వృథా చర్చలేల?!

Kamal Hassan Comments On Hindus - Sakshi

సినీ నటుడు, మక్కల్‌ నీది మయ్యమ్‌(ఎంఎన్‌ఎం) పార్టీ వ్యవస్థాపకుడు కమల్‌హాసన్‌ ‘స్వతంత్ర భారతంలో తొలి ఉగ్రవాది హిందువు. అతని పేరు నాథూరాం గాడ్సే’ అని వ్యాఖ్యానించి పెద్ద దుమారం రేపారు. ‘ముస్లింలు ఎక్కువగా ఉండే ప్రాంతం కాబట్టి తాను ఈ వ్యాఖ్యలు చేయడం లేద’ని కూడా ఆయన సెలవిచ్చారు. ఎన్నికల ప్రచారంలో నాయకులు ఏదో ప్రయోజనం, పర మార్థం లేకుండా ఏదీ మాట్లాడరు. కమల్‌ కాకలు తీరిన రాజకీయ నాయకుడు కాకపోవచ్చు. ఈమధ్యకాలంలోనే ఆయన పూర్తి స్థాయి రాజకీయ నేత అవతారం ఎత్తి ఉండొచ్చు. కానీ ఆయనకు రాజకీయాలు బాగానే ఒంటబట్టాయని ఈ వ్యాఖ్యలు రుజువు చేస్తున్నాయి. అయితే వాటికి అవస రమైన లౌక్యం ఆయనకు ఇంకా పూర్తిగా పట్టుబడినట్టు లేదు. అందుకే ‘ముస్లింలు ఎక్కువగా ఉండే ప్రాంతం కాబట్టి’ ఇలా అనడం లేదని తనకుతానే సంశయాన్ని రేకెత్తించారు. సహజంగానే కమల్‌హాసన్‌ వ్యాఖ్యలకు అనుకూలంగా, వ్యతిరేకంగా ప్రకటనలు వెలువడ్డాయి. బీజేపీ ఎన్నికల సంఘా నికి ఫిర్యాదు చేస్తే, ఢిల్లీ హైకోర్టులో ఆ పార్టీకి చెందిన నాయకుడొకరు ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ వేరేచోట ‘ఒక హిందువు ఉగ్రవాద చర్యలో పాల్గొన్న ఘటన చరిత్రలో ఒక్కసారైనా ఉందా?’ అని అడగటాన్ని దృష్టిలో పెట్టుకుని కమల్‌ ఈ మాట అన్నారు.

మాకు ఏ మతమూ లేదని చెప్పుకునే వారి సంఖ్య ప్రపంచంలో అత్యల్పం గనుక పుట్టిన ప్రతి ఒక్కరూ ఏదో ఒక మత విశ్వాసాన్ని అనుసరించే కుటుంబాల్లోనే జన్మిస్తారు. ఎదిగాక ఆ విశ్వాసా లను వారు అనుసరించవచ్చు. నిరాకరించవచ్చు. ఆ విశ్వాసాలను భక్తిశ్రద్ధలతో అనుసరిస్తున్నా మని అనుకుంటూ అవాంఛనీయ కార్యకలాపాలకు పాల్పడేవారు గతంలోనూ ఉన్నారు. ఇప్పుడు ఉన్నారు. అయితే అలాంటివారిని వారు పుట్టిన మతంతో గుర్తించడం అసమంజసం. ఉగ్రవాదులు తమది ఫలానా మతం అని చెబుతుండవచ్చు. ఆ మతాన్ని ఉద్ధరించడానికే తాము ఇలాంటి చర్య లకు పాల్పడుతున్నట్టు వారు అడపా దడపా ప్రకటనలు చేస్తుండవచ్చు.

కానీ వారిని నెత్తిన పెట్టు కుని, సొంతం చేసుకోవాలని ఏ మతమూ తహతహలాడిన దాఖలా లేదు. పైగా వారి చర్యలు తమ మత విశ్వాసాలకు విరుద్ధమని అనేక సందర్భాల్లో ఎందరో మతాచార్యులు చెప్పారు. కనుక ‘ఒక హిందువు ఉగ్రవాద చర్యలో పాల్గొన్న ఘటన ఉందా’ అని మోదీ అడగడమైనా, అందుకు కమల్‌ ‘స్వతంత్ర భారతంలో తొలి ఉగ్రవాది హిందువు’ అని చెప్పడమైనా అసమంజసం. ఎన్నికల్లో చర్చించడానికి బోలెడు అంశాలున్నాయి. అందరూ సమష్టిగా కృషి చేస్తే తప్ప పరిష్కారంకాని జటి లమైన సమస్యలు అనేకం ఉన్నాయి. వాటిని విడిచిపెట్టి ఒక అశాస్త్రీయ భావనను ఈడ్చుకొచ్చి దానిచుట్టూ చర్చ జరిగేలా చేయడం వల్ల సామాన్య ప్రజానీకానికి ఒరిగేదేమీ ఉండదు.

