 రిఫరెన్‌‌స బుక్స్

 సీబీఎస్‌ఈ 8, 9 తరగతుల పాఠ్యపుస్తకాల్లోని విపత్త నిర్వహణ అంశాలు.

 నేషనల్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ (ఎన్‌డీఎంఏ) అధికారిక వెబ్‌సైట్:www.ndma.gov.in

 కేంద్ర హోం మంత్రిత్వ శాఖ అధికారిక వెబ్‌సైట్: www.mha.nic.in




 

 నమూనా ప్రశ్నలు

 

 1.ప్రపంచ విపత్తు నివేదికను ఎవరు తయారు చేస్తారు?

 ఎ) ప్రపంచ బ్యాంకు

 బి) అంతర్జాతీయ రెడ్‌క్రాస్, రెడ్ క్రిసెంట్

 సి) ఐఎంఎఫ్

 డి) యునెటైడ్ నేషన్స్

 

 2.ఆంధ్రప్రదేశ్‌లో విపత్తు నిర్వహణ కేంద్రమేది?

 ఎ)ఆంధ్రప్రదేశ్ అకాడమీ ఆఫ్ రూరల్ డెవలప్‌మెంట్

 బి)ఆంధ్రప్రదేశ్ పోలీస్ అకాడమీ

 సి)నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్‌మెంట్

 డి)మర్రి చెన్నారెడ్డి హ్యూమన్ రిసోర్స్ డెవలప్‌మెంట్ ఇన్‌స్టిట్యూట్

 

 3.భూకంపాలకు సంబంధించిన పరిశోధనలు, వనరులు, నెట్‌వర్క్ ఉన్న సంస్థ ఏది?

 ఎ)అస్సాం అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజీ, గువహటి

 బి)యశ్వంత్‌రావ్ చవాన్ అకాడమీ ఆఫ్ డెవలప్‌మెంట్ అడ్మినిస్ట్రేషన్- పుణె

 సి)అడ్మినిస్ట్రేటివ్ ట్రైనింగ్ సెంటర్, కోల్‌కతా

 డి)డిజాస్టర్ మేనేజ్‌మెంట్ ఇన్‌స్టిట్యూట్- భోపాల్

 

 4.ఆసియా విపత్తు తగ్గింపు కేంద్రం ఎక్కడుంది?

 ఎ) బ్యాంకాక్

 బి) మనీలా

 సి) జకార్తా     

 డి) కోబ్ (జపాన్)

 

 5.భారత వాతావరణ శాఖ ప్రకారం కరువు అంటే?

 ఎ)సామాన్య వర్షపాతంలో 75 శాతం కంటే తక్కువగా ఉంటే

 బి)50శాతం కంటే వర్షపాతం తగ్గితే తీవ్రమైన కరువు

 సి)1 అండ్ 2    

 డి)ఏదీకాదు

 

 6.విపత్తు నిర్వహణ ప్రక్రియ ఏది?

 ఎ) నిర్మూలన, రక్షిత చర్యలు

 బి) సమాయత్తత

 సి) ఉపశమన చర్యలు

 డి) పైవన్నీ

 

 7.ఐఎస్‌డీఆర్ అంటే ఏమిటి?

 ఎ) ఇంటర్నేషనల్ స్పేస్ డెవలప్‌మెంట్ రీసెర్చ్

 బి) ఇంటర్నేషనల్ స్ట్రాటజీ ఫర్ డిజాస్టర్ రిడక్షన్

 సి) ఇండియన్ స్పేస్ డెవలప్‌మెంట్ రీసెర్చ్

 డి) ఇండియన్ స్ట్రాటజీ ఫర్ డిజాస్టర్ రిడక్షన్

 

 8.విపత్తు నిర్వహణ ఖర్చుకోసం ఏ నిధి నుంచి గ్రహిస్తారు?

 ఎ) ప్రణాళికా వ్యయం     

 బి) సంఘటిత నిధి

 సి) ప్రణాళికేతర ఖర్చులు

 డి) ఇతర నిధులు

 

 9.ఎపి సెంటర్ అనే పదం దేనికి సంబంధించిది?

 ఎ) భూకంపాలు     

 బి) తుఫాన్లు

 సి) వరదలు

 డి) రసాయన ప్రమాదాలు

 

 10.జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీ ఉపాధ్యక్షుడు?

 ఎ) చిదంబరం     

 బి) శశిధర్‌రెడ్డి

 సి) శరద్‌పవార్     

 డి) ఫరూక్ అబ్దుల్లా

 

 11.కింది వాటిలో జీవ సంబంధ విపత్తు ఏది?

 ఎ) వడగండ్ల వాన

 బి) ఖనిజ సంబంధ మంటలు

 సి) అంటు వ్యాధులు    

 డి) చమురు సంబంధ విపత్తులు

 

12.పదో పంచవర్ష ప్రణాళిక ప్రకారం ఏ విపత్తుల వల్ల అధిక మరణాలు సంభవించాయి?

 ఎ) వరదలు, వేగవంతమైన గాలులు

 బి) భూకంపాలు    

 సి) కరువులు

 డి) భూపాతాలు

 

 సమాధానాలు:

 1) బి 2) ఎ 3) ఎ 4) డి 5) సి 6) డి 7) బి 8) బి 9) ఎ 10) బి 11) సి 12) ఎ

Read latest Education News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top