దిగజారుడు రాజకీయం

Hardik Patel video : Decelerating politics in Gujarat elections - Sakshi

సాధారణ సమయాల్లో ధర్మపన్నాలు వల్లిస్తూ, బరువైన సందేశాలిచ్చే నాయకులు ఎన్నికల రుతువొచ్చేసరికి శివాలెత్తి నోరు పారేసుకోవడం మన దేశంలో చాన్నాళ్ల నుంచి రివాజైంది. ప్రత్యర్థులపై వారుపయోగించే భాష వినడానికి, తిరిగి చెప్ప డానికి వీల్లేని స్థాయిలో ఉంటున్నదని అందరూ మథనపడుతున్న వేళ పరిస్థితి మరింతగా దిగజారినట్టు కనబడుతోంది. గుజరాత్‌లో పటీదార్లకు ఉద్యమానికి నాయకత్వం వహించిన హార్దిక్‌ పటేల్‌పై అసెంబ్లీ ఎన్నికల వేళ సామాజిక మాధ్య మాల్లో బయటి కొస్తున్న వీడియో క్లిప్పింగ్‌లు దిగ్భ్రాంతి కలిగిస్తున్నాయి. అతను హోటల్‌ రూంలో ఒక మహిళతో ఉన్న దృశ్యం, ఒక యువతితోపాటు హార్దిక్‌ మిత్ర బృందం కలిసి ఉన్న దృశ్యం ఆ క్లిప్పింగ్‌ల్లో ఉన్నాయి.

ఎన్నికల ప్రచార పర్వంలో తమను వేధిస్తున్న సమస్యలపైనా, అందుకు గల కారణాలపైనా చర్చ జరగాలని...ఆ సమస్యలకు పరిష్కారం లభించాలని ప్రజలు ఆశిస్తారు. కానీ అందుకు భిన్నంగా ఈ వీడియో దృశ్యాలు ప్రచారంలోకొస్తున్నాయి. వీటిని ప్రచారంలో పెట్టినవారు తమ చర్య ద్వారా గుజరాత్‌ సమాజానికి, దేశానికి ఏం సందేశం ఇవ్వదల్చుకున్నారో అనూహ్యం. కానీ వయసొచ్చిన ఒక అబ్బాయి, అమ్మాయి వారి ఇష్ట ప్రకారం ఏకాంతంగా ఉంటే దాన్ని రహస్యంగా వీడియో తీయడం, ప్రచారంలో పెట్టడం ఏం సంస్కారమో ఆ తీసినవారికే తెలియాలి. వీటి బాధ్యు లెవరో కానీ... ఈ ఎన్నికల్లో తాను బీజేపీని వ్యతిరేకిస్తున్నందువల్ల వారే ఇలా చేశారని హార్దిక్‌ ఆరోపిస్తున్నారు. ఆయన అన్నందుకు కాకపోయినా బీజేపీ ఇలాంటి విపరీత ధోరణులను ఖండించాల్సింది. యువ దళిత నాయకుడు జిగ్నేష్‌ మేవానీ చెప్పినట్టు వ్యక్తిగత గోప్యత, శృంగారం రాజ్యాంగం కల్పించిన హక్కులు. వీటికి భంగం కలిగించే అధికారం ఎవరికీ లేదు. ఇందుకు బదులుగా పటీదార్‌ ఉద్యమ సహేతుకతనూ, బీసీలుగా గుర్తింపు కావాలంటున్న ఆ ఉద్యమ డిమాండ్‌లోని లోపాలనూ చర్చిస్తే వేరుగా ఉండేది. కనీసం రాజకీయంగా హార్దిక్‌ కాంగ్రెస్‌తో కల వడాన్ని ప్రశ్నించినా అర్ధం చేసుకోవచ్చు. ఇందులో ఎవరి అవకాశవాదమెంతో చెప్పవచ్చు. అదేమీ లేకుండా ‘మోరల్‌ పోలీసింగ్‌’కు దిగి నీతులు వల్లిద్దామను కోవడమే అభ్యంతరకరం.