మహాత్మా గాంధీని పొట్టనబెట్టుకున్న నాథూరాం గాడ్సే గురించి, అతడు ఆ చర్యకు పాల్పడ్డం వెనకగల కారణాల గురించి ‘గాంధీజీస్‌ మర్డర్‌ అండ్‌ ఆఫ్టర్‌’ అనే గ్రంథంలో అతడి సోదరుడు గోపాల్‌ గాడ్సే రాశాడు. ఆ పుస్తకం చివర నాథూరాం వీలునామాను అనుబంధంగా ఇచ్చారు. దాని ప్రకారం గాంధీజీపై తనకెంతో గౌరవాభిమానాలున్నా ఆయన ముస్లిం అనుకూల వైఖరి తనకు ఆగ్రహం తెప్పించిందని నాథూరాం చెప్పడాన్ని చూడొచ్చు. దేశ విభజనకు కారణం కావడమేకాక, ఇలా ముస్లింలపట్ల సానుకూల దృక్పథం ఉండటాన్ని జీర్ణించుకోలేకపోయానని కూడా అందులో చెప్పాడు. గాంధీజీపై ఇలాంటి అభిప్రాయాలు నాథూరాంలో ఏర్పడటానికి కారణం అతను పుట్టిన మతం కాదు. ఆ మత విశ్వాసాలు కాదు. ఆ పేరిట వెలసిన సంస్థల్లో అతను చురుగ్గా పనిచేశాడు. భిన్న అంశాలపై ఆ సంస్థల వైఖరులు, ఆచరణ అతన్ని రూపొందించాయి. ఆ ఘటన జరిగేనాటికి నాథూరాం చర్యను ఉగ్రవాదంగా పరిగణించాలన్న స్పృహ ఉండకపోవచ్చు. కానీ ఇప్పటి అర్ధంతో అది ఖచ్చితంగా ఉగ్రవాద చర్యే అవుతుందనడంలో సందేహం లేదు. అతగాడు హిందువుల కోసం ఏదో చేస్తున్నానని అనుకునే ఆ పని చేసినా వారెవరూ అతన్ని సొంతం చేసుకోలేదు. నెత్తిన పెట్టుకోలేదు. 

ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాదులు జోరుగా చెలరేగడం మొదలుపెట్టి రెండు దశాబ్దాలవుతోంది. అంతకుముందు ఉగ్రవాద ఘటనలున్నా అవి చెదురుమదురుగా జరిగినవే. 2001లో అమెరికాలో అల్‌కాయిదా నేతృత్వంలో సాగిన మారణకాండ, పెను విధ్వంసం తర్వాత నుంచి ప్రపంచంలో ఏదో ఒక మూల ఒక పద్ధతి ప్రకారం ఉగ్రవాదులు పంజా విసురుతూనే ఉన్నారు. పలు ఇస్లామిక్‌ దేశాల్లో అమెరికా, దాని మిత్ర రాజ్యాలు రకరకాల పేర్లతో సాగించిన, ఇప్పటికీ సాగిస్తున్న దౌష్ట్యం అల్‌కాయిదా, ఐఎస్‌ వంటి ఉగ్రవాద సంస్థల పుట్టుకకు కారణం. ఆ సంస్థలు ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తూ ఆయా దేశాల్లో విధ్వంసానికి పాల్పడుతూ, అందుకు మతాన్ని అడ్డుపెట్టుకుంటున్నాయి.

కానీ ఇంతవరకూ ఉగ్రవాదికి, ఉగ్రవాదానికి నిర్దిష్టమైన, ప్రపంచంలో అందరికీ ఆమోదయోగ్య మైన నిర్వచనాలు లేవు. అలాగే మతానికీ, ఉగ్రవాదానికీ మధ్య ప్రగాఢమైన అనుబంధం ఉన్నదని తేల్చి చెప్పడానికి తగిన ఆధారాలు లేవు. 1980–2003 మధ్య జరిగిన ఆత్మాహుతి దాడుల్లో 315 ఘటనలు తీసుకుని అధ్యయనం చేసిన సామాజిక శాస్త్రవేత్త రాబర్ట్‌ పాపే ఈ దాడులకూ, ఇస్లామిక్‌ మతతత్వానికి మధ్య సంబంధం లేదని వివరించారు. అమెరికా రచయిత మైకేల్‌ షిహాన్‌ సైతం ఇలాగే చెప్పారు. ఉగ్రవాద బృందాలన్నీ తమ రాజకీయ లక్ష్యాలను కప్పెట్టి, ప్రజామోదం పొంద డం కోసం మతాన్ని, సంస్కృతిని అడ్డుపెట్టుకుంటాయన్నారు. ఉగ్రవాదులు ఏ పేరు చెప్పుకున్నా వారు మొత్తం మానవాళికే శత్రువులు. వారిని మతకోణంలో చూసి, దాని ఆధారంగా వారిపై అభి మానాన్ని లేదా శత్రుత్వాన్ని ఏర్పరచుకోవటం అసమంజసం. మన రాజకీయ నాయకులు ఈ సత్యాన్ని గ్రహించి వ్యర్థమైన చర్చలకు ఇకనైనా ముగింపు పలకాలి.

Read latest Editorial News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top