నమ్మించి.. పాలేరు ప్రాణం తీసి.. రూ.52 లక్షలకు బీమా

Man Arrested In 2015 Murder Case In Avuku Kurnool - Sakshi

సాక్షి, అవుకు : డబ్బు కోసం ఓ టీడీపీ నాయకుడు దుర్మార్గానికి పాల్పడ్డాడు. తమ కుటుంబాన్ని నమ్ముకుని వచ్చిన పాలేరు ప్రాణం తీశాడు. అతని పేరుతో భారీ మొత్తానికి ఇన్సూరెన్స్‌ చేయించి.. ఆపై హత్య చేశాడు. రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించి ఇన్సూరెన్స్‌ కంపెనీ నుంచి రూ.31 లక్షలు కాజేశాడు. మరో రూ.15 లక్షలు రాబట్టుకునే ప్రయత్నంలో ఉండగా.. విషయం బయటపడింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

అవుకు మండలం మెట్టుపల్లె గ్రామానికి చెందిన శీగే ఈశ్వరరెడ్డికి వెంకటేశ్వరరెడ్డి, భాస్కర్‌రెడ్డి సంతానం. పెద్దకుమారుడైన వెంకటేశ్వరరెడ్డికి ప్యాపిలి మండలం గార్లదిన్నెకు చెందిన రాజమ్మతో రెండున్నర దశాబ్దాల క్రితం వివాహమైంది. అప్పటి వరకు రాజమ్మ పుట్టింట్లో పాలేరుగా ఉన్న వడ్డే సుబ్బరాయుడు ఆమెకు పెళ్లయిన తర్వాత మెట్టుపల్లెకు వచ్చి.. అక్కడ పనులు చేస్తుండేవాడు. తమ రెడ్డమ్మను నమ్ముకుని ఉంటే కూడు, గుడ్డకు లోటు ఉండదని భావించేవాడు. పదిహేనేళ్ల క్రితం రోడ్డు ప్రమాదంలో వెంకటేశ్వరరెడ్డి చనిపోయాడు. తన యజమానురాలి భర్త మృతి చెందినా  సుబ్బరాయుడు మాత్రం అక్కడే ఉంటూ పాలేరు పని చేస్తుండేవాడు. 

భాస్కర్‌రెడ్డికి దుర్బుద్ధి! 
వెంకటేశ్వరరెడ్డి సోదరుడు భాస్కర్‌రెడ్డి తెలుగుదేశం పార్టీ నాయకుడు. పదేళ్ల క్రితం గ్రామ సర్పంచ్‌గానూ పనిచేశాడు. ఇతను పాలేరును అడ్డంపెట్టుకుని అక్రమ మార్గంలో డబ్బు సంపాదించాలని పన్నాగం పన్నాడు. ఇందులో భాగంగా నా అన్న వారెవరూ లేని  సుబ్బరాయుడికి ఆధార్, రేషన్‌కార్డు తదితరాలను సమకూర్చి..అతని పేరున రెండు ట్రాక్టర్లు కొనుగోలు చేశాడు. అలాగే దాదాపు రూ.52 లక్షలకు ఓ ప్రైవేట్‌ కంపెనీలో ఇన్సూరెన్స్‌ చేశాడు. నాలుగైదు కంతుల ప్రీమియం కూడా కట్టాడు.  2015వ సంవత్సరంలో గ్రామంలో తనకు అత్యంత నమ్మకస్తులుగా ఉన్న ముగ్గురు వ్యక్తులు, అవుకుకు చెందిన మరో ఇద్దరితో కలిసి సుబ్బరాయుడిని హత్య చేసి..  ప్రమాదంగా చిత్రీకరించారు.

సుబ్బరాయుడు ప్రమాదంలో మృతి చెందాడంటూ ఇన్సూరెన్స్‌ కంపెనీని నమ్మించి.. మొదటివిడతలో సుమారు రూ.31 లక్షలు కాజేశాడు. రెండోవిడత కింద మరో రూ.15 లక్షలు రాబట్టుకోవడానికి ప్రయత్నిస్తుండగా..ఈ విషయం ఆ నోట ఈ నోట పడి పోలీసుల దృష్టికి వెళ్లింది. సుమోటోగా కేసు నమోదు చేసిన సీసీఎస్‌ పోలీసులు భాస్కరరెడ్డితో పాటు మరో నలుగురు వ్యక్తులను నాలుగు రోజుల క్రితం అదుపులోకి తీసుకున్నారు. అవుకుకు చెందిన మరో వ్యక్తి కోసం గాలిస్తున్నారు. ఈ కేసుకు సంబంధించి ఒకట్రెండు రోజుల్లో నిందితులను అరెస్టు చూపే అవకాశముంది.   

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top