గుజరాత్‌ చిన్న రాష్ట్రమైనా అక్కడ జరిగే ఎన్నికలపై దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. ఆ రాష్ట్రం ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షాల స్వస్థలం కావడమే అందుకు ప్రధాన కారణం. పైగా 1998 మొదలుకొని గుజరాత్‌ వరసగా బీజేపీకే పట్టం కడుతోంది. నరేంద్రమోదీ 2001 నుంచి 2014లో ప్రధాని అయ్యేవరకూ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఆయన పాలనా కాలంలో కాంగ్రెస్‌ సర్వశక్తులూ ఉడిగిపోయి క్షీణించింది. పంచాయతీ ఎన్నికలు మొదలు పార్లమెంటు ఎన్నికల వరకూ అన్నిటా బీజేపీదే అక్కడ విజయం. అయితే నరేంద్రమోదీ ఆ రాష్ట్రాన్ని విడిచిపెట్టాక ఈ స్థితి మారింది. ముఖ్యంగా ప్రభుత్వో ద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించాలంటూ పటీదార్లు 2015లో ఉద్యమించడం ప్రారం భించాక ఆ పార్టీకి ఎదురుగాలి మొదలైంది. ఆ ఉద్యమంలో పెద్దయెత్తున హింస చెలరేగడం, లాఠీచార్జిలు, పోలీసు కాల్పులతో ఆ రాష్ట్రం అట్టుడికిపోయింది. దాని పర్యవసానం త్వరలోనే బీజేపీకి అర్ధమైంది. 2015 చివరిలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో 31 జిల్లా పంచాయత్‌లకూ కాంగ్రెస్‌ 24 గెల్చుకుంది. దాదాపు రెండు దశాబ్దాల కాలంలో బీజేపీకి ఇది తొలిసారిగా తగిలిన షాక్‌. పట్టణ, నగర ప్రాంతాలు మాత్రమే బీజేపీని ఆదరించాయి. పర్యవసానంగా నిరుడు ఆగస్టులో ఆనందీబెన్‌ పటేల్‌ తప్పుకోవాల్సివచ్చింది. గుజరాత్‌ పారిశ్రామికాభివృద్ధి వల్ల ఎగువ మధ్యతరగతి, మధ్య తరగతి వర్గాలు బాగుపడినా కిందిస్థాయి వర్గాల స్థితిగతులు అంతంతమాత్రంగానే ఉన్నాయి. వరస కరువులు ఒకపక్కా, సంస్క రణల వల్ల చిన్న తరహా పరిశ్రమల మూత మరోపక్కా కుంగదీయడంతో పటీదార్ల ఆర్ధిక స్థితి దారుణంగా దెబ్బతింది. గోరక్షకుల దాడుల తర్వాత ఆ రాష్ట్రంలో కనీవినీ ఎరుగని స్థాయిలో దళిత ఉద్యమం వేళ్లూనుకుంది.

న్యాయంగా అయితే అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ఇవన్నీ చర్చకు రావాలి. కానీ చిత్రంగా 24 ఏళ్ల యువకుడు హార్దిక్‌ పటేల్‌ ఒక యువతితో ఉన్న దృశ్యాలు చర్చనీయాంశంగా మారాయి. గుజరాత్‌ ఎన్నికల సంరంభం మొదలైనప్పటినుంచీ ఇదే తంతు కనబడుతోంది. అంతక్రితం హార్దిక్‌ అనుచరులిద్దరు హఠాత్తుగా అత నిపై ఆరోపణలు చేస్తూ బీజేపీలో చేరారు. ఆ తర్వాత బీజేపీ తమను ప్రలోభపెట్టిందంటూ డబ్బుతో సహా మీడియా ముందుకొచ్చారు. అలాగే తమతో బీజేపీ నేత ఒకరు బేరసారాలాడిన ఫోన్‌ సంభాషణను బయటపెట్టారు. ఇవన్నీ చూసి బీజేపీ ఏటికి ఎదురీదుతున్నదని అనుకోవడానికి లేదు. అక్కడ పటీదార్, బీసీ, దళిత వర్గాలకు చెందిన ముగ్గురు యువ నాయకులు కాంగ్రెస్‌తో చెట్టపట్టాలు వేసుకున్నా విజయం మాత్రమే బీజేపీదేనని సర్వేలు చెబుతున్నాయి. కాంగ్రెస్‌కు రెండంకెలకు మించి స్థానాలు రావని అంటున్నాయి. మరెందుకింత ఆరాటమో అర్ధం కాదు.

సామాజిక మాధ్యమాలొచ్చాక అది సామాన్యుల చేతి ఆయుధమైందని సంబర పడేంతలోనే దాన్ని స్వప్రయోజనాలకు ఉపయోగించే శక్తుల ప్రాబల్యం పెరుగు తోంది. 30 దేశాల్లో ఈ మాధ్యమాల ద్వారా ఓటర్లను ఏమార్చారని ఫ్రీడం ఆఫ్‌ ది నెట్‌–2017 నివేదిక చెబుతోంది. అమెరికా అధ్యక్ష ఎన్నికలను రష్యా సహకారంతో ప్రభావితం చేశారన్న కథనాలు చదివాక జర్మనీ చాన్సలర్‌ ఏంజెలా మెర్కెల్‌ ఈ ఏడాది మొదట్లో దిద్దుబాటు చర్యలు తీసుకున్నారు. సామాజిక మాధ్యమాల ప్రభా వంపై పరిశోధనలు చేసిన యూనివర్సిటీ ఆచార్యుణ్ణి పిలిపించుకుని ఈ బెడదపై చర్చించి తగిన చట్టాలు చేశారు. ప్రత్యర్థులను ఎదుర్కొనగలిగారు. ప్రజాస్వా మ్యంలో ఎన్నికలనేవి కీలకమైనవి. మన నేతలు ఇప్పటికే కరెన్సీ నోట్లతో, బూట కపు హామీలతో, పరస్పర దూషణలతో వాటి స్థాయిని తగ్గించారు. పరిస్థితిని మరింత దిగజార్చి ఎన్నికలంటేనే ఏవగింపు కలిగిస్తే అంతిమంగా నష్టపోయేది పార్లమెంటరీ పార్టీలే. ఆ సంగతి అందరూ గ్రహించాలి.

Read latest Editorial News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top