సమాచారహక్కుకు మరో గండం

Threat To Right To Information Act - Sakshi

ప్రాథమిక హక్కుల పరిధి విస్తృతమవుతున్నకొద్దీ ప్రజాస్వామ్య దేశంలో పౌరుల శక్తి పెరుగు తుంది. దేన్నయినా బహిరంగంగా నిలదీయగలిగే ధైర్యం వారికొస్తుంది. ఏ అంశాన్నయినా ప్రశ్నించి సంపూర్ణ సమాచారం రాబట్టే హక్కు, అధికారం వారికి లభిస్తాయి. సరిగ్గా ఈ కారణాలే 2005లో అమల్లోకొచ్చిన సమాచార హక్కు చట్టానికి తరచు ముప్పు తెచ్చిపెడుతున్నాయి. ఈ చట్టం పరిధిలోకి మేం రామంటే... మేం రామని ఎవరికి వారు మొరాయిస్తున్న ధోరణులు, తప్పిం చుకుందామని చూసే తత్వం కనబడుతున్నాయి. పాలకుల నుంచి రాజకీయ పార్టీలు, వివిధ ప్రభుత్వ విభాగాల వరకూ అందరిదీ ఇదే వరస. ఇక క్షేత్ర స్థాయిలో సమాచారం రాబట్టడానికి ప్రయత్నించేవారి వివరాలు తెలుసుకుని బెదిరించడం, దాడులు చేయడం, కొన్ని సందర్భాల్లో హత మార్చడం వంటివి నిత్యం జరుగుతూనే ఉన్నాయి. ఇవన్నీ చాలవన్నట్టు ఇప్పుడు సమాచార హక్కు కమిషనర్లపై వచ్చే ఫిర్యాదుల్ని పరిశీలించేందుకు, తగిన నిర్ణయం తీసుకునేందుకు ఉన్నతాధికారు లతో కూడిన రెండు కమిటీలను ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం తలపెడుతోంది. ఇందులో ఒక కమిటీ సమాచార ప్రధాన కమిషనర్‌(సీఐసీ)పైన వచ్చే ఫిర్యాదుల్ని, మరో కమిటీ సమాచార  కమిషనర్లపై వచ్చే ఫిర్యాదుల్ని పరిశీలిస్తాయని ఆ ప్రతిపాదన సారాంశం.

దాని ప్రకారం సీఐసీపై ఫిర్యాదుల్ని పరిశీలించే కమిటీలో కేంద్ర కేబినెట్‌ కార్యదర్శి, సిబ్బంది వ్యవహారాలు, శిక్షణ విభాగం కార్యదర్శి, ఒక రిటైర్డ్‌ సీఐసీ ఉంటారు. కమిషనర్లపై వచ్చే ఫిర్యాదుల్ని కేబినెట్‌ సెక్రటేరియట్‌లోని కార్యదర్శి, సిబ్బంది వ్యవహారాలు, శిక్షణ విభాగం కార్యదర్శి, ఒక రిటైర్డ్‌ సమాచార కమిషనర్‌ ఉంటారు. ఆరోపణలకూ లేదా ఫిర్యాదులకూ ఎవరూ అతీతం కాదు. అవి నిజమని తేలితే అందుకు కారకులైనవారిని బాధ్యతల నుంచి తప్పించడం కూడా సబబే. కానీ అటువంటి ఏర్పాటు సమాచార హక్కు చట్టంలో ఇప్పటికే ఉంది.  ఏవైనా ఫిర్యాదులున్న పక్షంలో రాష్ట్రపతి వాటిని సుప్రీంకోర్టుకు నివేదించాలని ఆర్టీఐ చట్టంలోని సెక్షన్‌ 14(1) చెబుతోంది. ఆ ఫిర్యాదులపై విచా రణ జరిపి అవి నిజమని సుప్రీంకోర్టు నిర్ధారిస్తే సీఐసీని లేదా కమిషనర్లను రాష్ట్రపతి తొలగించ వచ్చు. సమాచార కమిషన్‌ ప్రధాన బాధ్యతే ప్రభుత్వ యంత్రాంగంలోని వివిధ శాఖల, విభాగా లపై వచ్చే ఫిర్యాదుల్ని పరిశీలించి తగిన ఆదేశాలివ్వడం గనుక సీఐసీ, కమిషనర్ల ఫిర్యాదుల్ని పరిశీలించే అధికారం ప్రభుత్వానికి అప్పగించరాదని ఆర్టీఐ చట్టం చేసినప్పుడు నిర్ణయించారు. ఇప్పుడు దీన్ని మార్చవలసిన అవసరం ఎందుకొచ్చిందో, ఇప్పుడున్న ఏర్పాటు వల్ల ప్రభుత్వాని కొచ్చిన ఇబ్బందేమిటో తెలియదు. అసలు ఈ ప్రతిపాదన కోసం చట్టాన్ని సవరించదల్చుకున్నారా లేక మరే మార్గంలోనైనా అమలు చేయాలని సంకల్పించారా అన్నది వెల్లడించలేదు.

కేంద్రం తాజా ప్రతిపాదన చట్టంగా మారితే వచ్చే అనర్థాలు అన్నీ ఇన్నీ కాదు. సమాచార కమిషనర్లు స్వేచ్ఛగా, నిర్భయంగా పనిచేయడానికి ఇది ఆటంకంగా మారుతుంది. పౌరులు కోరే సమాచారాన్ని అందించాల్సిందేనని ఏ ప్రభుత్వ విభాగాన్నయినా సమాచార కమిషన్‌ ఆదేశిస్తే ఆ ఆదేశాలిచ్చినవారికి తిప్పలు మొదలవుతాయి. వారిపై వెల్లువలా ఫిర్యాదులు పుట్టుకొస్తాయి. ఉన్నతాధికారులతో కూడిన కమిటీ ఆ ఫిర్యాదులపై విచారిస్తుంటే ఏ కమిషనర్‌ అయినా ప్రభుత్వ విభాగాలపై తన ముందుకొచ్చే అర్జీల విషయంలో నిష్పక్షపాతంగా, నిర్భయంగా ఆదేశాలివ్వడం సాధ్యమవుతుందా? సారాంశంలో దానివల్ల అంతిమంగా నష్టపోయేది పౌరులే. ఇప్పటికే సమా చార హక్కు చట్టం తీసుకొచ్చిన ఉద్దేశం దెబ్బతినేలా వివిధ శాఖలు వ్యవహరిస్తున్నాయి. పౌరుల నుంచి ఫలానా సమాచారం కావాలని అడిగినప్పుడు ఎడతెగని జాప్యం చేస్తున్నాయి. ఇక్కడ కాదు... అక్కడ అంటూ తిప్పుతున్నాయి. చివరకు ఆ సమాచారం తాము ఇవ్వాల్సిన అవసరం లేదని చెబుతున్నాయి. ఆ శాఖలపై వచ్చే ఫిర్యాదుల గురించి సమాచార కమిషన్‌ నిలదీసినప్పుడు సైతం ఇదే తరహాలో ఆలస్యంగా జవాబిస్తున్నాయి.

చివరకు ఆ సమాచారం ఇవ్వాల్సిందేనని ఆదేశాలొచ్చాక తప్పనిసరి పరిస్థితుల్లో అందజేస్తున్నాయి. అసలు ఆ చట్టం అమల్లోకి తెచ్చినప్పుడే దేశ భద్రత పేరు చెప్పి 22 సంస్థలను దాని పరిధి నుంచి తప్పించారు. ఆ తర్వాత కాలంలో ఆ జాబితాలో అనేకం వచ్చి చేరాయి. మరికొన్ని శాఖలు తమనూ చేర్చాలని అడుగుతున్నాయి. ఇక రాజకీయ పార్టీల సంగతి చెప్పనవసరమే లేదు. అందరికీ ఆదర్శంగా ఉండాల్సిన పార్టీలు తాము దీని పరిధిలోకి ఎలా వస్తామని ప్రశ్నిస్తున్నాయి. న్యాయవ్యవస్థ కూడా ఈ చట్టం తమకు వర్తించ బోదన్న సమాధానమే ఇస్తోంది. సమాచార హక్కు చట్టం తీసుకురావడంలోని ఉద్దేశమే పార దర్శకత. కానీ ఆ పారదర్శకత మాదగ్గర సాధ్యం కాదని చెప్పేవారే పెరుగుతున్నారు!నిరుడు సమాచార ప్రధాన కమిషనర్, ఇతర కమిషనర్ల జీతభత్యాలు, హోదాలు, పదవీకాలం వగైరా నిబంధనల్లో మార్పులు తీసుకొస్తూ ఆర్టీఐ చట్టానికి కేంద్రం సవరణలు ప్రతిపాదించింది.

రాజ్యసభలో ఆ బిల్లును కూడా ప్రవేశపెట్టడానికి ప్రయత్నించింది. కానీ విమర్శలు రావడంతో వెనక్కి తగ్గింది. ఆర్టీఐ చట్టం సీఐసీకి ప్రధాన ఎన్నికల కమిషనర్‌ హోదా, సమాచార కమిషనర్లకు ఎన్నికల కమిషనర్ల హోదాను ఇచ్చింది. అలాగే రాష్ట్రాలోని సమాచార ప్రధాన కమిషనర్లకు కేంద్ర ఎన్నికల కమిషనర్ల హోదా, అక్కడి సమాచార కమిషనర్లకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి హోదా ఇచ్చారు. జీతభత్యాలు కూడా ఆ హోదాలకు తగినట్టు నిర్ణయించారు. దీన్నంతటినీ మారిస్తే సమాచార హక్కు చట్టం ఉద్దేశమే దెబ్బతింటుందని, ఇది అంతిమంగా పౌరుల ప్రాథమిక హక్కును దెబ్బ తీస్తుందని అనేకులు విమర్శించారు. కారణమేదైనా ఆ సవరణ బిల్లు ప్రతిపాదన ఆగింది. మళ్లీ ఇప్పుడు తాజా ప్రతిపాదన ముందుకొచ్చింది. ప్రజాస్వామ్యానికి పారదర్శకతే ప్రాణప్రదం. దాన్ని నీరుగార్చాలని చూడటం సబబు కాదు. తాజా ప్రతిపాదనను కేంద్రం ఉపసంహ రించుకోవాలి.

Read latest Editorial News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top